Give the crap.. get the reward చెత్తను ఇవ్వండి.. ప్రతిఫలం తీసుకోండి
ABN , Publish Date - Feb 04 , 2026 | 11:55 PM
Give the crap.. get the reward చెత్త సేకరణకు ప్రభుత్వం సరికొత్త కార్యక్రమం రూపొందించింది. గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడికక్కడే చెత్త కుప్పలు పేరుకుపోకుండా వినూత్నంగా ఆలోచించింది. చెత్తను ఇచ్చిన వారికి డబ్బులు కాని నిత్యావసరాలు కాని ఇవ్వనుంది.
చెత్తను ఇవ్వండి.. ప్రతిఫలం తీసుకోండి
చెత్తసేకరణకు ప్రభుత్వం సరికొత్త కార్యక్రమం
సర్కారు ఆధ్వర్యంలోనే స్ర్కాప్ కొనుగోలు
మండలానికి ఒకటి చొప్పున స్వచ్ఛ రథాలు
చెత్త సేకరణకు ప్రభుత్వం సరికొత్త కార్యక్రమం రూపొందించింది. గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడికక్కడే చెత్త కుప్పలు పేరుకుపోకుండా వినూత్నంగా ఆలోచించింది. చెత్తను ఇచ్చిన వారికి డబ్బులు కాని నిత్యావసరాలు కాని ఇవ్వనుంది. ఇళ్లలో వినియోగానికి పనికిరాని ప్లాస్టిక్, ఇనుము, గాజు, రబ్బరు, కాగితం ఇలా ఏదైనా బయట పారబోయకుండా ప్రజల వద్దకు వచ్చే స్వచ్ఛ రథానికి అప్పగిస్తే అందుకు ప్రతిగా ఏదైనా తీసుకోవచ్చు. ఈ కార్యక్రమం ఆచరణకు ప్రభుత్వం మండలానికి ఒకటి చొప్పున స్వచ్ఛ రథాన్ని కేటాయించింది.
చీపురుపల్లి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి):
ఇళ్లలో వినియోగానికి పనికిరాని ప్లాస్టిక్, ఇనుము, గాజు, రబ్బరు, కాగితం వంటి తుక్కును కొంత మంది స్ర్కాప్ దుకాణాలకు విక్రయిస్తుండగా మరికొంత మంది నిర్లక్ష్యంగా వీధుల్లోకి విసిరేస్తున్నారు. దీనివల్ల రోడ్లపైన, కాలనీల్లోని ప్రధాన జంక్షన్లలో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. అటువంటి పనికిరాని చెత్త సామాన్లు కొనుగోలు చేయడానికి ప్రస్తుతం కొంత మంది ప్రైవేటు వ్యాపారులు వీధుల్లోకి వస్తుంటారు. ఇప్పుడు అటువంటి విధానాన్నే ప్రభుత్వం అమలు చేయబోతోంది. దీని కోసం మండలానికి ఒకటి చొప్పున స్వచ్ఛ రథాలను సిద్ధం చేస్తోంది.
వీటిని గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి వార్డుకు పంపించి పనికి రాని ప్లాస్టిక్, ఇనుము, కాగితం, రబ్బరు తదితర 50 రకాల తుక్కు సామాన్లను కొనుగోలు చేయనున్నారు. మన జిల్లాకు సంబంధించి 27 స్వచ్ఛ రథాలు సిద్ధమవుతున్నాయి. ఈ వాహనాల కోసం ఇటీవల టెండర్లు కూడా పిలిచి కాంట్రార్లను ఖరారు చేశారు. మండలానికి ఒక కాంట్రాక్టరును కేటాయిస్తారు. వీరికి నెలకు రూ.20 వేలు (అన్నీ కలిపి) చెల్లిస్తారు. ఈ కాంట్రాక్టర్లు తమకు కేటాయించిన మండలాల్లోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో తిరగాలి. ప్రభుత్వం పేర్కొన్న 50 రకాల తుక్కు వస్తువుల్లో కనీసం ఏడు రకాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇలా నెలకు కనీసం మూడు టన్నులకు తక్కువ కాకుండా తుక్కును కొనుగోలు చేసి తమకు నచ్చిన హోల్‌సేల్ వ్యాపారులకు తిరిగి విక్రయించుకోవాలి. ఈ విధంగా కొనుగోలు చేయాల్సిన స్ర్కాప్‌కు ప్రభుత్వం ధరను కూడా నిర్ణయించింది.
- ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం ఇనుప తుక్కును కిలో రూ.20లకు, పేపర్లు రూ.15, పుస్తకాలు రూ.10, అట్టపెట్టెలు 10, ప్లాస్టిక్ బాటిల్స్ 20, గాజు బాటిల్స్ 2 రూపాయలు, స్టీల్ వస్తువులు 40, అల్యూమినియం వస్తువులను రూ.120కు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇప్పటికే దాదాపు అన్ని మండలాల్లో కొనుగోలు కాంట్రాక్టర్లు ఖరారు అయ్యారు. త్వరలోనే స్వచ్ఛ రథాల పేరుతో ప్రభుత్వ తుక్కు కొనుగోలు వాహనాలు వీధుల్లో దర్శనమివ్వనున్నాయి.