Frequent Power Cuts Continue ఎడాపెడా కరెంట్ కోతలు
ABN , Publish Date - May 11 , 2026 | 11:59 PM
Frequent Power Cuts Continue జిల్లాలో అనధికార విద్యుత్ కోతలు అధికమయ్యాయి. పల్లె, పట్టణ ప్రాంతాల్లో రోజురోజుకూ ఈ సమస్య తీవ్రమవుతోంది. అసలే వేసవి కాలం.. ఆపై మండే ఎండలు.. తరచూ కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం
కొన్నిసార్లు మెయింటెన్స్ పేరిట గంటల కొద్దీ కరెంట్ కట్
చిన్న గాలి వీచినా.. వర్షం కురిసినా...ఇక అంతే పరిస్థితి
వేసవి వేళ.. ప్రజలకు తప్పని ఇబ్బందులు
పార్వతీపురం, మే 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అనధికార విద్యుత్ కోతలు అధికమయ్యాయి. పల్లె, పట్టణ ప్రాంతాల్లో రోజురోజుకూ ఈ సమస్య తీవ్రమవుతోంది. అసలే వేసవి కాలం.. ఆపై మండే ఎండలు.. తరచూ కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నపాటి గాలి వీచినా.. ఓ మోస్తరు వర్షం పడినా చాలు.. గంటల తరబడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఇక గ్రామాల్లో పరిస్థితి అయితే దారుణం. రెండు, మూడ్రోజుల పాటు కరెంట్ సరఫరా ఉండడం లేదు. దీంతో పల్లెలు అంధకారంలో మగ్గాల్సి వస్తోంది. తాగు, సాగునీరు తదితర వాటికి పల్లెవాసులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో లైన్ మెయింటెన్స్ పేరిట అధికారికంగా గంటల తరబడి కోత విధిస్తున్నారు. మొత్తంగా ఎప్పుడు విద్యుత్ సరఫరా ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులు, చిన్నారులు ఇళ్లలో ఉండలేక.. బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో కొమరాడ, పాలకొండ, పార్వతీపురం మండలాల్లో అనధికార విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయి. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస తదితర మండలాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఇటీవల గాలివాన బీభత్సానికి పాలకొండ మండలంలో అనేక గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. దీనిపై ట్రాన్స్‌కో డీఈఈ గోపాలరావును వివరణ కోరగా.. ‘జిల్లాలో ఎటువంటి విద్యుత్ కోతలు లేవు. సాంకేతిక సమస్యల కారణంగా అప్పుడప్పుడూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. అటువంటి సమయాల్లో యుద్ధ ప్రాతిపదికన సమస్యను పరిష్కరించి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తున్నాం. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం.’ అని తెలిపారు.