girijen people seriou action తాడో పేడో తేల్చుకోవాలని...
ABN , Publish Date - May 20 , 2026 | 12:17 AM
girijen people seriou action పుణ్యగిరి ఆలయ మెట్లదారి వద్ద నుంచి రేగ పుణ్యగిరి గ్రామానికి నిర్మిస్తున్న రోడ్డు పనులు సగంలో ఆపేయడంతో గిరిజనులు కుటుంబాలతో సహా నిరసనకు దిగారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద మండుటెండను లెక్కచేయకుండా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలంటూ భీష్మించుకుకూర్చున్నారు.
తాడో పేడో తేల్చుకోవాలని...
రోడ్డు కోసం ఆందోళనకు దిగిన రేగపుణ్యగిరి గిరిజనులు
ఎస్.కోట ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోనే నిద్ర
రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ
రెండు రోజులు సమయమిచ్చిన గిరిజనులు
పుణ్యగిరి ఆలయ మెట్లదారి వద్ద నుంచి రేగ పుణ్యగిరి గ్రామానికి నిర్మిస్తున్న రోడ్డు పనులు సగంలో ఆపేయడంతో గిరిజనులు కుటుంబాలతో సహా నిరసనకు దిగారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద మండుటెండను లెక్కచేయకుండా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలంటూ భీష్మించుకుకూర్చున్నారు. రాత్రి కూడా అక్కడే నిద్రించిన గిరిజనులకు రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మంగళవారం హామీ ఇచ్చారు. రెండు రోజుల్లో పనులు మొదలు పెట్టకుంటే ఆమరణ దీక్షకు దిగుతామని చెప్పి ఆందోళనను తాత్కాలికంగా విరమించారు.
శృంగవరపుకోట మే 19 (ఆంధ్రజ్యోతి):
రోడ్డు కోసం రేగపుణ్యగిరి గిరిజనులు చాలా నెలలుగా ఎదురుచూస్తున్నారు. నేతలకు, అధికారులకు విన్నవించారు. అందుకు స్పందనగా పనులైతే చేపట్టారు. కానీ సగంలో ఆపేశారు. దీంతో ఇక తాడోపేడో తేల్చుకుందామని వారంతా సోమవారం ఎస్.కోట ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. వాస్తవానికి రేగ పుణ్యగిరి రోడ్డుకు ఉపాధి హామీ నుంచి రూ.4 కోట్ల నిధులు కేటాయించారు. ఎనిమిది పనులుగా విభజించారు. రెండు పనుల అంచనాలను మాత్రమే అధికారులు అప్‌లోడ్ చేశారు. వచ్చే జూలై నాటికి మిగిలిన పనులను అప్‌లోడ్ చేయకపోతే నిధులు రద్దయ్యే ప్రమాదం ఉందని కాంట్రాక్టర్ అనుమానం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో రోడ్డు నిర్మాణం కోసం గిరిజనులకు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. దీంతో గిరిజనులు ఏదో ఒకటి తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని రాత్రయినా ఇంటికి వెళ్లలేదు. కార్యాలయ ఆవరణకు భోజనాలు తెప్పించుకున్నారు. అక్కడే చిన్న పిల్లలతో సహా నిద్రించారు. తిరిగి మంగళవారం ఉదయం నుంచి నిరసనకు దిగారు. రోడ్డు నిర్మాణం పనులు చేపట్టేవరకు ఇక్కడ నుంచి కదలబోమంటూ భైఠాయించారు. విషయం తెలుసుకున్న స్థానిక శాసన సభ్యురాలు కోళ్ల లలితకుమారి గిరిజనులతో చర్చలు జరిపారు. పంచాయతీరాజ్ డీఈఈ స్వామినాయుడును పిలిపించారు. రోడ్డుపనులు పర్యవేక్షిస్తున్న సహాయ ఇంజనీర్ ఐశ్వర్యను పనుల ప్రగతిపై ఆరా తీసారు. జిల్లా ఉన్నతాధికారులతోనూ ఫోన్‌లో మాట్లాడారు. రోడ్డు నిర్మాణ పనులన్నింటికీ జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ అనుమతి ఇచ్చారని తెలుసుకున్నారు. తక్షణం పనులు చేపట్టాలని కాంట్రాక్టరు శేషుకు సూచించారు. బుధవారం నుంచి పనులు చేపట్టకుంటే మరో కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాల్సి వస్తుందని అన్నారు. రెండు రోజుల వ్యవధిలో పనులు చేపడతామని ఎమ్మెల్యే ఇచ్చిన హామీతో గిరిజనులు శాంతించారు. శుక్రవారం నాటికి రోడ్డు పనులు చేపట్టకుంటే తిరిగి ఆందోళనకు దిగుతామని గిరిజనులకు మద్దతుగా నిలిచిన సీపీఎం నాయకులు మద్దిల రమణ, గాడి అప్పారావు, చెలికాని ముత్యాలు హెచ్చరించారు.