కార్పొరేషన్ ఎన్నికకు సన్నద్ధం
ABN , Publish Date - Aug 28 , 2026 | 11:51 PM
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. పల్లె, పట్టణ పోరును అక్టోబరు లోపు నిర్వహించే దిశగా అడుగులు వేస్తోంది.
62కు పెరిగిన డివిజన్లు
సెప్టెంబరు 3న ఓటరు జాబితా విడుదల
10లోపు రిజర్వేషన్లు ఖరారు
ఆ తరువాత ఎన్నికల నోటిఫికేషన్
మేయర్ అభ్యర్థి రేసులో ఐదుగురు
విజయనగరం టౌన్, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. పల్లె, పట్టణ పోరును అక్టోబరు లోపు నిర్వహించే దిశగా అడుగులు వేస్తోంది. బీసీలకు 33శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటు కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు సంబంధించి మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఆశావహుల్లో సందడి నెలకొంది. ప్రస్తుతం అందరి దృష్టి విజయనగరం కార్పొరేషన్‌పై పడింది. నగరంలో ఎక్కడ చూసినా ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. విజయనగరం కార్పొరేషన్‌లో ఇప్పటివరకూ 50 డివిజన్లు ఉండగా, కొత్తగా 12 డివిజన్లను చేర్చారు. మొత్తం 62 డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. డివిజన్లు పెరిగినప్పటికీ 2011 జనాభా లెక్కల ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సెప్టెంబరు 3న ఓటర్ల తుది జాబితా ప్రకటన, నెలాఖరుకల్లా రిజర్వేషన్ల ఖరారు పూర్తి చేసి.. అక్టోబరు 1న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉంది.
మేయర్ రేసులో..
కూటమికి సంబంధించి మేయర్ అభ్యర్థి రేసులో ఐదుగురి పేర్లు వినిపిస్తున్నాయి. ఆ ఐదుగురూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే. ఇందులో మొదటి వ్యక్తి టీడీపీలో దశాబ్ద కాలం నుంచి క్రియాశీలకంగా ఉంటున్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడిగా పని చేశారు. ఇటీవల పార్టీ జిల్లా కార్యవర్గంలో చోటు దక్కించుకున్నారు. ఈయన మేయర్ అభ్యర్థిగా తనకే అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. గాజులరేగ ప్రాంతానికి చెందిన మరో నాయకుడు కూడా రేసులో ఉన్నారు. ఈయన పూసపాటి అశోక్‌గజపతిరాజుకు నమ్మిన బంటు. ఎన్నో ఏళ్లుగా టీడీపీలో ఉంటున్నారు. గత పాలకవర్గంలో తన సతీమణిని కార్పొరేటర్‌గా గెలిపించారు. నగరానికి చెందిన మరో నాయకుడు కూడా తన ఆయనసతీమణిని మేయర్ బరిలో నిలుపుతున్నట్లు సమాచారం. ఇద్దరూ దశాబ్ద కాలంగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. విజయగనరం టీడీపీ పట్టణ ముఖ్య నాయకుడు స్థానిక ఎమ్మెల్యేకు నమ్మిన బంటు. ఈయన కూడా మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఓ నాయకుడు కూడా మేయర్ పదవిని ఆశిస్తున్నారు. ఈ ఐదుగురూ చాపకింద నీరులా పావులు కదుపుతున్నారు. తనకే మేయర్ టిక్కెట్ ఇస్తారంటూ తమ అనుచరులు వద్ద చెప్పుకుని తిరుగుతున్నారు. అయితే, ఈ విషయంపై ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు గోప్యత పాటిస్తున్నారు. దీంతో మేయర్ అభ్యర్థిగా అధిష్ఠానం ఎవరిని ప్రకటిస్తుందోనని నగర వాసులు ఉత్సుహకతతో ఎదురుచూస్తున్నారు. కాగా, మేయర్ అభ్యర్థికి సంబంధించి వైసీపీ మౌనంగా ఉంది.
పెరిగిన డివిజన్ల ఆధారంగానే ఎన్నికలు
నగరంలో పెరిగిన డివిజన్ల ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయి. సెప్టెంబరు 3న ఓటరు జాబితాను విడుదల చేసి, 10లోగా రిజర్వేషన్ ఖరారు చేసి, ఆ తరువాత నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. దీనిపై పూర్తిస్థాయి స్పష్టత రాలేదు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితా, ఎన్నికల సిబ్బంది, రిజర్వేషన్లు తదితర అంశాలపై దృష్టి సారించాం.
-బాలాస్వామి, కమిషనర్, విజయనగరం కార్పొరేషన్