Share News

MSME Parks ఎంఎస్‌ఎంఈ పార్కులకు శ్రీకారం

ABN , Publish Date - May 25 , 2026 | 11:58 PM

Foundation Laid for MSME Parks నియోజకవర్గానికొక ఎంఎస్‌ఎంఈ (సూక్ష, చిన్న మధ్య తరహా పరిశ్రమలు) పార్కు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకుంది. రాష్ట్రంలోని పలుచోట్ల ఎంఎస్‌ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు.

  MSME Parks ఎంఎస్‌ఎంఈ పార్కులకు శ్రీకారం
చిలకాంలో ఎంఎస్‌ఎంఈ యూనిట్‌ శిలాఫలకం ఆవిష్కరణలో ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి తదితరులు

  • జిల్లాలో మూడు చోట్ల భూమిపూజ

  • భాగస్వాములైన అధికారులు, ప్రజాప్రతినిధులు

  • ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నట్లు నేతల వెల్లడి

పార్వతీపురం రూరల్‌/ గరుగుబిల్లి/ సాలూరు, మే25(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గానికొక ఎంఎస్‌ఎంఈ (సూక్ష, చిన్న మధ్య తరహా పరిశ్రమలు) పార్కు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకుంది. రాష్ట్రంలోని పలుచోట్ల ఎంఎస్‌ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. దీనిలో భాగంగా జిల్లాలో మూడుచోట్ల భూమి పూజ చేశారు. సందడిగా సాగిన ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు భాగస్వాములయ్యారు. పార్కులు అందుబాటులోకి వస్తే.. మన్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వారు వెల్లడించారు.

కూటమి చొరవతో వలసల నివారణ

గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి అన్నారు. సోమవారం గరుగుబిల్లి మండలం చిలకాంలో ఎంఎస్‌ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేశారు. 19.26 ఎకరాల విస్తీర్ణంలో రూ. 13.94 కోట్లతో పలు యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. నియోజకవర్గంలో రూ. 65 కోట్లు పెట్టుబడితో 100 ఎంఎస్‌ఎంఈ యూనిట్ల లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. యూనిట్లు స్థాపనతో ప్రత్యక్షంగా సుమారు 350 మందికి , పరోక్షంగా మరో 100 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ఎంఎస్‌ఎంఈ పార్కులో తయారీ రంగం, ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌, గ్రాన్యుల్స్‌ ఇంజనీరింగ్‌ యూనిట్లు, పేపర్‌ ఉత్పత్తులతో పాటు ప్యాకింగ్‌ వంటి పలు పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. భూములు ఇచ్చిన రైతులకు మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు.

పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం

పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. నర్సిపురం గ్రామ సమీపంలో ఎంఎస్‌ఎంఈ పార్క్‌కు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో పార్క్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వారు వెల్లడించారు. యువత ఉద్యోగాలకే పరిమితం కాకుండా పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఈ పార్క్‌లో అధిక సంఖ్యలో చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని, మూడు వేలకు పైగా యువతకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు.

రూ.11.61 కోట్లతో.. 1500 ఎకరాల్లో ..

సాలూరు మండలం దుగ్ధసాగరం సమీపంలో సోమవారం టీడీపీ నాయకులు , అధికారులు ఎంఎస్‌ఎంఈ పార్కుకు భూమి పూజ చేసి.. శిలాఫలకం ఆవిష్కరించారు. సుమారు 1500 ఎకరాల్లో రూ.11.61 కోట్లతో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇది పూర్తయితే ఎంతోమంది నిరుద్యోగులకు లబ్ధి చేకూరుతుం దన్నారు. త్వరలోనే పార్కు నిర్మాణం పూర్తికానుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తిరుపతిరావు, పరమేష్‌, ఏఎంసీ చైర్మన్‌ సూర్యనారాయణ, తహసీల్దార్‌ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2026 | 11:58 PM