Share News

Garbage in the pond చెరువులో చెత్త

ABN , Publish Date - Jan 21 , 2026 | 12:10 AM

Garbage in the pond శృంగవరపుకోట శివారు సీతంపేట సమీపంలో ఉన్న చెరువిది. ఎస్‌.కోట నుంచి విజయనగరం వెళ్లే రహదారికి ఆనుకుని ఉంది. ఎస్‌.కోట, సీతంపేట గ్రామాలకు చెందిన వారంతా ఇంటి నుంచి వచ్చే చెత్తనంతా ఈ చెరువులోనే పారబోస్తున్నారు.

Garbage in the pond చెరువులో చెత్త
చెత్తతో నిండిన ఎస్‌.కోట శివారు సీతంపేట సమీపంలోని చెరువు

చెరువులో చెత్త

వ్యర్థాలతో నిండిపోతున్న ప్రకృతి వనరులు

డంపింగ్‌ యార్డులుగా మార్చేస్తున్న పంచాయతీలు

కలుషితమవుతున్న తాగు, సాగు నీరు

కుచించుకుపోతున్నా పట్టించుకోని జలవనరుల శాఖ

భావితరాలకు ముప్పంటున్న పర్యావరణవేత్తలు

- శృంగవరపుకోట శివారు సీతంపేట సమీపంలో ఉన్న చెరువిది. ఎస్‌.కోట నుంచి విజయనగరం వెళ్లే రహదారికి ఆనుకుని ఉంది. ఎస్‌.కోట, సీతంపేట గ్రామాలకు చెందిన వారంతా ఇంటి నుంచి వచ్చే చెత్తనంతా ఈ చెరువులోనే పారబోస్తున్నారు. ఈ పంచాయతీకి డంపింగ్‌ యార్డు ఉన్నప్పటికీ అక్కడకు తరలించకుండా చెరువు గట్టుకు ఆనుకుని ఉన్న స్థలంలో పడేస్తున్నారు. దీంతో కొంచెం, కొంచెం చెరువు కుచించుకుపోతోంది.

- ఎస్‌.కోట మండలం పోతనాపల్లి గ్రామ సమీపంలో ఉన్న పెద్ద గెడ్డ ఇది. రాయివాని చెరువు మిగులు జలాలు సన్యాసినాయుడు చెరువులో కలుస్తాయి. ఈ రెండూ నిండేందుకు దోహదపడుతూ అనుసంధానంగా ఉన్న గెడ్డలో చెత్తా, చెదారం పోసేయడంతో చాలా వరకు కుచించుకుపోయింది. దీనిని ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు రోజూ చూస్తున్నారు.

శృంగవరపుకోట, జనవరి 20 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో చాలా చెరువులు, గెడ్డలు దయనీయ స్థితిలో ఉన్నాయి. ఒకప్పుడు చుట్టూ పచ్చని పరిసరాలు, స్వచ్ఛమైన నీటితో కనిపించే వాటిని చూస్తున్న స్థానికులు ఆవేదన చెందుతున్నారు. చెత్తా, చెదారంతో నిండిపోవడం చూసి అయ్యో అనుకుంటున్నారు. ప్రధానంగా రహదారులకు ఆనుకుని ఉన్న చెరువులు, గెడ్డలన్నీ డంపింగ్‌ యార్డులుగా మారిపోయాయి. ఆపై కుచించుకుపోవడంతో పాటు జల, వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి. జల వనరులను పరిరక్షించాల్సిన ఈ శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

జిల్లాలో అత్యధికంగా వ్యవసాయం చెరువుల ఆధారంగా సాగుతోంది. కొండ ప్రాంతాల్లో పడిన వర్షం గెడ్డల ద్వారా చెరువుల్లో చేరుతుంది. తుఫాన్‌, వాయుగుండాల ప్రభావంతో వర్షాలు పడినప్పుడు మోతాదుకు మించి వరద నీరు ప్రవహిస్తుంది. అలాంటి సమయంలో చెరువు గట్టుకు గండిపడకుండా గెడ్డల్లోకి నీటిని మళ్లిస్తారు. ఇంత ప్రాధాన్యత కలిగిన గెడ్డలను చెత్తా,చెదారంతో కప్పేస్తుండడంతో వర్షాకాలంలో వరద నీటి ప్రవాహాలను తట్టుకోలేకపోతున్నాయి. పంటపొలాల్లోకి, సమీప గ్రామాల్లోకి వరద వచ్చేస్తోంది. దీంతో అవన్నీ ముంపునకు గురవుతున్నాయి. పంటకు నష్టం జరుగుతుండగా, వరద నీరంతా ఇళ్లల్లోకి చేరడంతో అస్తి నష్టం కూడా జరుగుతోంది. ఇదిలా వుండగా చెరువులు, గెడ్డల్లో పడేసిన చెత్తను కాల్చుతున్నారు. దీన్నించి వస్తున్న పొగంతా సమీప గ్రామాలు, రహదారులను కప్పేస్తున్నాయి. ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. ప్రజారోగ్యానికి నష్టం జరిగే వివిధ రకాల సమ్మేళనాలతో కూడిన విషవాయువులును విడుదల చేస్తున్నాయి. మనుషులతో పాటు పశువులకు దీర్ఘకాలిక వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ఆక్షిజన్‌ పరిమాణం తగ్గుతోంది.

ఫ చెరువులు, గెడ్డల్లో పెరుగుతున్న మత్స్యసంపద మృత్యవాత పడుతోంది. ఆ నీటితో సాగు చేస్తున్న పంటలకు వివిధ రకాల తెగుళ్లు సోకుతున్నాయి. ఈ ఉత్పత్తులు తినే వారికి క్యాన్సర్‌ కారక వ్యాధులు సోకే ప్రమాదం ఉందని వైద్యశాఖ హెచ్చరిస్తూనే ఉంది.

అధికారులు ఉన్నా..

చెరువులు, గెడ్డల వంటి జలవనరులను కాపాడేందుకు ప్రతి మండలంలోనూ జలవనరుల శాఖ (ఇరిగేషన్‌) ఇంజనీర్లు ఉన్నారు. నాలుగైదు మండలాలకొక డిప్యూటీ ఇంజనీరింగ్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీరి కళ్లముందే పంచాయతీల నుంచి ట్రాక్టర్లు, ఇతర వాహనాలతో తీసుకొచ్చిన చెత్త, చెదారం చెరువులు, గెడ్డల్లో పారబోస్తుంటే వీరికి కనిపించదు. రహదారుల పక్కనే ఎక్కడికక్కడ చెరువులు, గెడ్డల్లో గుట్టలు, గుట్టలుగా చెత్త కనిపిస్తున్నా ఎవరూ అడగరు. ఈ పని మాది కాదన్నట్లుగా ఈశాఖ అధికారులు వ్యవహరిస్తుండడంతో పంచాయతీలు చెరువులు, గెడ్డలనూ డంపింగ్‌ యార్డులుగా వాడుకుంటున్నాయి.

ఫ ప్రభుత్వం చెత్త నుంచి సంపద కేంద్రాలను ప్రోత్సహిస్తోంది. ఇందుకు ప్రత్యేక వనరులను కేటాయిస్తోంది. స్వచ్ఛత కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పంచాయతీలకు అవార్డులను అందిస్తోంది. వీటన్నింటినీ పక్కన పెడుతున్న పలువురు పంచాయతీ అధికారులకు చెత్తను డంపింగ్‌ చేసేందుకు చెరువులు, గెడ్డలే కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌ తరాలకు తీవ్ర నష్టం జరుగుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోంది

గ్రామాల్లోని చెత్త, చెదారాన్ని తీసుకొచ్చి చెరువులు, గెడ్డలు, పంట కాలువల్లో పడేస్తున్నారు. ఇలా పడేసిన చెత్తలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇవి కాలుష్యకారకంగా మారుతున్నాయి. పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నాయి. పీల్చే గాలి, తినే తిండి విషంగా మారుతున్నాయి. జీవరాసులపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

- బొబ్బిలి రామకృష్ణ, పర్యావరణ వేత్త(గ్రీన్‌ ఎర్త్‌ ఆర్గనైజేషన్‌)

Updated Date - Jan 21 , 2026 | 12:10 AM