Share News

Nothing Has Changed! నాలుగేళ్లవుతున్నా.. ఏం మారలే!

ABN , Publish Date - Feb 25 , 2026 | 11:38 PM

Four Years On… Nothing Has Changed! పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడి సుమారు నాలుగేళ్లు పూర్తవుతున్నా.. ఇంకా కీలక ప్రభుత్వ శాఖలకు పూర్తిస్థాయి అధికారులు లేరు. నేటికీ ఇన్‌చార్జిలతోనే నెట్టుకురావల్సి వస్తోంది. దీంతో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు.

 Nothing Has Changed!  నాలుగేళ్లవుతున్నా.. ఏం మారలే!
కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న గృహ నిర్మాణశాఖ జిల్లా అధికారి కుర్చీ

  • ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్న వైనం

పార్వతీపురం, ఫిబ్రవరి25(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడి సుమారు నాలుగేళ్లు పూర్తవుతున్నా.. ఇంకా కీలక ప్రభుత్వ శాఖలకు పూర్తిస్థాయి అధికారులు లేరు. నేటికీ ఇన్‌చార్జిలతోనే నెట్టుకురావల్సి వస్తోంది. దీంతో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వం ఎంతో హడావుడిగా జిల్లాలను ఏర్పాటు చేసింది. అయితే మౌలిక వసతులు, భవనాలు, పోస్టుల భర్తీ తదితర అంశాలపై దృష్టి సారించలేదు. దీంతో పాలనా పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 20 నెలలు అవుతున్నా.. ఇంకా పరిస్థితి మారలేదు. పూర్తిస్థాయిలో ఖాళీలు భర్తీ చేయకపోవడంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారు పని ఒత్తిడితో ఏ శాఖకు న్యాయం చేయలేని పరిస్థితి ఏర్పడింది. సమావేశాలు, వీడియో, టెలీ కాన్ఫరెన్స్‌లతో వారు బిజీగా ఉండడంతో అభివృద్ధి పనులపై పర్యవేక్షణ కొరవడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు దృష్టి సారించాలని జిల్లావాసులు కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి..

- జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నా.. జిల్లా వ్యవసాయశాఖకు పూర్తిస్థాయి అధికారి లేరు. డీఏవోగా పనిచేసిన రాబర్ట్‌పాల్‌ పదోన్నతిపై వెళ్లిపోయన తర్వాత ఇన్‌చార్జి అధికారి అన్నపూర్ణ ఆ స్థానంలో కొనసాగుతున్నారు.

- జిల్లా ఆడిట్‌ విభాగానికి సంబంధించి విజయనగరం జిల్లా అధికారి ఇన్‌చార్జి వ్యవహరిస్తున్నారు.

- గృహ నిర్మాణశాఖకు సంబంధించి సుమారు మూడేళ్లుగా పూర్తిస్థాయి జిల్లా అధికారి లేరు. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ధర్మ చంద్రారెడ్డి ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు.

- జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డీడీగా పనిచేసిన గజాద్దీన్‌ బదిలీపై వెళ్లిపోయి సుమారు ఏడాది అవుతుంది. అయితే నేటికీ ఆ పోస్టు ఖాళీగానే ఉంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఏఎస్‌డబ్ల్యూగా పనిచేస్తున్న ఎం.శ్యామల ఎఫ్‌ఏసీ హోదాలో జిల్లా డీడీగా వ్యవహరిస్తున్నారు.

- సర్వశిక్షా అభియాన్‌కు సంబంధించి జిల్లా అధికారిగా ప్రస్తుతం డీఈవో బ్రహ్మాజీరావు వ్యవహరిస్తున్నారు.

- తాజాగా పాలకొండ పంచాయతీరాజ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పోస్టు కూడా ఖాళీ అయింది. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ రాధారాణికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.

Updated Date - Feb 25 , 2026 | 11:38 PM