చెత్త ఇవ్వండి..కిరాణా సరుకులు తీసుకెళ్లండి
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:01 AM
పొడి చెత్తే కదా అని బయట పారబోస్తున్నారా? ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా విసిరేస్తున్నారా? అయితే మీరు నష్టపోతునట్లే.
- 17 నుంచి ‘స్వచ్ఛ్ రథం’ అమలుకు శ్రీకారం
- గ్రామాల్లో పొడి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణే లక్ష్యం
- మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
- జిల్లా యంత్రాంగం సమాయత్తం
విజయనగరం రూరల్, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): పొడి చెత్తే కదా అని బయట పారబోస్తున్నారా? ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా విసిరేస్తున్నారా? అయితే మీరు నష్టపోతునట్లే. ఇక నుంచైనా వాటిని భద్రపరచి మీ ఇంటికి వచ్చే స్వచ్ఛ్ రథం నిర్వహకుడికి అందించండి. దానికి బదులుగా కిరాణా సరుకులు తీసుకోండి. గ్రామీణ ప్రాంతాల్లో పొడి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణే లక్ష్యంగా ఈ నెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ్ రథం పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేరకు జిల్లాలో ఈ పథకం అమలు కోసం అధికారులు సమాయత్తం అవుతున్నారు.
ప్రత్యేకంగా రూపకల్పన..
స్వచ్ఛ్ రథం అనేది ఓ పారిశుధ్య వాహనం. గ్రామాల్లో ఉత్పత్తి అయ్యే పొడిచెత్త, ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కోసం దీన్ని ప్రత్యేకంగా రూపకల్పన చేశారు. ఇళ్లలోని చెత్తను తడి, పొడిగా వేరు చేసే అలవాటును ప్రజల్లో పెంపొందించడం దీని ప్రధాన ఉద్దేశం. వస్తుమార్పిడి విధానంపై ఈ వాహనం పనిచేస్తుంది. పొడిచెత్తను ఇస్తే స్వచ్ఛ్ రథాల నిర్వహకులు వాటికి బదులుగా కిరణా సరుకులు అందిస్తారు. గృహాల నుంచి ఉత్పత్తి అయ్యే పొడి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యకు ఈ పథకం ద్వారా సమగ్ర పరిష్కారం కలగనుంది. గ్రామాల్లో పారిశుధ్యం, పర్యావరణ నాణ్యత మెరుగుపడనుంది. స్వచ్ఛ్ రథాల నిర్వహకులు ఆయా మండలాల్లోని గ్రామాలను సందర్శించి ప్రజల నుంచి వ్యర్థాలను కొనుగోలు చేయాలి. వారికి నగదుకి బదులుగా నిత్యావసర సరుకులు అందజేయాల్సి ఉంటుంది.
ఆపరేటర్ల ఎంపికకు దరఖాస్తులు..
జిల్లాలోని 27 మండలాలకు ఒక్కో స్వచ్ఛ్ రథం చొప్పున కేటాయించనున్నారు. వీటి నిర్వహణకు ఆపరేటర్లను ఎంపిక చేస్తారు. ఈ పథకం నిర్వహణకు మండల పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ముందుగా పబ్లిక్ డిస్టిబ్యూషన్ సిస్టమ్‌ను ఉపయోగించే వాహనాలకు నెలవారీ అద్దె రూ 20 వేలు నుంచి 25 వేలు చెల్లిస్తారు. ఎంపిక చేసిన వాహనాన్ని వ్యర్థాల సేకరించడానికి అనుగుణంగా మార్పు చేస్తారు. వాహనాన్ని మార్పు చేసుకునేందుకు సంబంధిత యజమానికి రూ.50 వేలు అడ్వాన్స్‌గా మంజూరు చేస్తారు. దీన్ని పది నెలల్లో తిరిగి చెల్లించేలా నెలకు రూ.5 వేలు వారి నుంచి వసూలు చేస్తారు. నిత్యావసర సరుకులు కొనుగోలు కోసం రూ.5 వేలను 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి మంజూరు చేస్తారు. ఒక్కొక్కరోజు ఒక్కొక్క పంచాయతీల్లో వాహనం తిరిగే విధంగా మండల పరిషత్ అధికారులు షెడ్యూల్‌ను తయారు చేసి స్వచ్ఛ్ రథ యాజమానికి అందజేస్తారు. ఈ షెడ్యూల్ ప్రకారం అన్ని గ్రామ పంచాయతీలకు స్వచ్ఛ్ రథం వెళ్లాలి. రోజుకు 200 కిలోలకు తక్కువ లేకుండా వ్యర్థాలను సేకరించి స్ర్కాప్ డీలర్‌కు విక్రయిస్తారు. స్వచ్ఛ్ రథం పర్యటన వివరాలు, వ్యర్థాల సేకరణ, స్ర్కాప్ డీలర్‌కు అందజేసిన వ్యర్థాలు, నిత్యావసర వస్తువుల కొనుగోలు, అమ్మకాల వివరాలను మండల పరిషత్ అధికారులకు తెలియజేయాలి. స్వచ్ఛ్ రథం నిర్వహణకు ఆసక్తిగల ఔత్సాహికులు ఈ నెల 7లోగా జిల్లా పంచాయతీ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తులను జిల్లా స్థాయి కమిటీ పరిశీలించి జడ్పీ సీఈవో, డీపీవో నిర్ణయం తీసుకుని అర్హత గలిగిన ఆపరేటర్లను ఎంపిక చేస్తారు.