Share News

గ్యాస్‌ కొరత.. హోటళ్ల మూత

ABN , Publish Date - Mar 21 , 2026 | 11:35 PM

రాజాం పట్టణంలోని చీపురుపల్లి-పాలకొండ రోడ్డులో రాత్రి 11 గంటలకు వెళ్లినా టిఫిన్‌ దొరికేది.

గ్యాస్‌ కొరత.. హోటళ్ల మూత
రాజాంలో శనివారం సాయంత్రం మూసివేసిన ఒక హోటల్‌

- ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు కూడా..

- చిరువ్యాపారులకు తప్పని కష్టాలు

- ఉపాధి కోల్పోతున్న కార్మికులు

రాజాం పట్టణంలోని చీపురుపల్లి-పాలకొండ రోడ్డులో రాత్రి 11 గంటలకు వెళ్లినా టిఫిన్‌ దొరికేది. ఇక్కడ నాలుగైదు షాపులను అర్ధరాత్రి వరకూ తెరిచి ఉంచేవారు. ప్రస్తుతం ఆ షాపులను రాత్రి ఎనిమిది గంటలకే మూసివేస్తున్నారు. కొన్ని టీషాపులను వేకువజామున నాలుగు గంటలకే తెరిచేవారు. ప్రస్తుతం అవన్నీ మూతపడ్డాయి. గత వారంరోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. కమర్షియల్‌ సిలిండర్ల సరఫరా నిలిపివేయడం, డొమెస్టిక్‌ సిలిండర్లు సైతం లభ్యంకాకపోవడమే ఇందుకు కారణం. ఈ సమస్య రాజాంలోనే కాదు.. జిల్లా అంతటా ఉంది. గ్యాస్‌ కొరతతో హోటళ్లు, పాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు మూతపడుతున్నాయి. దీంతో వందలాది మంది చిరువ్యాపారులు ఇబ్బందులు పడుతుండగా, వీటిపై ఆధారపడి బతుకుతున్న కార్మికులు సైతం ఉపాధిని కోల్పోతున్నారు

రాజాం రూరల్‌, మార్చి 21 (ఆంరఽధజ్యోతి): పశ్చిమాసియా యుద్ధం ప్రభావం పరోక్షంగా గ్యాస్‌ సిలిండర్ల సరఫరాపై పడింది. ప్రధానంగా వాణిజ్య సిలిండర్ల సరఫరాను ఆయా కంపెనీలు నిలిపివేశాయి. దీంతో జిల్లాలో హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌, టిఫిన్‌ సెంటర్లు, టీ స్టాల్స్‌ మూతపడుతున్నా యి. ఈనేపథ్యంలో గ్యాస్‌ కష్టాల నుంచి గట్టేక్కెందుకు కొందరు కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తూ హోటళ్ల నిర్వహణ సాగిస్తున్నారు. మరికొందరు పాతపద్ధతిలో ఊకపొయ్యిలను వాడుతు న్నారు. ఇంకొంతమంది ఎక్కువ ధరకు బ్లాక్‌లో సిలిండర్లు కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు.

