Share News

freehold for lands రెండేళ్ల నిరీక్షణకు తెర

ABN , Publish Date - Sep 16 , 2026 | 11:21 PM

freehold for lands ఫ్రీ హోల్డ్‌ భూముల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ర్టేషన్లకు అనుమతిచ్చింది. దీంతో దాదాపు రెండేళ్ల నిరీక్షణకు తెరపడింది. బుధవారం నుంచి ఫ్రీహోల్డ్‌లో ఉన్న భూములను రిజిస్ర్టేషన్‌ చేసుకునే వెసులుబాటు లభించింది. వైసీపీ అడ్డగోలు జీవోతో అప్పట్లో భూములు అడ్డదారిలో చేతులు మారడం.. పేదల భూములను మోతుబరులు కారుచౌకగా కొట్టేయడం తదితర పరిణామాలతో కూటమి ప్రభుత్వం 25 నెలలుగా ఫ్రీ హోల్డ్‌ భూముల్లో రిజిస్ర్టేషన్‌ నిలిపివేసింది. తాజా నిర్ణయంతో నిజమైన హక్కుదారులకు ఊరట లభించింది.

freehold for lands రెండేళ్ల నిరీక్షణకు తెర

రెండేళ్ల నిరీక్షణకు తెర

ఫ్రీహోల్డ్‌ భూములపై నిషేధం ఎత్తివేత

25 నెలలుగా విక్రయాలు నిలిపివేసిన ప్రభుత్వం

వైసీపీ అడ్డగోలు జీవోతో చేతులు మారిన భూములు

పేదల భూములను కారుచౌకగా కొట్టేసిన వైనం

ఇబ్బందులు పడిన నిజమైన హక్కుదారులు

వారి విజ్ఞప్తితో ప్రభుత్వం సానుకూల నిర్ణయం

ఫ్రీ హోల్డ్‌ భూముల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ర్టేషన్లకు అనుమతిచ్చింది. దీంతో దాదాపు రెండేళ్ల నిరీక్షణకు తెరపడింది. బుధవారం నుంచి ఫ్రీహోల్డ్‌లో ఉన్న భూములను రిజిస్ర్టేషన్‌ చేసుకునే వెసులుబాటు లభించింది. వైసీపీ అడ్డగోలు జీవోతో అప్పట్లో భూములు అడ్డదారిలో చేతులు మారడం.. పేదల భూములను మోతుబరులు కారుచౌకగా కొట్టేయడం తదితర పరిణామాలతో కూటమి ప్రభుత్వం 25 నెలలుగా ఫ్రీ హోల్డ్‌ భూముల్లో రిజిస్ర్టేషన్‌ నిలిపివేసింది. తాజా నిర్ణయంతో నిజమైన హక్కుదారులకు ఊరట లభించింది.

విజయనగరం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి):

డీపట్టా భూములు పొంది 20 ఏళ్ల గడువు దాటితే వాటిని అమ్ముకోవచ్చని వైసీపీ హయాంలో జీవో ఇచ్చారు. దీంతో వెనువెంటనే కోట్లాది రూపాయల విలువ చేసే భూములు రాష్ట్రంతో పాటు జిల్లాలోనూ చేతులు మారిపోయాయి. జిల్లాలో 179.41 ఎకరాలను రిజిస్ర్టేషన్లు పూర్తిచేసుకొని కారుచౌకగా అప్పట్లో వైసీపీ నేతలు చేజెక్కించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల ఎకరాలు ఇలానే చేతులు మారినట్టు ఆరోపణలు వచ్చాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వివాదాస్పద జీవోను సమీక్షించింది. 20 సంవత్సరాలు పూర్తికానివి సైతం ఫ్రీహోల్డ్‌లో చూపి భారీగా అవకతవకలు జరిపినట్టు.. పోరంబోకు భూములను కూడా వాటిలో చూపి విక్రయించినట్టు గుర్తించారు. వ్యూహాత్మకంగా నాడు జీవో ఇచ్చారని నిర్ధారణకు వచ్చి ఆయా భూముల విక్రయాలపై నిషేధం విధించారు. విచారణకు కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటుచేశారు. అయితే రెండేళ్లుగా వీటిపై నిషేధం కొనసాగుతుండగా నిజమైన హక్కుదారులు తమ భూములను విక్రయించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వానికి ఎన్నో విన్నపాలు ఇచ్చారు. వారి విజ్ఞప్తి మేరకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అప్పట్లో ఎన్నో అక్రమాలు..

వైసీపీ హయాంలో ఫ్రీ హోల్డ్‌ భూముల విషయంలో జీవో ఇచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా 13.59 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్‌ చేశారు. అందులో 5.74 లక్షల ఎకరాలను అక్రమంగా, చట్ట వ్యతిరేకంగా నిషేధిత జాబితా నుంచి బయటకు తీశారు. వాటిలో 55 వేల ఎకరాలపై రిజిస్ర్టేషన్లు జరగ్గా సగానికిపైగా భూముల విషయంలో అక్రమాలు జరిగినట్టు అధికారులు తేల్చారు. దీంతో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఫ్రీహోల్డ్‌ భూములపై విచారించి రిజిస్ర్టేషన్లను నిలిపివేసింది. క్రయ విక్రయాలను నిషేధించింది. అయితే ఎన్నోసార్లు విచారణ గడువు పరిమితిని ప్రభుత్వం పెంచుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఫ్రీహోల్డ్‌కు విముక్తి కల్పిస్తూ జీవో జారీ చేసింది.

జిల్లాలో జరిగింది ఇదీ..

