Ganjai Guttu Rattu గంజాయి గుట్టు రట్టు
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:04 AM
Ganjai Guttu Rattu గంజాయి గుట్టును మరోసారి పోలీసులు రట్టు చేశారు. ఈసారి రాయగడ నుంచి బొబ్బిలి మండలానికి తెస్తుండగా పట్టుకున్నారు. పక్కా సమాచారంతో నిఘా పెట్టి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి గుట్టు రట్టు
రాయగడ నుంచి తెస్తుండగా గుర్తించిన పోలీసులు
ముగ్గురి అరెస్టు
వివరాలు వెల్లడించిన డీఎస్‌పీ భవ్యారెడ్డి
బొబ్బిలి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి):
గంజాయి గుట్టును మరోసారి పోలీసులు రట్టు చేశారు. ఈసారి రాయగడ నుంచి బొబ్బిలి మండలానికి తెస్తుండగా పట్టుకున్నారు. పక్కా సమాచారంతో నిఘా పెట్టి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఆ వివరాలను స్థానిక పోలీసుస్టేషన్‌లో డీఎస్‌పీ భవ్యారెడ్డి శక్రవారం సాయంత్రం తెలియజేశారు.
ఒడిశా రాష్ట్రం రాయగడ నుంచి గురువారం రాత్రి బొబ్బిలి వైపుగా గంజాయి వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అప్రమత్తమైన డీఎస్పీ సిబ్బందికి ఆదేశించారు. ఆ మేరకు బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామ సమీపంలో దారి కాసారు. అంతలో టూ వీలర్‌పై అటుగా వచ్చిన ముగ్గురుని అడ్డుకుని తనిఖీ చేశారు. సీతానగరం మండలం రంగంపేట గ్రామానికి చెందిన ఎ.గణేశ్, బొబ్బిలి మండలం విజయపురికి గ్రామానికి సూరిపల్లి అఖిల్, గొల్లపల్లికి చెందిన లంక చందులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 4.770 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బైకును, సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఒక జువైనల్‌తో ఏడుగురు వినియోగదారులను కూడా గుర్తించామన్నారు.
- వేర్వేరు ప్రాంతాలలో నివిశిస్తున్న ఈ నిందితులు గంజాయి మత్తుకు బానిసలుగా మారారు. రాయగడ ప్రాంతం నుంచి గంజాయిని తెచ్చి కొంతమంది విద్యార్థులకు అలవాటు చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే కఠినచర్యలు
విద్యాసంస్థలు, ఇతరత్రా బయట ప్రదేశాలలో ఎక్కడైనా ఎవరైనా బాలికలు, మహిళలపట్ల ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్‌పీ భవ్యారెడ్డి హెచ్చరించారు. బొబ్బిలి మండలం కోమటిపల్లి ఫార్మసీ కళాశాలలో చోటుచేసుకున్న ఘటనలపై సమగ్ర విచారణ జరిపామన్నారు. ఈవ్‌టీజీంగ్ జరగడం వాస్తవమేనని అన్నారు. వారితో వ్యక్తిగతంగా మాట్లాడి భరోసా కల్పించామని చెప్పారు. విలేకరుల సమావేశంలో సీఐ కింతలి నారాయణరావు, ఎస్‌ఐ రమేష్, ఏఎస్‌ఐలు కొండలరావు, సన్యాసిరావు, చలపతి పాల్గొన్నారు.