తప్పని కష్టాలు

గతంలో హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాల తయారీకి కమర్షియల్‌ సిలిండర్లు, పెద్దపెద్ద గ్యాస్‌ పొయ్యిలను వినియోగించేవారు. ప్రస్తుతం గ్యాస్‌ కొరత కారణంగా కట్టెల పొయ్యిలపై ఆరుబయట వంటలు చేస్తున్నారు. మెయిన్‌ జంక్షన్లు, ఫుట్‌పాత్‌లపై బజ్జీలు, నూడిల్స్‌, చికెన్‌ పకోడి, గారెలు వంటివి అమ్మకం చేసేవారు కమర్షియల్‌ సిలిండర్ల స్థానంలో సీక్రెట్‌గా డొమెస్టిక్‌ సిలిండర్లను వాడుతున్నారు. గ్యాస్‌ కొరత కారణంగా చెరకు(కలప)కు డిమాండ్‌ పెరిగింది. గతంలో సామిల్లులు(కర్రల డిపో) వద్ద వంట చెరకు వృథాగా పడిఉండేది. వాటికి ఎంతో కొంత చెల్లించి చిరువ్యాపారులు తీసుకెళ్లిపోయేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. వాటిని కూడా కిలోలు, క్వింటాళ్ల వంతున అమ్ముతున్నారు. కలపను బట్టి క్వింటా రూ.600 నుంచి రూ.800 ధర పలుకుతోంది. గ్యాస్‌ కష్టాలతో పాటు నిత్యాసవరాల ధరలకూ రెక్కలొచ్చాయి. మినపగుళ్లు, శనగ పలుకులు, వంటనూనె ధరలూ పెరిగాయి. వీధుల్లో, పట్టణ శివార్లలో ఇడ్లీ, దోశ, పూరి అమ్ముతూ కాలక్షేపం చేసేవారు ప్రస్తుత పరిస్థితుల్లో వాటి ధరలు పెంచారు. గతంలో రూ.20కి నాలుగు ఇడ్లీలతో పాటు రెండు రకాల చట్నీలు ఇచ్చేవారు. ఇప్పుడు మూడు ఇడ్లీలు, ఒక చట్నీతో సరిపెడుతున్నారు. గతంలో చిన్నచిన్న హొటళ్లలో ఇద్దరు నుంచి ముగ్గురు, పెద్దపెద్ద రెస్టారెంట్లలో పదిమంది, ఆపై సిబ్బంది పనిచేసేవారు. ప్రస్తుతం హోటళ్లు మూతపడడం, పెద్దపెద్ద రెస్టారెంట్లలో పనిలేక సిబ్బందిని కుదించడంతో వందలాది మంది ఉపాధిని కోల్పోతున్నారు.

అధికారుల దాడులు

జిల్లాలో విజిలెన్స్‌, రెవెన్యూ అధికారులు దాడులు ఉధృతం చేశారు. హోటళ్లు, ఇతరత్రా వ్యాపారాలు చేసేచోట వాడుతున్న డొమెస్టిక్‌ సిలిండర్లను పట్టుకుని స్వాధీనం చేసుకుంటున్నారు. అలాంటి వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ పరిణామాలతో బ్లాక్‌లో సిలిండర్‌ కొని షాపు నిర్వహిద్దామనుకునే వారిలో భయం వెంటాడుతోంది. ఈనెల 17న భోగాపురం మండలం పోలిపల్లి జంక్షన్‌లో మూడు, 18న రాజాంలో తొమ్మిది డొమెస్టిక్‌ సిలెండర్లను అధికారులు స్వాధీనం చేసుకుని నిర్వాహకులపై 6ఏ కేసులు నమోదు చేశారు.

తప్పనిసరి పరిస్థితుల్లో..

గత్యంతరం లేని పరిస్థితుల్లో హోటల్‌ను కొనసాగిస్తున్నాం. కష్టకాలంలో హోటల్‌ను మూసివేస్తే ఇప్పటివరకూ ఉన్న పరపతి దెబ్బతింటుంది. కట్టెలపై వంటలు చేయిస్తూ నడుపుతున్నాం. నిర్వహణ చాలా భారంగా ఉంది. ఇదే పరిస్థితి మరో పదిరోజులు కొనసాగితే మూసివేయడం తప్ప మరో గత్యంతరం లేదు.

-చంద్రశేఖర్‌, హోటల్‌ యజమాని, శ్రీకాకుళం రోడ్‌, రాజాం

పనిలేక ఖాళీగా ఉన్నా

పాలకొండ రోడ్‌లో నూడిల్స్‌ షాపులో పనిచేసేవాడిని. రోజుకు రూ.300 ఇచ్చేవారు. వారంరోజులుగా షాపు తెరవడం లేదు. ప్రస్తుతం పనిలేక ఖాళీగా ఉన్నాను. ఎక్కడా పని దొరకడం లేదు. కూలి చేస్తేనే కడుపు నిండే పరిస్థితి మాది. ఇంకా ఎన్నాళ్లు ఈ కష్టాలుంటాయో భయమేస్తోంది.

-నరశయ్య, రాజాం

Updated Date - Mar 21 , 2026 | 11:35 PM