gas problems గ్యాస్ కష్టాలు.. కళ్లకు ‘కట్టె’నట్టు
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:28 AM
Gas difficulties.. like 'firewood' for the eyes పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పుడే ఆగేలా లేదు. గ్యాస్ దొరకదేమోనన్న భయంతో జిల్లాలో చాలా మంది కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. ఇంకొందరు గ్యాస్ లభించక సంప్రదాయ పొయ్యిలపై వంట చేస్తున్నారు.
గ్యాస్ కష్టాలు.. కళ్లకు ‘కట్టె’నట్టు
కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న ప్రజలు
కొద్దిరోజులుగా మారిన తీరు
విజయనగరంలో హోటళ్లు, హాస్టళ్లలోనూ ఇదే పరిస్థితి
అంతటా గ్యాస్ కొరత కష్టాలు
కట్టెలకు పెరుగుతున్న గిరాకీ
హోటళ్లు నడపలేమంటున్న నిర్వాహకులు
విజయనగరం, మార్చి 16 (ఆంధ్రజ్యోతి):
పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పుడే ఆగేలా లేదు. గ్యాస్ దొరకదేమోనన్న భయంతో జిల్లాలో చాలా మంది కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. ఇంకొందరు గ్యాస్ లభించక సంప్రదాయ పొయ్యిలపై వంట చేస్తున్నారు. మళ్లీ 20 ఏళ్లు వెనక్కి వెళ్లినట్టు కనిపిస్తోంది. ఎక్కడికక్కడే కట్టెలు, బొగ్గు ఆధారిత పొయ్యిలు దర్శనమిస్తున్నాయి. కరెంట్ స్టౌలనూ విరివిగా వాడుతున్నారు. విజయనగరంలో కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. పేరు మోసిన హోటళ్లలో కూడా కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు. అదే సమయంలో మెనూను కూడా తగ్గించారు. ఆది, మంగళ, బుధవారాల్లో మాత్రమే నాన్‌వెజ్ హోటళ్లు తెరుచుకుంటున్నాయి. ఆర్డర్లను సైతం తీసుకోవడం లేదు. వివాహాలతో పాటు శుభకార్యాల సీజన్ కావడంతో గ్యాస్ కొరతతో నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు. డొమస్టిక్ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తే అధికారులు తనిఖీలు చేసి పట్టుకోవటంతో హోటల్ వ్యాపారం కుదేలవుతోంది.
హాస్టల్ విద్యార్థులు సరిపెట్టుకోవాల్సిందే..
విజయనగరంలో పేరుమోసిన విద్యాసంస్థలు ఉన్నాయి. వివిధ ఉద్యోగ పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ సంస్థలు నడుస్తున్నాయి. అక్కడ చదువుకునే విద్యార్థులు ఎక్కువగా హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్నారు. అయితే వంట గ్యాస్ కొరతతో హాస్టళ్ల నిర్వాహకులు మెనూ తగ్గించేశారు. టిఫిన్ మెనూలో చపాతి, దోసె, టీ, కాఫీలను తీసేశారు. సాంబార్, కుర్మాను సైతం ఇవ్వలేమని తేల్చిచెబుతున్నాట్టు తెలిసింది. కేవలం చట్నీతో మాత్రమే సరిపెట్టుకోవాలని సూచిస్తున్నారు. టీ దుకాణాల్లో గతం మాదిరిగా ఎప్పటికప్పుడు తయారుచేసి ఇవ్వడం లేదు. కొన్ని హాస్టల్స్‌లో హోటల్ నుంచి ఆహార పదర్థాలను తీసుకొచ్చి పెడుతున్నారు.
పెరిగిన కట్టెల ధరలు..
విజయనగరంలో కట్టెలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. వాటి ధర కూడా అమాంతం పెరిగింది. గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వంట చెరకును దిగుమతి చేసుకుంటున్నారు. గ్యాస్ కొరతతో నగరంలోని హోటళ్లన్నీ కట్టెల పొయ్యిలనే ఆశ్రయిస్తున్నాయి. స్టార్ హోటళ్లలో మాత్రం విద్యుత్‌తో ఆహార పదార్థాలను తయారుచేసుకుంటున్నాయి. ఇడ్లీ, సాంబర్, వడ వంటి వాటితో పాటు బిర్యానీ తయారీకి ఎక్కువగా కట్టెల పొయ్యినే వినియెగిస్తున్నారు. మరికొద్దిరోజుల పాటు యద్ధం కొనసాగి గ్యాస్ సరఫరా మరింత కష్టమైతే మాత్రం హోటళ్లు, టిఫిన్ సెంటర్ల మూతవేయడం తప్పదని చెబుతున్నారు.
ఇలా అయితే ఇబ్బందే..
వాణిజ్య అవసరాలకు సంబంధించి గ్యాస్ సిలిండర్ల లభ్యత లేదు. అతి కష్టమ్మీద హోటళ్లు నిర్వహిస్తున్నాం. ఆర్డర్లు తగ్గించాం. మెనూ తగ్గించుకోవాల్సి వస్తోంది. కట్టెల పొయ్యని ఆశ్రయిస్తున్నాం. కట్టెల ధరలు కూడా పెరిగాయి. ఇలా అయితే హోటళ్లు నడపడం చాలా కష్టం.
