మాజీ క్యాషియర్‌కు జైలుశిక్ష
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:36 AM
చీపురుపల్లి ఆర్‌ఈసీఎస్ నగదు గల్లంతు వ్యవహారంలో విశాఖపట్నం సీఐడీ న్యాయస్థానం తుది తీర్పు వెల్లడిం చింది.
చీపురుపల్లి, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): చీపురుపల్లి ఆర్‌ఈసీఎస్ నగదు గల్లంతు వ్యవహారంలో విశాఖపట్నం సీఐడీ న్యాయస్థానం తుది తీర్పు వెల్లడిం చింది. అక్రమాలకు పాల్పడిన అప్పటి ఆంధ్రబ్యాంకు మాజీ క్యాషియర్ వెంపడా పు సంతోషి రాము(ఏ1)కు ఐదు సంవత్సరాల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.1కోటి 37లక్షల 91వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. అతడికి సహకరించిన మహంతి రమణ (ఏ2) అనే వ్యక్తికి ఐదు సంవత్సరాల సాధారణ జైలు శిక్షతో బాటు రూ.33లక్షల 51వేలు జరిమానా విధించింది. ఈ మేరకు విశాఖపట్నం సీఐడీ విభాగం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 2018లో అప్పటి ఆంధ్రబ్యాంకులో పని చేసిన వెంపడాపు సంతోషి రాము ఆర్‌ఈసీఎస్‌కు డిపాజిట్ చేసిన రూ.1,71,41,162 నగదు గల్లంతు కావడంలో ప్రధాన నిందితునిగా ఉన్నాడు. అప్పట్లో ఈ వ్యవహారం స్థానికంగా దుమారం లేపింది. దీనిపై సీఐడీ పోలీసులు 2018లో కేసు నమోదు చేసి, దర్యాప్తు నిర్వహించారు. తమ బ్యాంకు నిధులు గల్లంతు కావడంతో, బ్యాంకు యాజమాన్యం అప్పట్లోనే సంతోషి రామును ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ క్రమంలో సమగ్రంగా దర్యాప్తు నిర్వహించిన సీఐడీ పోలీసులు విశాఖపట్నంలో చార్జిషీటు దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో, సీఐడీ న్యాయస్థానం తుది తీర్పు వెలువరించినట్టు సీఐడీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.