ఇక ప్రత్యక్ష పద్ధతిలోనే
ABN , Publish Date - Aug 18 , 2026 | 11:45 PM
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో బీసీల రిజర్వేషన్‌తో పాటు పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు సంబంధించి చైర్మన్ల ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించారు
మునిసిపల్ చైర్మన్ల ఎన్నిక
- మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం
- అక్టోబరులోపు ఎన్నికలు
- రాజకీయ పార్టీల నాయకులు హర్షం
పార్వతీపురం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో బీసీల రిజర్వేషన్‌తో పాటు పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు సంబంధించి చైర్మన్ల ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించారు. అక్టోబరు లోపు ఈ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. దీంతో జిల్లాలోని పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలతో పాటు పాలకొండ నగర పంచాయతీకి చైర్మన్‌లను ప్రజలు నేరుగా ఎన్నుకోనున్నారు. ప్రత్యక్ష పద్ధతిలో భాగంగా ప్రతి ఓటరూ రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒక ఓటు చైర్మన్ ఎన్నిక కోసం, మరొకటి వార్డు కౌన్సిలర్ కోసం వేయాల్సి ఉంటుంది. ప్రత్యక్ష ఎన్నికల వల్ల ప్రజాస్వామ్యానికి ఎంతో విలువ ఉంటుంది. పార్టీల బీఫారాలతో అభ్యర్థులు పోటీ చేయనున్నారు. వీరిలో మంచి వారిని, పనిచేసే వారిని ప్రజలు ఎన్నుకునేందుకు అవకాశం కలగనుంది. అభ్యర్థుల వ్యక్తిగత ప్రభావం రాజకీయ పార్టీలపై కూడా ఉంటుంది. పరోక్ష ఎన్నికల్లో అయితే పార్టీ ఆశీస్సులు ఎవరికి ఉంటే వారే చైర్మన్ కుర్చీ సొంతం చేసుకొనేవారు. చైర్మన్ కుర్చీ కోసం పోటీపడే వ్యక్తులు కౌన్సిలర్ల అభిమానం కోసం వారిని అనేక రకాలుగా మచ్చిక చేసుకోవాలల్సిన పరిస్థితి ఉండేది. మెజార్టీ సభ్యుల అభిమానం ఉన్నంతవరకు కుర్చీలో కొనసాగేవారు. వారి అభిమానాన్ని కోల్పోతే అవిశ్వాస తీర్మానం ద్వారా పదవిని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. అదే ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికైన చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అవకాశం ఉండదు.
- పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు సంబంధించి బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. దీనివల్ల పార్వతీపురం, సాలూరు మునిసిపాలిటీలు, పాలకొండ నగర పంచాయతీ పరిధిలో 33 శాతం బీసీలు కౌన్సిలర్లగా పోటీ చేయనున్నారు.
మంచి నిర్ణయం
ప్రజాస్వామ్యంలో ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించడం ఎంతో మంచి నిర్ణయం. ఈ పద్ధతిలో ఎన్నికైన చైర్మన్లు ప్రజలకు మంచి సేవలు అందించే అవకాశం ఉంటుంది. అభివృద్ధికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చైర్మన్ నిర్ణయంతో ముందుకు వెళ్లే పరిస్థితి ఉంటుంది.
-బెలగాం జయ ప్రకాష్‌నారాయణ, టీడీపీ నాయకుడు
అభివృద్ధికి ఆటంకం ఉండదు
ప్రజలే న్యాయ నిర్ణేతలుగా ఉండి చైర్మన్‌ను ఓటు హక్కు ద్వారా ఎన్నుకొనే అవకాశం ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఏర్పడుతుంది. చైర్మన్‌గా ఎన్నికైన వ్యక్తి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఎటువంటి ఆటంకం ఉండదు.
-ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు
ప్రజలే ఎన్నుకొనే అవకాశం
మున్సిపల్ చైర్మన్లకు సంబంధించి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పడం అభినందనీయం. ప్రజలే చైర్మన్‌ను ఎన్నుకొనే అవకాశం ఏర్పడుతుంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో బాగుంది.
-కోలా మధు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు, పార్వతీపురం