Fuel Conservation ఇంధన పొదుపు అందరి బాధ్యత
ABN , Publish Date - May 16 , 2026 | 11:52 PM
Fuel Conservation is Everyone’s Responsibility ఇంధన పొదుపు అందరి బాధ్యత అని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. స్వచ్ఛాంద్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పార్వతీపురంలో శనివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్‌రెడ్డి, ఐటీడీఏ పీవో వైశాలి తదితరులు సైకిల్ తొక్కి ఇంధన పొదుపుపై అవగాహన కల్పించారు.
పార్వతీపురం టౌన్, మే 16(ఆంధ్రజ్యోతి): ఇంధన పొదుపు అందరి బాధ్యత అని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. స్వచ్ఛాంద్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పార్వతీపురంలో శనివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్‌రెడ్డి, ఐటీడీఏ పీవో వైశాలి తదితరులు సైకిల్ తొక్కి ఇంధన పొదుపుపై అవగాహన కల్పించారు. స్థానిక మున్సిపల్ పార్కు నుంచి అగ్రహరం వీధిలోని శివాలయం వరకు సుమారు కిలోమీటర్ మేర సైకిల్ తొక్కి అందర్నీ ఉత్సాహపరిచారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పిలుపుల మేరకు ప్రతిఒక్కరూ ఇంధన పొదుపు పాటించాలని కలెక్టర్ పిలుపు నిచ్చారు. బైక్‌లకు ప్రత్యామ్నాయంగా సైకిళ్లను వాడడం అలవాటు చేసుకోవాలన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో... సుదూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో మాత్రమే వాహనాలను వినియోగించాలని సూచించారు. ఎలక్ట్రికల్ వాహనాలపై మొగ్గు చూపాలన్నారు. ఇళ్లలో ఏసీలు, ఇతర విద్యుత్ పరికరాల విని యోగం తగ్గించాలని తెలిపారు. పార్వతీపురాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. చెరువులను బాగు చేసి, వాటి చుట్టూ వాకింగ్, రన్నింగ్ ట్రాక్‌ల ఏర్పాటుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. పట్టణ సుందరీకరణకు కావాల్సిన మొక్కల కోసం చెరువుల పరిసర ప్రాంతాల్లో నర్సరీలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. చెరువుల్లో నీటిని శుద్ధి చేసి ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా కృషిచేస్తామన్నారు. ప్లాస్టిక్ డబ్బాల్లో చిన్న చిన్న మొక్కలను పెంచుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
- బెలగాం: పిల్లలకు ఆహ్లాదాన్ని, వినోదాన్ని అందించే పార్కులను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. బెలగాంలోని మున్సిపల్ పార్క్‌లో పిల్లల కోసం అందుబాటులో ఉంచిన వివిధ రకాల ఆట పరికరాలు, మౌలిక వసతులను పరిశీలించారు. పాత టైర్లతో ఏర్పాటు చేసిన వివిధ రైడ్‌లపై పిల్లలు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడుకోవడాన్ని కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు. పిల్లల భద్రతకు లోటు లేకుండా ఆట స్థలాలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఐటీడీఏ పీవో వైశాలి, మున్సిపల్ కమిషనర్ పావని, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
కౌశలం అభ్యర్థులకు విశాఖలో జాబ్‌మేళా
పార్వతీపురం, మే16(ఆంధ్రజ్యోతి): కౌశలం ప్రోగ్రాంలో అసెన్‌మెంట్లు పూర్తి చేసిన అభ్యర్థులకు విశాఖపట్నంలో ప్రత్యేక జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఈ నెల 18 నుంచి 21 వరకు ఈ మేళా జరుగుతుందన్నారు. రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొన్నారు. అసెస్‌మెంట్లు పూర్తి చేసిన 167 మంది అభ్యర్థులు జాబ్‌మేళాకు హాజరుకావాలన్నారు. ఆధార్‌కార్డు, రెజ్యూమ్, విద్యార్హతల ధ్రువపత్రాలు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో వెళ్లాలని సూచించారు.