పుర పోరులో జెన్జీలే కీలకం
ABN , Publish Date - Oct 18 , 2026 | 11:55 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో జెన్ జీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
వారి సంఖ్య పట్టణాల్లోనే అధికం
అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం
ఆన్లైన్ వేదికగా ప్రచారం చేస్తే మేలు
దృష్టి సారిస్తున్న రాజకీయ నేతలు
విజయనగరం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో జెన్ జీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 1997-2012 మధ్య పుట్టిన వారంతా జెన్జీ తరమే. వీరి ప్రయాణం దాదాపు టెక్నాలజీ, ఇంటర్నెట్, సోషల్మీడియా, స్మార్ట్ఫోన్లతోనే ఎక్కువగా ఉంటుంది. వీరి ఆలోచనలు, నిర్ణయాలు అన్నీ భిన్నం. సామాజిక, రాజకీయ అంశాలపై జెన్జీ స్పందన అంతా ఇంటర్నెట్ వేదికగానే ఉంటుంది. దీంతో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్ వేదికగా జెన్జీకి దగ్గరయ్యే ప్రయత్నాలపై దృష్టిపెట్టారు. వారి గెలుపోటములపై జెన్జీలు ప్రభావం చూపనున్నారు.
పట్టణాల్లో అధికం..
ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం మునిసిపాల్టీల్లో జెన్జీ ఓటర్ల శాతం 23 ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో 19 శాతం వరకూ ఉండవచ్చు. మునిసిపల్ ఎన్నికల్లో గెలుపోటములను శాసించే స్థాయిలో జెన్జీ ఓటర్లు ఉన్నట్టు గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. ముఖ్యంగా విజయనగరం కార్పొరేషన్ పరిధిలో వీరి ప్రభావం అధికంగా ఉండనుంది. ఎన్నికల సమయంలో రొటీన్ ప్రచారం వీరికి ఎంతమాత్రం ఎక్కదు. వీరికి భిన్నంగా ఆన్లైన్, ఇంటర్నెట్ ప్రచారమంటే మక్కువ. ప్రత్యేకంగా వీరికి సమయం కేటాయించాల్సి ఉంటుంది. జూమ్ వేదికలుగా ఇంటరాక్షన్, చిట్చాట్, కాఫీ టైమ్ విత్ లీడర్ వంటి వినూత్న బాటలను నేతలు ఎంచుకోవాల్సి ఉంటుంది. గతంతో పోలిస్తే రాజకీయపరమైన అంశాలపై జెన్జీ యువత ఎక్కువగా స్పందిస్తోంది. తప్పులు, వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. అందుకే జెన్జీతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
అభివృద్ధికి ప్రాధాన్యం..
జెన్జీ తరం సంక్షేమం కంటే ఎక్కువగా అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి కనిపిస్తోంది. అందుకే సీఎం చంద్రబాబు సైతం చేసిన పనిని ఆన్లైన్ వేదికగా ప్రచారం చేయాలని సూచిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని వారికి సోషల్ మీడియా వేదికగా చూపిస్తే ఓట్లు గుంపగుత్తిగా పడడం ఖాయం. తాము చేయబోయే అభివృద్ధి పనులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వారికి వివరించగలిగితే ..రూట్మ్యాప్గా తీసుకెళ్లగలిగితే మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ విషయంలో కూటమి పార్టీలు తమ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసే అవకాశం కూడా కనిపిస్తోంది. జెన్జీ యువతను ఆకట్టుకుంటే వారే ఆన్లైన్ వేదికల ద్వారా విస్తృత ప్రచారం చేస్తారు కూడా. ఈ విషయంలో పార్టీలు మాత్రమే కాదు.. అభ్యర్థులు సైతం ప్రయత్నాలు చేస్తే వర్కౌట్ అవుతుంది.