గ్రంథాలయాలకు నిధులు
ABN , Publish Date - Jan 30 , 2026 | 11:47 PM
ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
- త్వరలో రూ.1.24కోట్లు విడుదల
- ఫర్నీచర్, పుస్తకాల కొనుగోలుకు చర్యలు
విజయనగరం రూరల్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలి విడతగా త్వరలో రూ.కోటి 24 లక్షల 20 వేలు విడుదల చేయనుంది. ఈ నిధులతో గ్రంథాలయాలకు అవసరమైన ఫర్నీచర్, వివిధ పోటీ పరీక్షల పుస్తకాలను కొనుగోలు చేయడంతో పాటు ఇతర సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టనుంది. 2026-27 సంవత్సరానికి గాను ఈ నిధులు విడుదల కానున్నాయి. 2027 మార్చిలోగా ఈ నిధులను వినియోగించి, తగిన యూసీ (యుటిలైజేషన్ సర్టిఫికేట్‌లను) ప్రభుత్వానికి పంపించాల్సి ఉంది. జిల్లాలోని అన్ని గ్రంథాలయాల్లో పుస్తకాల కొరత ఉంది. దీంతో పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి అవసరమైన పుస్తకాలు పూర్తిస్థాయిలో లేవు. దాతల సహకారంతో కొన్ని పుస్తకాలు సమకూర్చినా చాలా గ్రంథాలయాల్లో కాంపిటేటివ్ పుస్తకాల కొరత ఉంది. పేద, మధ్యతరగతి నిరుద్యోగ అభ్యర్థులు తమ ఆర్థిక పరిస్థితి కారణంగా కోచింగ్ సెంటర్లకు వెళ్లలేక, ఎక్కువగా గ్రంథాలయాల్లో లభ్యమయ్యే పుస్తకాలపైనే ఆధారపడుతుంటారు. అయితే, గత రెండేళ్లుగా గ్రంథాలయాల్లో లేటేస్ట్ అప్‌డేట్‌తో వచ్చే పోటీ పుస్తకాలు అంతంత మాత్రంగా ఉండడంతో వీరంతా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది అక్టోబరులో ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రంథాలయాల అధికారులు పుస్తకాలకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో తొలివిడతగా రూ.1.24కోట్లు విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది.
నిధులు ఇలా..
విజయనగరం జిల్లా కేంద్ర గ్రంథాలయానికి రూ.24లక్షలు, విజయనగరంలోని శాఖా గ్రంథాలయాలకు రూ.25లక్షలు, మెంటాడ రూ.6లక్షలు, జామి రూ.10.45లక్షలు, పూసపాటిరేగ రూ.10.35లక్షలు, గజపతినగరం రూ.12లక్షలు, మెరకముడిదాం రూ.2.30లక్షలు, బాడంగి రూ.11.50 లక్షలు, కొమరాడ(పార్వతీపురం) రూ.12.50లక్షలు, కురుపాం గ్రంథాలయానికి రూ.9.60లక్షలు విడుదల కానున్నాయి.
సంతోషంగా ఉంది..
గ్రంథాలయాలకు ప్రభుత్వం నిధులు కేటాయించడం సంతోషంగా ఉంది. గత రెండేళ్లుగా పుస్తకాల కొరత ఉంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏపీపీఎస్‌సీ గ్రూప్స్‌తో పాటు, బీఎస్‌ఆర్‌బీ, ఆర్‌ఆర్‌బీ, డీఎస్సీ, పోలీసు రిక్రూట్‌మెంట్ ఇలా పలు కాంపిటేటీవ్ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు గ్రంథాలయాలకు సమకూరుతాయి. దీనివల్ల నిరుద్యోగ యువతకు ఎంతో మేలు జరుగుతుంది.
-ఎం.అప్పలరాజు, ద్వారపూడి, విజయనగరం