Share News

సాధారణ నిధులే దిక్కు!

ABN , Publish Date - Nov 04 , 2026 | 11:23 PM

స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘం నిధులే ముఖ్యం. అవి రావాలంటే పాలకవర్గాలు కచ్చితంగా ఉండాలి.

సాధారణ నిధులే దిక్కు!
రాజాం పట్టణంలో పాడైన రోడ్డు

- రాజాం మునిసిపాల్టీకి చేరని ఆర్థిక సంఘం నిధులు

- రెండు దశాబ్దాలుగా పాలకవర్గం లేక ఇక్కట్లు

- కానరాని అభివృద్ధి

- కొత్తపాలకవర్గంపైనే ఆశలు

రాజాం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘం నిధులే ముఖ్యం. అవి రావాలంటే పాలకవర్గాలు కచ్చితంగా ఉండాలి. కానీ, గత రెండు దశాబ్దాలుగా రాజాం మునిసిపాల్టీకి పాలవవర్గాలు లేకపోవడంతో ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. అలాగని ప్రత్యేక నిధులు లేవు. అందుకే ఈ మునిసిపాల్టీలో అభివృద్ధి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న మాదిరిగా మారింది. రాజాం నగర పంచాయతీగా 2005లో రూపాంతరం చెందింది. 2021లో మున్సిపాల్టీగా అప్‌గ్రేడ్‌ అయింది. అయితే, 21 ఏళ్లుగా కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు జరగడం లేదు. 2021లో ఎన్నికలకు సిద్ధమైన అప్పటి వైసీపీ ప్రభుత్వం అప్పుడే న్యాయపరమైన చిక్కులను అధిగమించి ఉంటే రాజాం మునిసిపాల్టీకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు.

అభివృద్ధిపై ప్రభావం

రెండు దశాబ్దాలుగా పాలకవర్గం లేకపోవడంతో ఆర్థిక సంఘం నిధులకు బ్రేక్‌ పడింది. ఐదు విడతల్లో రావాల్సిన రూ.5 కోట్లు నిలిచిపోయాయి. కేవలం సాధారణ నిధులతోనే నెట్టుకొచ్చారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు రూ.2.25 కోట్లు, శ్రీకాకుళం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ (సుడా) నుంచి మరో రూ.5 కోట్లు వచ్చాయి. మొత్తం రూ.7.25 కోట్లతో రాజాం మునిసిపాల్టీ వ్యాప్తంగా 110 పనులు చేపట్టాల్సి ఉంది. కానీ, పాలకవర్గం లేకపోవడంతో పనులు మొదలుపెట్టలేదు. పర్యవేక్షణ కూడా లేదు. ప్రత్యామ్నాయ రూపంలో నిధులు తెచ్చుకోవడం తప్ప.. నేరుగా వచ్చిన దాఖలాలు లేవు. వైసీపీ హయాంలో ఎమ్మెల్యేల నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. కూటమి వచ్చిన తరువాత స్థానిక ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ ప్రత్యేక ప్రతిపాదనలు తీసుకెళ్లి కొన్ని నిధులు ప్రభుత్వం నుంచి తెప్పించుకున్నారు. ఇప్పుడు కొత్త పాలకవర్గం వస్తే పెండింగ్‌ ఆర్థిక సంఘం నిధులతో పాటు 16వ ఆర్థిక సంఘం నిధులు వచ్చే అవకాశం ఉంది.

ప్రజల బాధలు వర్ణనాతీతం

20 సంవత్సరాలుగా ఆర్థిక సంఘం నిధులు అనేవి లేకుండా పోయాయి. వైసీపీ హయాంలో ఉన్న నిధులను సైతం పక్కదారి పట్టించారు. దీంతో కనీస స్థాయిలో కూడా పనులు జరగలేదు. ప్రజల బాధలు వర్ణనాతీతం. కొత్త పాలకవర్గం వచ్చిన వెంటనే దృష్టిపెట్టాలి.

-మూడడ్ల శ్రీనివాసరావు, స్థానికుడు, రాజాం

Updated Date - Nov 04 , 2026 | 11:23 PM