ప్రతిపాదించినా నిధులివ్వలే!
ABN , Publish Date - Jul 02 , 2026 | 11:33 PM
జిల్లాలోని పలు రహదారులపై వందేళ్ల పైబడి చరిత్ర ఉన్న బ్రిడ్జిలు, నాణ్యతా లోపంతో నిర్మించిన బ్రిడ్జిలు చాలా ఉన్నాయి.
- జిల్లాలో అనేక శిథిల వంతెనలు
- పొంచి ఉన్న ప్రమాదం
- పునర్నిర్మాణానికి అధికారుల ప్రతిపాదనలు
- ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో జిల్లాకు దక్కని కేటాయింపు
జియ్యమ్మవలస, జూలై 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు రహదారులపై వందేళ్ల పైబడి చరిత్ర ఉన్న బ్రిడ్జిలు, నాణ్యతా లోపంతో నిర్మించిన బ్రిడ్జిలు చాలా ఉన్నాయి. వీటిల్లో చాలా వంతెనలు శిథిలావస్థకు చేరాయి. వీటి మీద ప్రయాణం అంటే జిల్లావాసులకు దడే. కానీ, తప్పని పరిస్థితిలో ప్రయాణం చేయాల్సిన దుస్థితి. ఎప్పుడు కూలుతాయో? ఏమో గాని పెను ప్రమాదాలు పొంచి ఉన్నాయి. వీటిని ఎప్పుడు పునర్నిర్మిస్తారా? అంటూ ఎదురు చూస్తున్న జిల్లావాసుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఇటీవల రాష్ట్రంలో రూ.804.63 కోట్లతో నిర్మించతలపెట్టిన 98 వంతెనల్లో జిల్లాకు చోటుదక్కలేదు. కనీసం ఒక్క వంతెనకైనా నిధులు కేటాయించకపోవడంపై జిల్లా వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
రాష్ట్రంలో పార్వతీపురం మన్యం చివరి సరిహద్దు జిల్లా. ఈ జిల్లా ఒడిశా రాష్ట్రానికి ఆనుకొని ఉంటుంది. దీని పైనుంచే ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు రాకపోకలు సాగుతుంటాయి. ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రవేశ ద్వారంగా చెప్పవచ్చు. ముఖ్యంగా పార్వతీపురం జిల్లా కేంద్రం నుంచి కొమరాడ మండలం మీదుగా ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లాలోకి వెళ్లే స్టేట్ హైవే ఉంది. అలాగే గుమ్మలక్ష్మీపురం మండలం కందుకుప్ప గ్రామం మీదుగా ఒడిశాకు వెళ్లే ప్రధాన రహదారి ఉంది. అంతేకాకుండా సీతంపేట, భామిని, సాలూరు మండలాల మీదుగా ఒడిశాకు వెళ్లే హైవే రోడ్లు ఉన్నాయి. వీటిపై అనేక చోట్ల పురాతన వంతెనలు ఉన్నాయి. ఇందులో చాలా వరకు శిథిలావస్థకు చేరాయి. కానీ, ఒక్క బ్రిడ్జిని కూడా నూతనంగా నిర్మించేందుకు అవకాశం దక్కలేదు. జిల్లాలోని వంతెనల దుస్థితిపై సీపీఎం ఆధ్వర్యంలో ప్రజలు ఎన్నోసార్లు ఆందోళనలు చేశారు కూడా. ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు కూడా వీటికి మద్దతు పలికాయి. అయినప్పటికీ పాలకులకు జాలి కలగలేదని జిల్లావాసులు ఆక్రోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిపాదనలు ఇవీ..
జిల్లాలో చిన్నాపెద్ద కలిపి దాదాపు 200కు పైగా వంతెనలు ఉన్నాయి. వీటన్నింటినీ జిల్లా ఆర్‌అండ్‌బీ అధికారులు పరిశీలించి 28 వంతెనల పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించారు. ఇందులో కొన్ని వంతెనలకు మరమ్మతులు కూడా చేయాల్సి ఉందని ప్రభుత్వానికి నివేదిక పంపించారు. జిల్లా నుంచి పంపిన ప్రతిపాదనల్లో కొమరాడ మండలం కోటిపాం హైలెవెల్ బ్రిడ్జితో పాటు ఆరు మైనర్ బ్రిడ్జిలు, మూడు పాత బ్రిక్ ఆర్జ్ బ్రిడ్జిలు ఉన్నాయి. వీటి పరిస్థితి దారుణంగా ఉండడంతో రూ. 26.70కోట్లతో పునర్నిర్మాణానికి, రూ.60 లక్షలతో నాలుగు బ్రిడ్జిలు మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదనలు పంపించారు. అలాగే జిల్లాలో మరో 17 మేజర్ జిల్లా రోడ్లు (ఎండీఆర్)పై వంతెనల పునర్నిర్మాణానికి రూ.44.05కోట్లు అవసరమని ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదనలు చేశారు. కానీ, ఒక్కదానికి కూడా నిధులు మంజూరు కాలేదు.
- జిల్లా కేంద్రం పార్వతీపురం నుంచి కొమరాడ మండలం మీదుగా ఒడిశా రాష్ట్రానికి వెళ్లే ప్రధాన రహదారిపై కోటిపాం గ్రామం పక్కనే జంఝావతి కాలువపై 1905లో బ్రిడ్జిని నిర్మించారు. ఇది స్టేట్ హైవే రోడ్డుపై ఉంది. ప్రస్తుతం ఈ వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేర కూలడానికి సిద్ధంగా ఉంది. దీని నిర్మాణానికి రూ.12కోట్లతో, మరమ్మతులకు మరో రూ.30లక్షలతో ఆర్‌అండ్‌బీ ప్రతిపాదనలు పంపింది.
- జియ్యమ్మవలస మండలం రావాడ వద్ద ఉన్న వట్టిగెడ్డ రిజర్వాయర్ దిగువన కురుపాం - పీటీ మండ ఆర్‌అండ్‌బీ రోడ్డులో కాజ్‌వే నిర్మాణం తప్పనిసరి. వర్షాలు పడి వరద ఉధృతి ఎక్కువైతే 30 గిరిజన గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. దీని నిర్మాణానికి పలుమార్లు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. ప్రతిపాదనల్లో ఉన్న ప్రతి వంతెనదీ ఇలాంటి పరిస్థితే. ఇకనైనా ప్రభుత్వం పునఃసమీక్షించి వంతెనల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఆర్‌అండ్‌బీ ఈఈ పి.రాధాకృష్ణను వివరణ కోరగా.. ‘జిల్లాలోని ప్రధాన వంతెనల పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి పునర్నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూస్తున్నాం.’ అని తెలిపారు.