నమ్మించి.. నకిలీ బంగారం అంటగట్టి
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:24 AM
అసలు బంగారమని నమ్మించి ఓ షాపు యజమానికి నకిలీ బంగారాన్ని అంటగట్టిన ఘటన రాజాంలో వెలుగుచూసింది.
-దుకాణదారునికి బురిడీ కొట్టించిన దంపతులు
-రూ.6 లక్షలతో ఉడాయించిన వైనం
-పోలీసులను ఆశ్రయించిన బాధితులు
రాజాంరూరల్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): అసలు బంగారమని నమ్మించి ఓ షాపు యజమానికి నకిలీ బంగారాన్ని అంటగట్టిన ఘటన రాజాంలో వెలుగుచూసింది. అతనికి రూ.6లక్షలు కుచ్చుటోపి పెట్టి ఓ జంట ఉడాయించింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల వివరాల ప్రకారం.. రాజాం పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన గరుగుబిల్లి జగదీష్ అనే వ్యక్తి పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయ సమీపంలో కొన్నాళ్లుగా బ్యాంగిల్స్, ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తున్నాడు. 15 రోజుల కిందట ఓ జంట(భార్యాభర్త) బేంగిల్ షాపునకు వచ్చి అవసరమైన గాజులు, ఇతరత్రా ఫ్యాన్సీ మెటీరియల్ కొనుగోలు చేసింది. అక్కడి నుంచి తరచూ షాపునకు రావడం, వస్తువులు కొనడం ద్వారా జగదీష్ కుటుంబంతో స్నేహం ఏర్పడింది. నాలుగురోజుల కిందట దుకాణానికి వచ్చి తమ వద్ద ఎనిమిది తులాల బంగారం ముక్క ఉందని, అమ్మకం చేయాలని జగదీష్‌కు చెప్పారు. నిజమేనని నమ్మిన ఆయన ఆ బంగారాన్ని షాపు వద్దకు తీసుకురావాలని సూచించాడు. దీంతో ఈనెల 11న మధ్యాహ్నం ఒంటి గంటలకు ఆ దంపతులిద్దరూ 20 తులాల బంగారం ముక్కతో షాపునకు వచ్చారు. తమవద్ద ఉన్న నాలుగు గ్రాముల ఒరిజినల్ బంగారాన్ని 20 తులాల ముక్కలో నుంచి కట్ చేశామని జగదీష్‌కు చూపించి టెస్ట్ చేయించేందుకు వెళ్దామని నమ్మబలికారు. దీంతో జగదీష్ భార్య, బంగారం తెచ్చిన మహిళ ఇద్దరూ కలిసి జగదీష్‌కు తెలిసిన ఓ బంగారం షాపునకు వెళ్లారు. కట్‌చేసి ఉన్న నాలుగు గ్రాముల ముక్కను టెస్ట్ చేయించారు. అది అసలైన బంగారమేనని ఆ షాపు యజమాని నిర్దారించడంతో తిరిగి బ్యాంగిల్ షాపు వద్దకు వెళ్లిపోయారు. రాత్రి 8 గంటల సమయంలో 8 తులాల ముక్కను తీసుకుని ఆ దంపతులు మళ్లీ వచ్చారు. ముందుగా నిర్ణయించుకున్న ధర ప్రకారం జగదీష్ వారికి రూ.6 లక్షలు చెల్లించాడు. నగదు చేజిక్కించుకున్న తరువాత ఆ దంపతులిద్దరూ ఉడాయించారు. దీంతో అనుమానం వచ్చిన జగదీష్, అతని భార్య రాత్రి 11 గంటల సమయంలో బంగారు షాపు యజమానిని పిలిపించి తనిఖీ చేయించగా అది నకిలీదని తేలింది. దీంతో లబోదిబోమన్నారు. దీనిపై రాజాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఉమావెంకటేశ్వరరావు తెలిపారు.