Gaja Gaja ‘గజ’గజ
ABN , Publish Date - Jan 27 , 2026 | 12:03 AM
Gaja Gaja దిబ్బగుడ్డివలస పంచాయతీ సీతయ్యపేట గ్రామం శివారు పొలాల్లో సోమవారం ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. ఆదివారం రాత్రి రాజుపేట గ్రామంలోని మొక్కజొన్న పంటను ధ్వంసం చేశాయి.
‘గజ’గజ
సీతయ్యపేట గ్రామంలో ఏనుగుల స్వైరవిహారం
భయాందోళనలో గ్రామస్థులు
మొక్కజొన్న పంట ధ్వంసం
బొబ్బిలి రూరల్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): దిబ్బగుడ్డివలస పంచాయతీ సీతయ్యపేట గ్రామం శివారు పొలాల్లో సోమవారం ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. ఆదివారం రాత్రి రాజుపేట గ్రామంలోని మొక్కజొన్న పంటను ధ్వంసం చేశాయి. రైతు పూడి అప్పలనాయడుకు చెందిన 80 సెంట్లలో మొక్కజొన్న పంటను పాడు చేశాయి. సుమారు రూ.70 వేల పంట నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే రైతు కర్రి మన్మథరావుకు చెందిన 70 సెంట్లలో మొక్కజొన్న పంటను కూడా ధ్వంసం చేశాయి. రాజుపేట గ్రామంలోని పొలాల్లో రాత్రంతా తిష్ట వేసిన ఏనుగులు తెల్లారిన తర్వాత సీతయ్యపేట పొలాల్లో సంచరించాయి. గత కొద్దిరోజులుగా సమీప గ్రామాల్లో ఏనుగులు సంచరిస్తుండడంతో ప్రజలు భయపడుతున్నారు. ఎటువైపు నుంచి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. దాడి చేస్తాయేమోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
- అటవీశాఖ సిబ్బంది వచ్చినప్పటికీ తరిమే ప్రయత్నాలు చేయడం లేదన్న విమర్శ ఉంది. ఏనుగుల తరలింపులో అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వారి చొరవ లేకే నివాస ప్రాంతాల్లోకి, పంట పొలాల్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టిస్తున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఏనుగులను తిరిగి అడవిలోకి పంపాలని, నష్టపోయిన రైతులకు తక్షణం పరిహారం చెల్లించాలని డిమండ్ చేస్తున్నారు.
- ఏనుగులను చూడడానికి ప్రజలు ఎగపడుతున్నారు. ఎవరూ ఏనుగుల గుంపు వద్దకు వెళ్లొద్దని ఎంపీడీవో పి.రవికుమార్ ఆదేశాలతో వీఆర్‌ఏ టాంటాం వేశారు.