ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో మోసం
ABN , Publish Date - Mar 21 , 2026 | 11:31 PM
ఓ న్యాయవాది ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో మోసానికి గురయ్యారు. నకిలీ కంపెనీ అని తెలియక విడతలవారీగా అందులో రూ.74.43లక్షల పెట్టుబడి పెట్టారు.
- నకిలీ కంపెనీలో పెట్టుబడిపెట్టిన న్యాయవాది
- రూ.74.43లక్షలు పోగొట్టుక్ను వైనం
- ఇద్దరు నిందితుల అరెస్టు
కొత్తవలస, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ఓ న్యాయవాది ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో మోసానికి గురయ్యారు. నకిలీ కంపెనీ అని తెలియక విడతలవారీగా అందులో రూ.74.43లక్షల పెట్టుబడి పెట్టారు. చివరకు అసలు విషయం తెలిసింది. దీంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ వివరాలను సీఐ షణ్ముఖరావు శనివారం విలేకరులకు వెల్లడించారు. కొత్తవలస పీఎంఎల్ కాంప్లెన్స్ వెనుక హేమంతరావు అనే న్యాయవాది నివాసం ఉంటున్నారు. ఈయన గతేడాది ఆగస్టు 13నుంచి 15 వరకు ఐసీఐసీఐ సెక్యూరిటీ పేరుతో నిర్వహిస్తున్న నకిలీ ట్రేడింగ్ కంపెనీలో రూ.74.43లక్షల పెట్టుబడిపెట్టారు. భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్న తరువాత తాను ట్రేడింగ్ చేసిన కంపెనీ నకిలీదని, పూర్తిగా మోసపోయానని తెలుసుకున్నారు. వెంటనే కొత్తవలస పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సైబర్ క్రైం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హేమంతరావు చెల్లించిన రూ.74.43లక్షల్లో.. రూ.12.58లక్షలు విజయవాడ కేంద్రంగా నిర్వహిస్తున్న ఒక కంపెనీ బ్యాంకు ఖాతాలో జమ అయినట్టు గుర్తించారు. ఆ కంపెనీని నిర్వహిస్తున్న విజయవాడకు చెందిన అనుమోలు సునీల్ చౌదరి, అనుమోలు నందినిని అరెస్టు చేశారు. ఈ నగదు జమ చేసినందుకు గాను సైబర్ నేరగాళ్లు ఆ కంపెనీ యజమానులకు 15 శాతం కమీషన్ ముట్ట చెబుతామని చెప్పారు. ఆ కమీషన్‌కు ఆశపడి వారు తమ కంపెనీ అకౌంట్‌లో నగదును జమ చేయించుకుని దొరికిపోయారని సీఐ తెలిపారు. మిగిలిన సొమ్ము వేర్వేరు కంపెనీల్లో జమ అయిందని, అవన్నీ డొల్ల కంపెనీలేనని చెప్పారు. ఏఐ వచ్చిన తరువాత ఒరిజన్ కంపెనీలను పోలిన నకిలీ కంపెనీలు వస్తున్నాయని, వాటిని గుర్తించపోతే మోసపోయే అవకాశం ఉందన్నారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్లు పంపే లింక్‌లను ఓపెన్ చేయవద్దని అన్నారు.