పాలిటెక్నిక్‌తో భవిత!
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:32 AM
పాలిటెక్నిక్ కోర్సులతో విద్యార్థులకు ఉజ్వల భవిత అందుతోంది.
-ఉపాధినిచ్చే కోర్సులెన్నో..
- ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు
- ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
- మరో 8 రోజులే గడువు
రాజాం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్ కోర్సులతో విద్యార్థులకు ఉజ్వల భవిత అందుతోంది. ప్రస్తుతం డిప్లొమో కోర్సులు ఆధునిక అవసరాలు తీరేలా, వైవిధ్యంగా రూపొందుతున్నాయి. పాలిటెక్నిక్‌లో పలు బ్రాంచీల్లో చేరే విద్యార్థులు చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు పొందవచ్చు. స్వయం ఉపాధి, ఉన్నత విద్య దిశగా అడుగులు వేయవచ్చు. సాంకేతి విజ్ఞానంపై ఆసక్తి ఉండి..తక్కువ వ్యవధిలో స్థిరడాలనుకునే వారికి డిప్లొమోలు దారిచూపుతాయి. మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో పట్టున్న వారు రాణించగలుగుతారు. డిప్లొమోలో చేరడానికి పాలిటెక్నిక్ ఉమ్మడి పరీక్ష (పాలీసెట్)లో అర్హత పొందాలి. సాధించిన ర్యాంకులు అనుసరించి మంచి కాలేజీలు, కోరుకున్న కోర్సులో చేరవచ్చు. పాలిసెట్ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. ఏప్రిల్ 4 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. అదే నెలలో 25న పరీక్ష జరగనుంది.
కోర్సుల వివరాలు
ఉమ్మడి జిల్లాలోని విజయనగరం, చీపురుపల్లి, పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, చినమేరంగి (జియ్యమ్మవలస), సీతంపేటలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి. పదుల సంఖ్యలో ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. పాలిటెక్నికల్‌లో అనేక రకాల కోర్సులు అందుబాటులో ఉంటాయి. మనకు ఇష్టమైన, అభిరుచి, నైపుణ్యం కలిగిన బ్రాంచీలను ఎంపిక చేసుకోవచ్చు. తద్వారా ఆ కోర్సులో పట్టు సాధించి ఉద్యోగ, ఉపాధిని దక్కించుకోవచ్చు. పాలిటెక్నిక్‌లో సివిల్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, మెకానికల్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ర్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలకా్ట్రనిక్స్ అండ్ ఇన్‌స్ట్రూమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, గార్మెంట్ టెక్నాలజీ, క్రాఫ్ట్ టెక్నాలజీ, హోం సైన్స్, మెటలార్జికల్, కెమికల్, సిరామిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, టెక్స్‌టైల్స్, రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, పెట్రోలియం టెక్నాలజీ, పెట్రో కెమికల్ టెక్నాలజీ, ప్యాకింగ్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, ఎంబడెడ్ సిస్టమ్స్, ఫుట్‌వేర్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ వంటి కోర్సులు ఉన్నాయి. ఇవి రెండు, మూడు, మూడున్నరేళ్ల పాటు కొనసాగుతాయి. ఎక్కువ డిప్లొమోలు రెండేళ్లకే పూర్తవుతాయి. వీటిపై అవగాహన ముఖ్యం. చాలామంది ఇన్ని కోర్సులు అందుబాటులో ఉంటాయని తెలియదు. అందుకే ముందు అవగాహన కలిగించుకోవాలి. ఉజ్వల భవిత, ఉద్యోగ, ఉపాధినిచ్చే కోర్సులను ఎంచుకోవడం ఉత్తమం.
ప్రయోజనాలు..
డిప్లొమోతో చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ వంటి రంగాల్లో ఉజ్వల భవిత కనిపిస్తోంది. వీటి కోసం బీటెక్ వరకూ చూడకుండా డిప్లొమోతో కూడా ఉద్యోగాలు పొందవచ్చు. వీటిలో ప్రావీణ్యం ఉంటే.. పది తరువాత డిప్లొమో పూర్తిచేసి ఈ కొలువులు ఇట్టే సాధించవచ్చు. చాలా పాలిటెక్నిక్ కాలేజీల్లో వెబ్ డిజైనింగ్, త్రీడీ యానిమేషన్ గ్రాఫిక్స్, యానిమేషన్-మల్టీమీడియా టెక్నాలజీ, ప్యాకింగ్ టెక్నాలజీలో కూడా చాలా రకాల కోర్సులు ఉన్నాయి.
కొలువులు ఇలా..
డిప్లొమోతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందవచ్చు. రైల్వేలో జూనియర్ ఇంజనీర్, లోకో పైలెట్ పోస్టును డిప్లమోతోనే సాధించవచ్చు. వివిధ కేంద్ర సంస్థల్లో జూనియర్ ఇంజనీర్ పోస్టులను డిప్లమో అర్హతగా భర్తీ చేస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి విద్యుత్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల్లో జూనియర్, సబ్ ఇంజనీర్ పోస్టులను పొందవచ్చు. ప్రైవేటురంగంలో సైతం డిప్లొమో అభ్యర్థులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. నిర్మాణరంగం, ఆటోమొబైల్ రంగం, పవర్ ప్లాంట్లు, ఇంజనీరింగ్ సంస్థల్లో సులువుగానే నిలదొక్కుకోవచ్చు. ప్రభుత్వంతో పాటు పేరొందిన పాలిటెక్నిక్ కాలేజీల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు కూడా జరుగుతుంటాయి. పలు రంగాల్లో సేవలందిస్తున్న కార్పొరేట్ సంస్థలు ఆకర్షణీయమైన జీతాలు ఇచ్చి ఉద్యోగాలిస్తుంటాయి. విదేశీ కంపెనీల్లో డిప్లొమో అర్హతతో ఉద్యోగాలు సాధించవచ్చు. డిప్లొమో చేసిన వారు నేరుగా బీటెక్ రెండో సంవత్సరంలో అడ్మిషన్ పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే పాలిసెట్‌లో దరఖాస్తు చేసుకోండి.
సద్వినియోగం చేసుకోవాలి
గతం కంటే ఇపుడు పాలిటెక్నిక్‌కు డిమాండ్ పెరిగింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయి. డిప్లొమో కోర్సులకు ఇప్పుడు ప్రత్యేకంగా ఉద్యోగాలు ఉన్నాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ప్రైవేట్ రంగంలో కూడా కొలువులు పెరిగాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
-నాగభూషణరావు, అధ్యాపకుడు, రాజాం