Four Years Meeting పాలకవర్గ సమావేశం లేక నాలుగేళ్లు
ABN , Publish Date - Feb 25 , 2026 | 11:41 PM
Four Years Without a Ruling Party Meeting సీతంపేట ఐటీడీఏ వేదికగా పాలకవర్గ సమావేశాలు ఎప్పుడు నిర్వహిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. నాలుగేళ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు దానిపై చర్చించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇన్‌చార్జిల పాలనతో ఇబ్బందులు
గాడి తప్పుతున్న పాలన
సీతంపేట రూరల్, ఫిబ్రవరి25(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ వేదికగా పాలకవర్గ సమావేశాలు ఎప్పుడు నిర్వహిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. నాలుగేళ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు దానిపై చర్చించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవంగా గిరిజన ప్రాంతాల అభివృద్థి కోసం ప్రతి మూడు నెలలకోసారి ఐటీడీఏ వేదికగా పాలకవర్గ సమా వేశాలు నిర్వహించాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో జిల్లాల విభజనకి ముందు 2022, జనవరి 29న 77వ పాలకవర్గ సమావేశాన్ని మొక్కుబడిగా నిర్వహించారు. నాటి నుంచి నేటి వరకు సీతంపేట ఐటీడీఏలో పాలకవర్గ సమావేశాలు ఊసే లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు చేపట్టకపో వడంపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి.
గత వైసీపీ సర్కారు తప్పిదాలు
- గత వైసీపీ ప్రభుత్వ హయంలో ఐటీడీఏలన్నీ నిర్వీర్యమయ్యాయి. గిరిజనాభివృద్థికి సరిపడా నిధులు ఐటీడీఏలకు కేటాయించకపోగా.. గిరిజనుల కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులన్నీ దారి మళ్లించింది.
- వాస్తవంగా 2022లో వైసీపీ ప్రభుత్వం పాలన సౌలభ్యం పేరుతో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా అశాస్ర్తీయంగా జిల్లాల విభజన చేసింది. ఆ తరువాత గిరిజన ప్రాంతాల్లో కొత్త సమస్యలు తలెత్తాయి. మన్యం జిల్లా పరిధిలోకి పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏలు చేరాయి. అయితే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 16మండలాల గిరిపుత్రులు సీతంపేట ఐటీడీఏకు దూరమ య్యారు. పాలనపరంగా ఆప్రాంతంలో ఉన్న గిరిజనులకు ఐటీడీఏ సేవలందింస్తోంది. అయితే భౌగోళికంగా సీతంపేట ఐటీడీఏ శ్రీకాకుళం జిల్లా పరిధిలో లేదు. దీంతో ఆప్రాంత గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీతంపేట ఐటీడీఏను శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మెళియాపుట్టి మండలానికి తరలించాలని ఈనెల 26న గిరిజనసంఘాలు ధర్నాకుపిలుపునిచ్చాయి.
ఐటీడీఏలపై దృష్టి సారించిన ‘కూటమి’
- కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత రాష్ట్రంలో అన్ని ఐటీడీఏలపై దృష్టి సారించింది. వాటికి నిధులు కేటాయిస్తు గిరిజన సంక్షేమానికి బాటలు వేస్తోంది. పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏలకు కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే పాలకవర్గ సమావేశాలు ఎప్పుడు నిర్వహిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
- జిల్లాలో ఉన్న రెండు ఐటీడీఏలకు రెగ్యులర్ పీవోలు లేకపోవడం, ఇన్‌చార్జిలతో కాలం నెట్టుకొస్తుండడంతో పాలనపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సీతంపేట ఐటీడీఏలో ఇన్‌చార్జి పీవో ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో పాలన గాడి తప్పుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారంలో రెండు రోజుల పాటు సీతంపేట ఐటీడీఏలో నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు ఇన్‌చార్జి పీవో అందుబాటులో ఉండడం లేదు. ఇక దీని పరిధిలో ఉన్న శ్రీకాకుళం జిల్లాలోని 16 గిరిజన సబ్‌ప్లాన్ మండలాల వైపు ఇన్‌చార్జి పీవో, ఇతర అధికారులెవరూ కన్నెత్తి చూడడం లేదు. దీంతో ఆప్రాంత గిరిజనులు ఐటీడీఏ అధికారుల తీరుపై అసహనం వ్యక్తంచేస్తున్నారు.
- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీడీఏ ద్వారా రాయితీ పథకాలు, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు, రుణాలు వంటివి పంపిణీ చేస్తున్నప్పటికీ గిరిజనుల్లో కొంత మేర అసంతృప్తి నెలకొంది. సమస్యలు విన్నవించుకునేందుకు ఐటీడీఏను ఆశ్రయిస్తే ఉన్నతాఽ దికారులెవరూ అందుబాటులో లేకపోవడంతో వారు నిరాశతో ఈసురోమంటూ ఇళ్లకు వెనదిరగాల్సి వస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సీతంపేట ఐటీడీఏ వేదికగా పాలకవర్గ సమావేశం నిర్వహించి గిరిజనాభివృద్థికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని గిరిపుత్రులు కోరుతున్నారు.
ఇన్‌చార్జి పీవో ఏమన్నారంటే ...
సీతంపేట ఐటీడీఏలో పాలకవర్గ సమావేశం నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు.