Share News

‘Gas’ Woes ‘గ్యాస్‌’ కష్టాలు

ABN , Publish Date - Mar 22 , 2026 | 11:35 PM

‘Gas’ Woes పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పుడే ఆగేలా లేదు. అయితే ఈ ప్రభావం వంట గ్యాస్‌పై పడుతోంది. జిల్లాలో సిలిండర్ల కొరత ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో జిల్లాలో హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌, టిఫిన్‌ సెంటర్లు, టీ స్టాల్స్‌ మూతపడుతున్నాయి.

‘Gas’ Woes ‘గ్యాస్‌’ కష్టాలు
పార్వ‌తీపురంలోని ఓ రెస్టారెంట్ వ‌ద్ద క‌ట్టెల పొయ్యిపై వంట‌లు చేస్తున్న దృశ్యం

  • వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల సరఫరా లేక మూతపడిన హోటళ్లు

  • అదేబాటలో ఫాస్ట్‌ఫుడ్‌, టిఫిన్‌ సెంటర్లు..

  • చిరువ్యాపారులకు తప్పని కష్టాలు

  • కొన్నిచోట్ల కట్టెల పొయ్యిపై వంటలు

  • ఉపాధి కోల్పోతున్న కార్మికులు

పార్వతీపురం/రూరల్‌/టౌన్‌/మక్కువ రూరల్‌, మార్చి22 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పుడే ఆగేలా లేదు. అయితే ఈ ప్రభావం వంట గ్యాస్‌పై పడుతోంది. జిల్లాలో సిలిండర్ల కొరత ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో జిల్లాలో హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌, టిఫిన్‌ సెంటర్లు, టీ స్టాల్స్‌ మూతపడుతున్నాయి. ఈనేపథ్యంలో కొందరు కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తూ హోటళ్లను నిర్వహిస్తున్నారు. పార్వతీపురం, సాలూరు, పాలకొండ, కురుపాంతో పాటు పలు మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

జిల్లాకేంద్రంలో 55 వేల మంది హెచ్‌పీ గ్యాస్‌ వినియోగదారులు ఉన్నారు. భారత్‌ గ్యాస్‌ వినియోగదారులు సుమారు 20 వేల మంది వరకు ఉన్నారు. అయితే గ్యాస్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో ఇప్పటికే పార్వతీపురంలోని టిఫిన్‌, రెస్టారెంట్లు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. దీంతో వాటిల్లో పనిచేస్తే వంటమాస్టర్లు, సహాయకులు ఉపాధి కోల్పోతున్నారు. చిరు వ్యాపారులకు కష్టాలు తప్పడం లేదు. మరోవైపు అత్యవసర పనులపై జిల్లాకేంద్రానికి వచ్చే వారికి ఏమీ దొరక్కపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు.

గ్యాస్‌ కొరత కారణంగా చెరకు(కలప)కు డిమాండ్‌ పెరిగింది. దీంతో గ్యాస్‌ కష్టాలతో పాటు నిత్యాసవరాల ధరలకూ రెక్కలొచ్చాయి. వీధుల్లో, పట్టణ శివార్లలో ఉండే టిఫిన్‌ షాపుల వారు సైతం ధరలు పెంచారు. గ్యాస్‌ కొరత ప్రభావం శుభకార్యాలపై కూడా పడింది. భోజనాల క్యాటరింగ్‌ నిర్వహించే వారిలో కొంతమంది కట్టెల పొయ్యిపైనే వంటలు చేస్తుండగా.. ప్లేట్‌ మీల్‌ ధరను రూ. 120 నుంచి రూ.150 వరకు పెంచేశారు. దీంతో శుభకార్యాలు చేసే వారు లబోదిబోమంటున్నారు.

కాగా యుద్ధం నేపథ్యంలో జిల్లాలో చాలామంది అవసరం లేకుండానే బుకింగ్‌ కోసం గ్యాస్‌ ఏజెన్సీ వద్దకు వెళ్తుండడంతో సమస్య తీవ్రతరమవుతుంది. మక్కువ తదితర మండలాలకు వారానికి ఒకసారి కూడా గ్యాస్‌ సిలిండర్ల స్టాక్‌ రావడం లేదు. దీంతో బుకింగ్‌ చేసుకున్న వారు ఏజెన్సీలకు వెళ్లినా నిరాశ తప్పడం లేదు. గ్యాస్‌ నిల్వ లేదని అక్కడి బోర్డు చూసి ఖాళీ బండలతో ఈసురోమంటూ ఇళ్లకు వెనుదిరుగుతున్నారు. ఈ విషయమై డీఎస్‌వో బి.అశోక్‌ను వివరణ కోరగా... ‘అవసరాలకు మించిన గ్యాస్‌ బుకింగ్‌ వల్ల కృత్రిమ కొరత ఏర్పాడుతుంది. గ్యాస్‌ ఏజెన్సీల పరిధిలో 3వేలు గ్యాస్‌ సిలిండర్‌ల బుకింగ్‌ చేయాల్సి ఉంది. అయితే యుద్ధం కారణంగా వినియోగదారులు అవసరం లేకుండా బుకింగ్‌ చేస్తున్నారు. నాలుగైదురోజుల్లో గ్యాస్‌ సిలిండర్ల సరఫరా సమస్యను పరిష్కరిస్తాం. అని తెలిపారు.

ఉపాధి లేక ఇబ్బందులు

వంటగ్యాస్‌ కొరత వల్ల ఉపాధి కోల్పోయాం. నేను ఒక వంట మాస్టార్‌ దగ్గర పనిచేస్తున్నా. గ్యాస్‌ సరఫరా లేక ఆర్డర్లు తీసుకోవడం లేదు. మరోవైపు హోటళ్లు, రెస్టారెంట్లు కూడా మూతపడుతున్నాయి. దీంతో మాలాంటి వారికి పనుల్లేకుండా పోయింది.. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.

- కె.కృష్ణారావు, పార్వతీపురం

========================

కట్టెలపై వంట కష్టమే ..

వంట గ్యాస్‌ కొరత వల్ల కట్టెలపై వంటలు చేయాలని శుభకార్యాలు చేసేవారు కోరుతున్నారు. అయితే కట్టెలపై వంట చేయడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో అదనంగా చెల్లించాల్సి ఉంటుందని శుభకార్యాలు నిర్వహించే వారికి చెబుతున్నాం.

- ఆర్‌.రాము, వంట మాస్టారు, పార్వతీపురం

Updated Date - Mar 22 , 2026 | 11:35 PM