Share News

Roads నాడు రాళ్లు తేలి.. నేడు అద్దంలా మెరిసి!

ABN , Publish Date - Oct 14 , 2026 | 12:03 AM

From Rocky Roads to Smooth, Shining Streets! సీతంపేట ఏజెన్సీలో మారుమూల ప్రాంతమైన కోడిశ-కడగండి వయా గజిలి గ్రామానికి ఎట్టకేలకు బీటీ రహదారి పనులు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వ చొరవతో ఎట్టకేలకు రోడ్డు నిర్మాణం పూర్తికావడంతో గిరిజన గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 Roads నాడు రాళ్లు తేలి.. నేడు అద్దంలా మెరిసి!
కోడిశ-కడగండి వయా గజిలి బీటి రహదారి ఇలా..

హర్షం వ్యక్తంచేస్తున్న గిరిపుత్రులు

సీతంపేట అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో మారుమూల ప్రాంతమైన కోడిశ-కడగండి వయా గజిలి గ్రామానికి ఎట్టకేలకు బీటీ రహదారి పనులు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వ చొరవతో ఎట్టకేలకు రోడ్డు నిర్మాణం పూర్తికావడంతో గిరిజన గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కోడిశ నుండి కడగండి వరకు వరకు నిర్మించిన బీటి రహదారి పూర్తిగా ఛిద్రమైంది. రోడ్డు పొడవునా పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. కనీసం నడిచి కూడా రాకపోకలు సాగించలేని పరిస్థితి. అత్యవసర వేళల్లో 108 వాహనంతోపాటు బైక్‌లు ఆటోలు, వ్యాన్‌లు కూడా ఆయా గ్రామాల్లోకి రావడం లేదు. దీంతో ఆప్రాంత గిరిజనులు కొన్నేళ్ల పాటు నానా అవస్థలు పడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దీంతో రాష్ట్ర సర్కారు.. ఈ రోడ్డు నిర్మాణానికి రూ.3కోట్ల (సాస్కి-స్పెషల్‌ అసిస్టెంట్స్‌ టు స్టేట్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌) కేంద్ర నిధులు మంజూరుచేసింది. ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో కోడిశ జంక్షన్‌ నుంచి గుడ్డిమీదగూడ జంక్షన్‌ మీదుగా కడగండి వయా గజిలి వరకు మొత్తంగా 7.2కిలోమీటర్ల మేర బీటి రహదారి నిర్మాణం శరవేగంగా పూర్తయింది. దీంతో ఓండ్రుజోల, కడగండివలస, భూచెంద్రి, గులుమూరు, గుడ్డిమీదగూడ, జొన్నడుగూడ, రోలుగుడ్డి తదితర గిరిజన గ్రామాల ప్రజలకు దారి కష్టాలు తప్పాయి.

Updated Date - Oct 14 , 2026 | 12:03 AM