Get up, nanna... లే నాన్న.. ఉద్యోగానికి వెళ్దువు..!
ABN , Publish Date - Aug 30 , 2026 | 12:18 AM
Get up, nanna... you have to go to work! భోగాపురం ఎయిర్‌పోర్టులో గ్రౌండ్ స్టాఫ్‌గా ఉద్యోగం వచ్చిందని ఆ యువకుడు ఎంతో సంతోషించాడు. మరో వారంలో జాబ్‌లో చేరాల్సి ఉండడంతో డాక్యుమెంట్లన్నీ సిద్ధం చేసుకున్నాడు. అయితే విధి చిన్నచూపు చూసింది. రోజూలానే పొలంలో పనులు ముగించుకుని ఇంటికి పయనమైన ఆ యువకుడిని మృత్యువు కబళించింది. దీంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు.
మరో వారం రోజుల్లో చేరాల్సి ఉండగా అనంత లోకాలకు..
రోడ్డు ప్రమాదంలో మృత్యువాత.. కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు
బెలగాం, ఆగస్టు29(ఆంధ్రజ్యోతి): భోగాపురం ఎయిర్‌పోర్టులో గ్రౌండ్ స్టాఫ్‌గా ఉద్యోగం వచ్చిందని ఆ యువకుడు ఎంతో సంతోషించాడు. మరో వారంలో జాబ్‌లో చేరాల్సి ఉండడంతో డాక్యుమెంట్లన్నీ సిద్ధం చేసుకున్నాడు. అయితే విధి చిన్నచూపు చూసింది. రోజూలానే పొలంలో పనులు ముగించుకుని ఇంటికి పయనమైన ఆ యువకుడిని మృత్యువు కబళించింది. దీంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. కొద్దిరోజుల్లో ఉద్యోగానికి వెళ్లాల్సిన వాడు.. ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. విగతజీవిగా పడి ఉన్న తనయుడిని తల్లి పట్టుకుని.. ‘లే నాన్న.. భోగాపురంలో ఉద్యోగానికి వెళ్దువు!’ అంటూ రోదించడం స్థానికులను కలచివేసింది. ఈ విషాద ఘటన పార్వతీపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
పార్వతీపురం పట్టణం నవిరి కాలనీకి చెందిన గోపాలనాయుడు, ఇందిర వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వారికి ముగ్గురు కొడుకులు. వారిలో రఘు, సంతోష్ బెంగళూరు, హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. మూడోవాడైన రౌతు సాగర్(26) పీజీ వరకు చదువుకున్నాడు. అప్పుడప్పుడు వ్యవసాయ పనులు చేస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. కాగా శనివారం పాత నవిరి వద్ద తన పొలంలో పనులు ముగించుకుని బైక్‌పై తిరిగి ఇంటికి పయనమయ్యాడు. పట్టణంలోని ఎస్‌వీడీ కళాశాల వద్దకు చేరుకునే సరికి యువకుడి ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఓ కారు ఢీకొంది. దీంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు కింద పడి సాగర్ మృతి చెందాడు. ఇంకో రెండు నిమిషాల్లో ఇంటికి చేరాల్సిన యువకుడు విగతజీవిగా మారడం చేసి తల్లిదండ్రులు భోరున విలపించారు. చిన్నకొడుకు మృతిని తట్టుకోలేక.. గుండెలవిసేలా రోదించారు. ఉద్యోగానికి అన్నీ సిద్ధం చేసుకున్నావు కదా.. లేనాన్న’ అంటూ తల్లి కన్నీంటిపర్యంతమైంది. ఇది చూసి స్థానికులు కూడా కంటతడి పెట్టారు. కాగా సాగర్ ఇంటికి సమీపంలోనే ప్రమాదం జరగంతో నవరికాలనీ వాసులందరూ భారీగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. మృతదేహాన్ని పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.