Share News

Free Electricity వినాయక మండపాలకు ఉచిత విద్యుత్‌

ABN , Publish Date - Sep 09 , 2026 | 11:47 PM

Free Electricity for Vinayaka Mandapams వినాయక చవితి సందర్భంగా ఉత్సవ కమిటీలకు కూటమి ప్రభుత్వం తీపికబురు అందించింది. వారిపై బిల్లుల భారం పడకుండా గతేడాదిలానే ఈసారి కూడా గణేష్‌ మండలపాలకు ఉచిత విద్యుత్‌ అందించనున్నట్లు ప్రకటించింది. దీనిపై బుధవారం మంత్రి నారా లోకేశ్‌ కీలక ప్రకటన చేశారు.దీంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Free Electricity  వినాయక మండపాలకు ఉచిత విద్యుత్‌
వినాయక మండపం

  • ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

పాలకొండ, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): వినాయక చవితి సందర్భంగా ఉత్సవ కమిటీలకు కూటమి ప్రభుత్వం తీపికబురు అందించింది. వారిపై బిల్లుల భారం పడకుండా గతేడాదిలానే ఈసారి కూడా గణేష్‌ మండలపాలకు ఉచిత విద్యుత్‌ అందించనున్నట్లు ప్రకటించింది. దీనిపై బుధవారం మంత్రి నారా లోకేశ్‌ కీలక ప్రకటన చేశారు.దీంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వినాయకచవితి నేపథ్యంలో ఏటా పల్లె, పట్టణం తేడా లేకుండా అన్ని చోట్ల ఆయా ఉత్సవ కమిటీలు బడ్జెట్‌ ఆధారంగా మండపాలను తీర్చిదిద్దుతారు. నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంటారు. మండపాల వద్ద లైట్లు, ప్రత్యేక అలంకరణలు తదితర వాటికి విద్యుత్‌ అధికంగానే వినియోగించాల్సి వస్తుంది. అయితే గతంలో వైసీపీ హయాంలో ఆంక్షలు, నిబంధనలతో ఉత్సవ కమిటీలు తీవ్ర ఇబ్బందులు పడేవి. వినాయక మండపాలు ఏర్పాటు చేసేందుకు ఆలోచించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మండపాల ఏర్పాటుకు అనుమతులను సులభతరం చేయడంతో పాటు ఉచిత విద్యుత్‌ను అందిస్తామని ప్రకటించడంతో ఉత్సవ కమిటీలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. మరింత ఉత్సాహంతో వినాయక ఉత్సవాలు జరుపుకునేందుకు సన్నద్ధమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వందలాదిగా వినాయక మండపాలను ఏర్పాటు చేయనున్నారు. 9 నుంచి 21 రోజుల వరకు ఉత్సవాలను నిర్వహిస్తారు. కొన్నిచోట్ల వివిధ రకాల సాంస్కృతిక కార్య క్రమాలు నిర్వహించనున్నారు. రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో పందిళ్లు, ప్రత్యేక సెట్లను ఏర్పాటు చేయనున్నారు. అయితే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ట్రాన్స్‌కో అధికారులు మండపాలకు ఉచితంగా విద్యుత్‌ అందించనున్నారు. దీనిపై పాలకొండ ట్రాన్స్‌కో ఏఈ నిమ్మల యోగిని వివరణ కోరగా.. వినాయక మండపాలు ఏర్పాటు చేసే ఉత్సవ కమిటీలు ముందస్తుగా విద్యుత్‌ శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. అన్ని పరిశీలించిన తర్వాత నవరాత్రుల పాటు ఉచితంగా విద్యుత్‌ అందిస్తామని వెల్లడించారు.

జాగ్ర త్తలు పాటించాలి

బెలగాం: గణేష్‌ మండపాల వద్ద విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని, ఉత్సవ కమిటీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ పృథ్వీరాజ్‌ బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. మండపాలకు అధికారిక తాత్కాలిక విద్యుత్‌ కనెక్షన్లు మాత్రమే తీసుకోవాలని పేర్కొన్నారు. నాణ్యమైన వైరింగ్‌ను వినియోగించాలని తెలిపారు. వర్షంలో విద్యుత్‌ పరికరాలు తడకుండా చూడాలని, తడి చేతులతో స్విచ్‌లను తాకరాదని సూచించారు. పిల్లలను వైర్లు, విద్యుత్‌ మీటర్లకు దూరంగా ఉంచాలన్నారు. నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను సురక్షితంగా నిర్వహించాలని కోరారు.

Updated Date - Sep 09 , 2026 | 11:47 PM