మెరుగు పెడతామని నమ్మబలికి..
ABN , Publish Date - Nov 01 , 2026 | 12:13 AM
వెండి, బంగారం మెరుగుపెడతామని నమ్మబలికి ఇద్దరు వ్యక్తులు ఓ మహిళ నుంచి రెండు తులాల బంగారుతాడును అపహరించుకుపోయారు.
గజపతినగరం, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): వెండి, బంగారం మెరుగుపెడతామని నమ్మబలికి ఇద్దరు వ్యక్తులు ఓ మహిళ నుంచి రెండు తులాల బంగారుతాడును అపహరించుకుపోయారు. ఈ ఘటనపై ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్ నాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో ని పురిటిపెంట పంచాయతీలో గల చర్చి వీధిలో ఉన్న వెత్స గాయత్రీ ఇంటికి శనివారం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి.. వెండి, బంగారం మెరుగు పెడతామని నమ్మబలికారు. దీంతో ఆమె కొన్ని వెండి వస్తువులు ఇవ్వగా.. వాటిని తళతళ మెరిసే విధంగా చేసి చూపించారు. బంగారం ఉన్నా ఇలానే మెరుగుపెడతామని చెప్పడంతో మహిళ మెడలో ఉన్న రెండు తులాల తాడును వారికి అందజేసింది. బంగారు తాడు చేతిలో పడగానే వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. దీంతో బాధితురాలు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.