ప్రమాదాల్లో గాయపడిన వారికి ఉచిత వైద్యం
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:39 AM
రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు ఉచిత తక్షణ వైద్య సాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం-రాహత్ పథకాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి తెలిపారు.
కలెక్టర్ రామసుందర్‌రెడ్డి
విజయనగరం కలెక్టరేట్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు ఉచిత తక్షణ వైద్య సాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం-రాహత్ పథకాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు ద్వారా దీన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం- రాహత్ పథకం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాద బాధితులకు మొదటి గంటలో (గోల్డెన్ అవర్) రూ.1.5 లక్షల వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు జిల్లాలోని 23 ప్రభుత్వాసుపత్రులను ఎంపిక చేశామని తెలిపారు. ఈ పఽథకం అమలు కోసం ట్రస్టు కార్యాలయంలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాధితులు ఆసుపత్రుల్లో చేరినప్పుడు తక్షణ సాయం కింద 7 రోజుల పాటు లేదా రూ 1.5 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా ఆసుపత్రులు అందిస్తాయని తెలిపారు. ఈ సమావేశంలో జేసీ సేతు మాధవన్, డీఆర్‌వో సత్తిబాబు పాల్గొన్నారు.
ప్రణాళికలు పంపించండి..
జిల్లాలో జలధార-జలహారతిలో భాగంగా ప్రతి గ్రామంలో చెరువుల వారీగా ప్రణాళికను రూపొందించి వెంటనే పంపించాలని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నగర ప్రాంతాల్లో ఉన్న చెరువులకు మున్సిపల్ కమిషనర్, దేవస్థానానికి చెందిన పుష్కరిణి చెరువులకు దేవస్థానం అధికారులు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అవసరమైన పనులకు మాత్రమే ప్రతిపాదనలు పెట్టాలని స్పష్టం చేశారు. బుధవారం మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ రమణ, జడ్పీ సీఈఓ సత్యనారాయణ, డ్వామా పీడీ శారదాదేవి, ఎంపీడీఓలు, ఇరిగేషన్ పీడీవోలు పాల్గొన్నారు.
పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్, జేసీ తదితరులు