District Headquarters నాటి మేజర్ పంచాయతీ .. నేడు జిల్లాకేంద్రం
ABN , Publish Date - Oct 25 , 2026 | 12:15 AM
From a Major Panchayat to a District Headquarters పార్వతీపురం పురపాలక సంఘానికి ఎంతో చరిత్ర ఉంది. ఒకప్పుడు మేజర్ పంచాయతీ.. ఆ తర్వాత మున్సిపాల్టీగా ఎదిగిన పార్వతీపురం జిల్లాకేంద్రంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. రాజకీయ పరిణామాలు.. పాలనా మార్పులకు వేదికగా నిలిచిన పురపాలక సంఘంలో ఇప్పటి వరకు నలుగురు చైర్మన్లు, నలుగురు చైర్పర్సన్లు పనిచేశారు. కొంతకాలం ప్రత్యేకాధికారుల పాలన కూడా కొనసాగింది.
1962లో తొలిసారిగా స్థానిక ఎన్నికలు
ఇప్పటివరకు సేవలందించిన నలుగురు చైర్మన్లు, నలుగురు చైర్పర్సన్లు
పాలనా ప్రస్థానంలో ఎన్నో మలుపులు
పార్వతీపురం టౌన్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం పురపాలక సంఘానికి ఎంతో చరిత్ర ఉంది. ఒకప్పుడు మేజర్ పంచాయతీ.. ఆ తర్వాత మున్సిపాల్టీగా ఎదిగిన పార్వతీపురం జిల్లాకేంద్రంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. రాజకీయ పరిణామాలు.. పాలనా మార్పులకు వేదికగా నిలిచిన పురపాలక సంఘంలో ఇప్పటి వరకు నలుగురు చైర్మన్లు, నలుగురు చైర్పర్సన్లు పనిచేశారు. కొంతకాలం ప్రత్యేకాధికారుల పాలన కూడా కొనసాగింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మేజర్ పంచాయతీగా ఉన్న పార్వతీపురం 1959లో అప్పటి ఎంపీ చంద్రచూడామణి దేవీ కాలంలో పురపాలక సంఘంగా మారింది. మొదటి సారిగా 1962లో పాలకవర్గం ఏర్పడింది. అప్పటి మున్సిపాల్టీలో జనాభా 15 వేల మంది నుంచి 18వేల మంది ఉన్నట్లు గణంకాలు చెబుతున్నాయి. ఆ సమయంలో 12వ వార్డుల నుంచి పార్టీల గుర్తులు లేకుండా కౌన్సిలర్ అభ్యర్థులు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో గెలిచిన కౌన్సిల్ సభ్యుడు తిరుమళ్ల రామ్మూర్తిని చైర్మన్‌గా ఎన్నుకున్నారు. 1962 నుంచి 1983 వరకు ఆయన మూడుసార్లు చైర్మన్‌గా పాలన సాగించారు. 1983లో ఆయన చనిపోయారు. దీంతో రామ్మూర్తి సోదరుడు కౌన్సిలర్ అయిన బాబూరావును పాలకవర్గ సభ్యులు చైర్మన్‌గా ఎన్ను కున్నారు. 1983 నుంచి 1985 వరకు ఆయన చైర్మన్‌గా పాలన సాగించారు.
- 1984లో అప్పటి సీఎం ఎన్టీఆర్ ప్రత్యక్ష ఎన్నికలకు తెరలేపారు. దీంతో టీడీపీ తరపున పట్టణంలో కొత్తవలసకు చెందిన బచ్చల తిరుపతిరావు బరిలోకి దిగారు. 1985 మున్సిపల్ ఎన్నికల్లో ఆయన విజయ సాధించి.. 1985 నుంచి 1990 వరకు చైర్మన్‌గా వ్యవహరించారు. అప్పటవరకు ఉన్న 16 వార్డులను 24కు పెంచారు. 1990 నుంచి 1993 వరకు పార్వతీపురం మున్సిపాల్టీ ప్రత్యేకాధికారుల పాలనలో సాగింది.
- 1993లో జరిగిన మున్సిపల్ ప్రత్యక్ష పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో గుర్రం గుర్తుపై పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి మజ్జి నాగమణి, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులపై విజయం సాధించారు. అయితే నాగమణి టీడీపీలో చేరి 1998వరకు చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. ఇక 1998 నుంచి 1999 వరకు ప్రత్యేకాధికారుల పాలన సాగింది.
- 2000లో కూడా ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరగగా ముక్కల జయన్న మాస్టారును చైర్మన్‌గా ప్రజలు ఎన్నుకున్నారు. 2001లో పార్వతీపురం మున్సిపాల్టీ గ్రేడ్ -2 నుంచి గ్రేడ్-1గా రూపాంతరం చెందింది. జయన్న మాస్టారు 2005 వరకు చైర్మన్‌గా పాలనసాగించారు.
-2005లో జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు సోదరి నర్సింహప్రియా థాట్రాజ్ విజయం సాధించి చైర్పర్సన్ అయ్యారు. 2010 వరకు పాలన సాగించారు. అప్పట్లో వార్డులను 24 నుంచి 30కి పెంచారు.
- 2010 నుంచి 2014 వరకు మున్సిపాల్టీలో ప్రత్యేకాధికారుల పాలన సాగింది. ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు టీడీపీ అభ్యర్థి డి. శ్రీదేవి చైర్‌పర్సన్‌గా పాలన సాగించారు. ఓ ఏడాది మళ్లీ ప్రత్యేకాధికారి పాలన సాగింది. 2021లో జరిగిన ఎన్నికల్లో బోను గౌరీశ్వరి(వైసీపీ) చైర్‌పర్సన్‌గా పాలన బాద్యతలు చేపట్టారు.
- 2012 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 55, 555 మంది ఉండగా.. అనధికారికంగా 70వేల నుంచి 80 వేల మంది ఉంటారన్నది అంచనా. ప్రస్తుతం పురపోరు జరుగుతుంది. వార్డుల సంఖ్య 30 నుంచి 36కు పెంచారు. ఆయా వార్డుల నుంచి కూటమి పార్టీలతో పాటు వైసీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కౌన్సిలర్లు, చైర్పర్సన్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. నవంబరు1న పోలింగ్ జరగ్గా.. 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దీంతో మున్సిపల్ చైర్పర్సన్ పీఠం ఎవరికి దక్కుతుందో తేలనుంది.