జిల్లాలో ఫ్రీహోల్డ్‌ చట్టం ద్వారా వైసీపీ హయాంలో 7,490.62 ఎకరాలకు రైతులు యాజమాన్య హక్కులు పొందారు. అయితే ఫ్రీహోల్డ్‌ జరిగిన వెంటనే 179.41 ఎకరాలకు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో రిజిస్ర్టేషన్లు చేశారు. జిల్లాలో అత్యధికంగా వేపాడ మండలంలో 100.55 ఎకరాలకు సంబంధించి రిజిస్ర్టేషన్లు జరిగాయి. రామభద్రపురంలో 33.88 ఎకరాలు, భోగాపురంలో 19.6 ఎకరాలు, విజయనగరంలో 11.56 ఎకరాలు, గజపతినగరంలో 6.11 ఎకరాలు, డెంకాడలో 5.1 ఎకరాలు, గంట్యాడలో 1.25 ఎకరాలు, మెరకముడిదాంలో ఎకరం, దత్తిరాజేరులో 30 సెంట్లకు సంబంధించి భూముల రిజిస్ర్టేషన్లు జరిగినట్టు గుర్తించారు. ఈ భూముల విషయంలో చక్రం తిప్పిన అప్పటి జేసీ కిశోర్‌కుమార్‌, ఆర్డీవో భవానీశంకర్‌పై కూటమి సర్కారు చర్యలకు ఉపక్రమించింది. మరోవైపు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పది మంది తహసీల్దార్లకు నోటీసులు ఇచ్చింది. అయితే అధికారులు కేవలం పాత్రధారులు మాత్రమే. సూత్రధారులంతా అప్పటి వైసీపీ నేతలే. అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని భూదందాకు తెరలేపారన్న విమర్శలున్నాయి. ఒక్క అసైన్డ్‌ భూములే కాదు.. మాజీ సైనికుల పేరిట బినామీలను ఏర్పాటుచేసుకొని ప్రభుత్వ భూమిని కొల్లగొట్టారన్న ఆరోపణలు కూడా వచ్చాయి.

నిజమైన హక్కుదారులకు ఇబ్బందులు

వైసీపీ నేతల నిర్వాకంతో ఫ్రీహోల్డ్‌లో ఉన్న భూముల హక్కుదారులు ఇబ్బందులు పడ్డారు. ఇంటి అవసరాల కోసం, కుటుంబ సభ్యుల అవసరాల కోసం భూములను విక్రయించేందుకు అవకాశం లేకపోయింది. కాగా ఫ్రీహోల్డ్‌ భూముల విషయంలో సాంకేతిక సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ కీలక ఆదేశాలు ఇచ్చింది. వెబ్‌ల్యాండ్‌లో అసైన్డ్‌ భూమిగా ఉండి అందులో రైతుల పేర్లు లేకుంటే తన పేరు నమోదుచేయాలని గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. రైతు ఇచ్చిన సమాచారాన్ని రెవెన్యూశాఖ పరిశీలించి అన్నీ సరిపోతే మాత్రం రైతు పేరును తహసీల్దార్లు నమోదుచేస్తారు. 20 ఏళ్ల కాల పరిమితి దాటితేనే రిజిస్ర్టేషన్లకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అసైన్డ్‌ భూముల చట్టాన్ని ఉల్లంఘించి ఫ్రీహోల్డ్‌ అయిన భూములపై నిషేధం యథావిధిగా కొనసాగుతుంది.

ఉత్తర్వులు వచ్చాయి

ఫ్రీహోల్డ్‌ భూములకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఫ్రీహోల్డ్‌ రిజిస్ర్టేషన్లు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు వచ్చాయి. వాటికి అనుగుణంగా మాత్రమే రిజిస్ర్టేషన్లు చేసుకునే వెసులబాటు వచ్చింది. రెవెన్యూపరమైన సమస్యలకు సైతం ప్రభుత్వం అవకాశం కల్పించింది.

- సనపల సుధాసాఽగర్‌, జిల్లా రెవెన్యూ అధికారి, విజయనగరం

పారదర్శకంగా రిజిస్ర్టేషన్లు

ఫ్రీహోల్డ్‌ భూముల రిజిస్ర్టేషన్లు పారదర్శకంగా జరుపుతాం. పత్రాలన్నీ సవ్యంగా ఉంటేనే రిజిస్ర్టేషన్లు చేస్తాం. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సబ్‌ రిజిస్ర్టార్లకు ఆదేశాలిచ్చాం.

- మోహనరావు, జిల్లా రిజిస్ర్టార్‌, విజయనగరం

ఆనందదాయకం

ప్రభుత్వం ఫ్రీహోల్డ్‌ భూములకు విముక్తి కలిగించడం ఆనందదాయకం. 70సెంట్ల భూమి 22ఎలోకి వెళ్లిపోవడంతో ఇన్నాళ్లు ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ఇన్నాళ్లు ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా గుర్తించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మా భూములకు విముక్తి కలిగింది.

- బెల్లాన రామునాయుడు, శ్రీరంగరాజపురం, గజపతినగరం

----

మంచి నిర్ణయం

రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీహోల్డ్‌ జాబితాలనుంచి ఆయా భూములను తొలగిస్తూ మంచి నిర్ణయం తీసుకుంది. నాకున్న ఐదు ఎకరాల భూమి ఫ్రీజ్‌లో ఉండిపోయింది. ఇప్పుడు ఫ్రీహోల్డ్‌ చేయడంతో ఆనందంగా ఉంది. ఇకపై జిరాయితీ భూమిగా పరిగణించి క్రయ విక్రయాలకు అనుకూలంగా మారింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.

బొబ్బిలి అప్పారావు, రైతు, కళ్లేపల్లి గ్రామం, ఎల్‌.కోట మండలం

-------------------

Updated Date - Sep 16 , 2026 | 11:21 PM