Share News

Safe Deliveries సుఖ ప్రసవాలకే ప్రాధాన్యమివ్వండి

ABN , Publish Date - Feb 19 , 2026 | 11:54 PM

Give Priority to Safe Deliveries జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుఖ ప్రసవాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సిజేరియన్‌ అవసరం రాకుండా చూడాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. సిజేరియన్‌ కేసులకు ఉన్న సైంటిఫిక్‌ కారణాలను తెలుసుకొని వాటిని నివారించే దిశగా కృషి చేయాలని కోరారు. సుఖ ప్రసవాలు జరిగేందుకు ప్రముఖ గైనకాలజిస్ట్‌లతో ఆసుపత్రులు వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

 Safe Deliveries  సుఖ ప్రసవాలకే ప్రాధాన్యమివ్వండి
మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

  • రోగులతో ప్రేమగా మెలగాలి

పార్వతీపురం, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుఖ ప్రసవాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సిజేరియన్‌ అవసరం రాకుండా చూడాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. సిజేరియన్‌ కేసులకు ఉన్న సైంటిఫిక్‌ కారణాలను తెలుసుకొని వాటిని నివారించే దిశగా కృషి చేయాలని కోరారు. సుఖ ప్రసవాలు జరిగేందుకు ప్రముఖ గైనకాలజిస్ట్‌లతో ఆసుపత్రులు వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గురువారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వైద్యులతో సమీక్షించారు. జిల్లా , ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలన్నీ ఏప్లస్‌ గ్రేడ్‌ సాధించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. ప్రతి ఆసుపత్రి ‘ముస్తాబు’ కావాలని, రోగులకు ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించాలని తెలిపారు. ప్రహరీలు లేని ఆసుపత్రులకు బయో ఫెన్సింగ్‌ ఇస్తామన్నారు. ఆన్‌లైన్‌ ద్వారానే అన్నీ జరగాలన్నారు. ‘హెల్పింగ్‌ హ్యండ్స్‌’లో ఎక్కువ సంఖ్యలో యువత పాల్గొనేలా గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి జి.నాగభూషణరావు, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు శివనాగజ్యోతి, డీఎంహెచ్‌వో ఎస్‌.భాస్కరరావు పాల్గొన్నారు.

పరిపూర్ణ వ్యక్తులుగా విద్యార్థులను తీర్చిదిద్దాలి

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పాస్‌ కావడమే ప్రధానం కాదని, వారు సమాజంలో నిలదొక్కుకునేలా పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. వారి ఆహార్యం భాష, వృత్తినైపుణ్యాలు వంటివి మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్‌లో సైన్స్‌ ఉపాధ్యాయులు, ఒకేషనల్‌, ఇనస్ట్రకర్లతో సమీక్షించారు. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దడమే కాకుండా వారి జీవనశైలిలో గుణాత్మక మార్పును తీసుకురావా లని కలెక్టర్‌ సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఒక రోల్‌ మోడల్‌గా ఉండాలన్నారు. మంచి దుస్తులు ధరించడం, ఇతర చిన్న చిన్న మార్పుల ద్వారా సమాజంలో సానుకూల మార్పును తీసుకురావొచ్చని తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యకర చిట్కాలను పాటించడం ద్వారా సంతోషంగా జీవించగలరన్నారు. ఈ సమావేశంలో డీఈవో బి.రాజ్‌కుమార్‌, గిరిజన సంక్షేమాధికారి విజయశాంతి, బీసీ సంక్షేమశాఖాధికారి అప్పన్న తదితరులు పాల్గొన్నారు.

ప్రిన్సిపాల్‌ సెన్సెస్‌ అధికారి హోదాలో నేడు అమరావతికి కలెక్టర్‌

జనగణనపై శుక్రవారం అమరావతిలో జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించ నున్నారు. ఈ సమావేశానికి ప్రిన్సిపాల్‌ సెన్సెస్‌ అధికారి హోదాలో కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి హాజరు కానున్నారు. కాగా జిల్లాలో త్వరలోనే జనగణన కార్యక్రమం పారంభం కానుంది. 2011 సెన్సెస్‌ ప్రకారం 15 మండలాల్లో 7,90,424 జనాభా ఉన్నట్లు గుర్తించారు. అయితే వాస్తవంగా 8,68,090 మంది జనాభా ఉంటారని అంచనా. జిల్లాలో జనగణన కార్యక్రమం నిర్వహించేందుకు1863 మం దిని నియమించనున్నారు. పర్యవేక్షణకు ఇప్పటివరకు 311 మంది సూపర్‌వైజర్లను ఖరారు చేశారు. అయితే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Updated Date - Feb 19 , 2026 | 11:54 PM