- హోటల్ నిర్వాహకుడు నాగారాజు విజయనగరం
హాస్టల్ విద్యార్థినులకు అవస్థలు
విజయనగరం టౌన్, మార్చి16(ఆంధ్రజ్యోతి): గ్యాస్‌ను ఏజెన్సీ సరఫరా చేయకపోవడంతో సోమవారం వంట మధ్యలో ఆగిపోయిందని, ఉడికీ ఉడకని అన్నాన్ని విద్యార్థులకు పెట్టడంతో తినేందుకు నిరాకరించారని నగరంలోని స్త్రీశిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళాశాల బాలికల వసతిగృహాం ఇన్‌చార్జి సూపరింటెండెంట్ జగదీశ్వరి వాపోయారు. దగ్గర్లో ఉన్న హోటల్ నుండి భోజనాలను తీసుకువచ్చి అందించామన్నారు. ఐదు రోజులుగా ఎన్‌వీఆర్ గ్యాస్ ఏజెన్సీ వద్దకు కాళ్లు అరిగేలా తిరుగుతున్నా ఒక్క గ్యాస్ బండను కూడా పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయమై గ్యాస్ ఏజెన్సీ యజమానిని వివరణ కోరగా తనకు గ్యాస్ కోసం లెటర్ ఇవ్వలేదని, ఇచ్చి ఉంటే గ్యాస్ పంపిణీ చేసేవారమని తెలిపారు.
మళ్లీ తెరపైకి పిడకలు
బొబ్బిలి, మార్చి 16 (ఆంధ్రజ్యోతి):
ఉరుము ఉరిమి పెనం మీద పడినట్లు...అక్కడెక్కడో గల్ఫ్ దేశాలలో జరుగుతున్న ఘోర యుద్ధాల ప్రభావం పట్టణాలు, మారుమూల పల్లెల్లో జనజీవనంపై పడింది. వంటగ్యాస్ బుక్ చేసుకునేందుకు కనీసం 45 నుంచి 50 రోజులు గడువు ఉండాలన్న చెబుతుండడంతో అందరూ కట్టెల పొయ్యిలను ఆశ్రయించక తప్పడం లేదు. ఇంకొందరు పేడతో పిడకలను తయారు చేసుకుంటున్నారు. పశుసంపద ఉన్న వారు గతంలో పశువుల పేడతో పిడకలను చేసుకొని వాటితో ఏడాది పొడవునా చిన్నపాటి వంటలను చేసుకునేవారు. ఇప్పుడు గ్యాస్ కొరత ఏర్పడడంతో మళ్లీ అటువైపు దృష్టిపెట్టారు. దీనిపై బొబ్బిలి మండలం జగన్నాథపురానికి చెందిన రైతు అప్పయ్యమ్మ మాట్లాడుతూ ఆవు పేడతో వారం రోజులు కష్టపడి పిడకలు చేసి ఎండబెట్టుకుంటే అవి వంటచెరకుగా ఆరు నెలలు వినియోగించుకునేవాళ్లమని, ఇప్పుడు గ్యాస్‌కు కొరత రావడంతో మళ్లీ వాటిని తయారు చేసుకుంటున్నామన్నారు.
పైపైకి నిత్యావసరాల ధరలు
రాజాం రూరల్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావం మనదేశంలో వంటింట్లో పడింది. యుద్ధప్రభావం నిత్యావసరాలపై స్పష్టంగా కనిపిస్తోంది. వంటనూనెలు సలసల కాగుతున్నాయి. గ్యాస్‌బండ భారంగా మారింది. చికెన్, మటన్ ధరలూ అల్లాడుతున్నాయి. గ్యాస్ బుక్ చేద్దామంటే అన్‌లైన్ బుకింగ్ పనిచేయడం లేదు. ఏజెన్సీల వద్ద చాంతాడంత క్యూ దర్శనమిస్తోంది. కొందామన్నా దొరకని పరిస్థితి నెలకొంది భారత్‌కు గ్యాస్ అత్యధికంగా సరఫరా చేసే ఖతార్ ఎగుమతిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో చమురు సంస్థలు ఒక్కసారిగా గ్యాస్ ధరలు పెంచాయి. దీనివల్ల గృహ వినియోగదారులపై భారం పడింది. పెరిగిన భారాన్ని భరించేందుకు వినియోగదారులు సిద్ధంగా ఉన్నా అందుబాటులో లేకపోవవడంతో నరకయాతన అనుభవిస్తున్నారు. గ్రామాలలో 45 రోజులకు, పట్టణాలలో 25 రోజులకు గ్యాస్ సరఫరా చేసేలా ప్రభుత్వం విధించిన కఠిన నిబంధన అన్నివర్గాల ప్రజలనూ ఇబ్బందుల్లోకి నెట్టింది. కాగా కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేయడంతో హాస్టల్స్, చిన్నచిన్న వ్యాపారులపై ఆ భారం పడింది. హోటళ్లకు తాళాలు పడుతున్నాయి.
ఉన్నమేరకు అందిస్తున్నాం
కొత్తా సాయిప్రశాంత్ కుమార్, లక్ష్మి గ్యాస్ ఏజెన్సీ, రాజాం
పెరిగిన గ్యాస్ ధరలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. ధరల పెంపు, తగ్గుదల మా పరిధిలో ఉండదు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన క్షణాల్లోనే కొత్త ధరతో బిల్ జనరేట్ అవుతుంది. వచ్చిన గ్యాస్ సిలిండర్లను మొదట బుక్ చేసిన వారికి మొదట డెలివరీ పద్ధతిలో వినియోగదారులకు గ్యాస్ అందిస్తున్నాం. మరికొన్ని రోజులు ఈ సమస్య తప్పదు.