From 13 to 356... 13 నుంచి 356కు..
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:00 AM
From 13 to 356... మూడేళ్ల కిందట కేవలం 13 మంది విద్యార్థునులే ఉండేవారు. దీంతో అసలు కళాశాల ఉంటుందా అన్న సందేహం స్థానికుల్లో కలిగేది. దీనిని గమనించిన ప్రిన్సిపాల్, అధ్యాపకులు ప్రగతి ప్రస్థానానికి సంకల్పంబూనారు. ప్రవేశాలు పెంచేందుకు ఓ ప్రణాళికతో అడుగులు వేశారు.
13 నుంచి 356కు..
అందరి దారి ఆ కళాశాల వైపే
ఈ ఏడాది అత్యధికంగా అడ్మిషన్లు
ప్రత్యేకంగా కృషి చేస్తున్న అధ్యాపకులు
రాజాం బాలికల జూనియర్ కాలేజీ ప్రస్థానం ఇది
మూడేళ్ల కిందట కేవలం 13 మంది విద్యార్థునులే ఉండేవారు. దీంతో అసలు కళాశాల ఉంటుందా అన్న సందేహం స్థానికుల్లో కలిగేది. దీనిని గమనించిన ప్రిన్సిపాల్, అధ్యాపకులు ప్రగతి ప్రస్థానానికి సంకల్పంబూనారు. ప్రవేశాలు పెంచేందుకు ఓ ప్రణాళికతో అడుగులు వేశారు. తల్లిదండ్రులను కలిసి ఉత్తమ బోధనకు హామీ ఇచ్చారు. వసతిగృహాలు కూడా అందుబాటులో ఉన్నాయని వివరించారు. వారికి నమ్మకం కలిగించి కళాశాలను ప్రగతి బాట పట్టించారు. వారి కృషి ఫలితంగా ఈ ఏడాది కొత్తగా 213 మంది చేరారు. 13 మంది నుంచి 356కు విద్యార్థినులు పెరిగిన ఆ కళాశాలే రాజాం బాలికల జూనియర్ కళాశాల. తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు, అధ్యాపకుల కృషితోనే ఇది సాధ్యమైంది.
రాజాం, జూన్ 19(ఆంధ్రజ్యోతి):
రాజాం ప్రభుత్వ మహిళా జూనియర్ కాలేజీలో 2023-24లో 13 మంది విద్యార్థులే ఉండేవారు. ప్రిన్సిపాల్ కుమరాపు జనార్ధనరావు బాధ్యతలు తీసుకున్నాక ప్రత్యేక దృష్టిసారించారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు 13 మందితో మాట్లాడి సమన్వయంతో ఒక్కో అడుగు వేశారు. అడ్మిషన్ల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వేసవి సెలవుల్లో విద్యార్థినుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులను కలిశారు. ఇక్కడ చేర్పిస్తే ఉత్తమ విద్యాబోధనతో పాటు హాస్టల్ వసతి కల్పిస్తామని చెప్పారు. వారి మాటను నమ్మి పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్నారు. పాలకొండ, బొబ్బిలి నియోజకవర్గాల నుంచి కూడా వచ్చి చేరుతున్నారు. 2024-25 నాటికి విద్యార్థినుల సంఖ్య 109కి ఏరింది. 2025-26 నాటికి 143కు పెరిగారు. ఈ ఏడాది ఆ సంఖ్య 356కి చేరుకుంది. ఇందులో కొత్త అడ్మిషన్లు 213 మంది కాగా.. రెండో సంవత్సర విద్యార్థినులు 143 మంది కొనసాగుతున్నారు. దీంతో రెట్టింపు ఉత్సాహంతో అధ్యాపకులు విద్యాబోధన ప్రారంభించారు. నేటికీ అడ్మిషన్ల కోసం విద్యార్థినుల తల్లిదండ్రులు సంప్రదిస్తున్నారు. కానీ వసతి సమస్య ఉండడంతో అడ్మిషన్లు ఇవ్వలేకపోతున్నారు.
- రాజాంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఒక్కటే ఉండేది. బాలికల కోసం ప్రత్యేక జూనియర్ కాలేజీ అవసరమని భావించి నేటి ఎమ్మెలే, నాటి మంత్రి కోండ్రు మురళీమోహన్ బాలికల జూనియర్ కాలేజీ మంజూరు చేయించారు. అయితే అప్పటికే ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఉండడం, ఆపై ప్రైవేటు జూనియర్ కాలేజీల హవా నడుస్తుండడంతో అడ్మిషన్లు మందకొడిగా ఉండేవి. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. చివరకు అడ్మిషన్లు 13కు పడిపోయాయి.
- ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో ఎంపీసీలో 75 మంది చేరారు. బైపీసీలో 85, సీఈసీలో 48, హెచ్‌ఈసీలో ఐదుగురు చేరారు. ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీలో 21, బైపీసీలో 50, సీఈసీలో 66, హెచ్‌ఈసీలో ఆరుగురు చదువుతున్నారు.
అధ్యాపకుల కృషితోనే..
ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో ఈ ఏడాది అత్యధికంగా విద్యార్థినులు చేరారు. అధ్యాపకులు సమన్వయంగా కృషిచేయడం వల్లే ఇది సాధ్యమైంది. ఇదే స్ఫూర్తితో పనిచేసి వచ్చే విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ఇంకా పెరిగేలా చేస్తాం. వసతి సమస్యతో పాటు అధ్యాపకులను అదనంగా నియమిస్తే రాజాంలోనే టాప్‌గా నిలుస్తుంది ఈ కాలేజీ. ఉత్తీర్ణతాపరంగా కూడా మెరుగైన ఫలితాలను సాధిస్తోంది.
కుమరాపు జనార్ధనరావు, ప్రిన్సిపాల్, రాజాం ప్రభుత్వ మహిళా జూనియర్ కాలేజీ
------------------