పశువులకు జనరిక్ మందులు
ABN , Publish Date - Apr 28 , 2026 | 11:33 PM
పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు, పందులు, పెంపుడు శునకాలకు సైతం మందుల వినియోగం ఇటీవల బాగా పెరిగింది.
- జిల్లాలో ఐదు చోట్ల ఏర్పాటుకు సన్నాహాలు
- సెర్ప్ ద్వారా నిర్వహణ
- తక్కువ ధరకు లభించనున్న మందులు
బొబ్బిలి, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు, పందులు, పెంపుడు శునకాలకు సైతం మందుల వినియోగం ఇటీవల బాగా పెరిగింది. వీటి రోగాలను నయం చేసేందుకు అవసరమైన మందులన్నీ పశువుల ఆసుపత్రుల్లో అందుబాటులో లేకపోవడంతో ప్రైౖవేట్ దుకాణాల్లో పెంపకందారులు కొనుక్కోవాల్సి వస్తోంది. ప్రైవేట్ దుకాణాల్లో మందుల ధరలు అధికంగా ఉండడంతో పశుపోషకులు, పెంపుడు జంతువుల యజమానులు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సెర్ప్ ఆధ్వర్యంలో జనరిక్ మందుల దుకాణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో విజయనగరం, ఎస్.కోట, చీపురుపల్లి, బొబ్బిలి, రామభద్రపురంలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. గొర్రెల, మేకల పెంపకందారుల సొసైటీల ద్వారా తొలుత ఈ జనరిక్ మందుల షాపులను నిర్వహించాలని అధికారులు భావించారు. ఇందుకు కొన్ని నిబంధనలు అడ్డువస్తుండడంతో సెర్ప్ పరిధిలోని డ్వాక్రా సంఘాల ద్వారా జనరిక్ షాపులను నిర్వహించాలని నిర్ణయించారు. ఇవి ఏర్పాటు అయితే సరసమైన ధరలకు నాణ్యమైన మందులు లభ్యమవుతాయని పశువుల పెంపకందారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
బొబ్బిలి పశుసంవర్ధకశాఖ డివిజన్ పరిధిలోని బొబ్బిలి, బాడంగి, రాజాం, రామభద్రపురం, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాల్లో 1,43,383 ఆవులు, గేదెలు, 1,73,281 గొర్రెలు, మేకలు ఉన్నాయి. వీటితో పాటు పందులు, కోళ్లు, పెంపుడు కుక్కలు, వీధికుక్కలు అన్నీ కలిపి లక్షల సంఖ్యలో ఉన్నాయి. వీటి చికిత్సకు అవసరమైన మందులను జనరిక్ షాపుల ద్వారా పొందే అవకాశం ఉంది.
ఆ షాపు ఎత్తివేత ..
బొబ్బిలి పట్టణంలో మెప్మా ఆధ్వర్యంలో మానవ జనరిక్ మందుల దుకాణాన్ని స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు ఉన్న షాపులో నాలుగేళ్ల కిందట అధికారులు ఏర్పాటు చేశారు. అది లాభసాటి కాకపోవడంతో దానిని ఎత్తివేశారు. వాస్తవానికి బొబ్బిలి పట్టణంలోనేకాక జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సైతం మెడికల్ షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తూనే ఉన్నాయి, కానీ, ఒక్కగానొక్క మెప్మా జనరిక్ మందుల షాపును మాత్రం నిర్వహించలేక చేతులెత్తేయడం గమనార్హం. పశుపక్ష్యాదుల కోసం ఏర్పాటు చేయనున్న జనరిక్ మందుల షాపును ఇలా ఎత్తేయకుండా విజయవంతంగా నడిపించాలని పెంపకందారులు కోరుతున్నారు.
ప్రతిపాదనలు పంపించాం
బొబ్బిలి, రామభద్రపురంలోని పశువుల ఆసుపత్రుల ప్రాంగణాల్లో జనరిక్ మందుల షాపులను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను కలెక్టర్‌కు పంపించాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో వీటిని ఏర్పాటు చేస్తారు. సెర్ప్ ద్వారా వీటిని నిర్వహిస్తారు. సరసమైన ధరలకు పలు రకాల పశువైద్య మందులు లభ్యమవుతాయి. గొర్రెలు, మేకలు పెంపకందారులతో పాటు అన్ని పశువుల పెంపకం దారులకు ఈ షాపులు ఉపయుక్తంగా ఉంటాయి. కలెక్టరు నుంచి ఆదేశాలు రాగానే వీటిని ప్రారంభిస్తాం.
- డాక్టర్ ఎల్. విష్ణు, ఇన్‌చార్జి డిప్యూటీ డైరెక్టర్, పశుసంవర్ధకశాఖ, బొబ్బిలి డివిజన్