For you... with eyes all over... మీకోసం.. నిలువెల్లా కనులై..
ABN , Publish Date - Jul 06 , 2026 | 12:31 AM
For you... with eyes all over...వారంతా బతుకుతెరువు కోసం జిల్లా నుంచి వలసవెళ్లిన మత్స్యకారులు. విశాఖలో ఉంటూ సంద్రంలో చేపల వేటకు వెళ్తుంటారు. ఎప్పటిలాగే మూడు రోజుల కిందట వేటకెళ్లారు. వెళ్లిన పని ముగించుకుని నాలుగో రోజు తిరిగి వద్దామనుకున్నారు. అంతలోనే అల్పపీడన ప్రభావంతో అలలు ఉధృతంగా రావడం.. బోటులోకి అధికంగా నీరు చేరడం.. ఆపై బోటు మునిగిపోవడం.. వారంతా గల్లంతుకావడం జరిగిపోయింది. నడిసంద్రంలో అపాయంలో ఇరుక్కున్న వారి ఆచూకీ కోసం వారి కుటుంబీకులు, ముక్కాంలో ఉంటున్న బంధువులు కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.
మీకోసం.. నిలువెల్లా కనులై..
సముద్రంలో ఆరుగురు జిల్లా మత్స్యకారుల గల్లంతు
కోస్టుగార్డు సంరక్షణలో ఒకరు
క్షేమంగా చేరుకోవాలని కుటుంబ సభ్యుల ఎదురుచూపు
ముమ్మరంగా గాలింపు చర్యలు
కుటుంబాల సభ్యులను విశాఖ వెళ్లి ఓదార్చిన మంత్రి, ఎమ్మెల్యే, మార్క్‌ఫెడ్ చైర్మన్
వారంతా బతుకుతెరువు కోసం జిల్లా నుంచి వలసవెళ్లిన మత్స్యకారులు. విశాఖలో ఉంటూ సంద్రంలో చేపల వేటకు వెళ్తుంటారు. ఎప్పటిలాగే మూడు రోజుల కిందట వేటకెళ్లారు. వెళ్లిన పని ముగించుకుని నాలుగో రోజు తిరిగి వద్దామనుకున్నారు. అంతలోనే అల్పపీడన ప్రభావంతో అలలు ఉధృతంగా రావడం.. బోటులోకి అధికంగా నీరు చేరడం.. ఆపై బోటు మునిగిపోవడం.. వారంతా గల్లంతుకావడం జరిగిపోయింది. నడిసంద్రంలో అపాయంలో ఇరుక్కున్న వారి ఆచూకీ కోసం వారి కుటుంబీకులు, ముక్కాంలో ఉంటున్న బంధువులు కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. గల్లంతైన మత్స్యకారుల్లో ఒకరు మాత్రం కోస్టుగార్డు సంరక్షణలో ఉన్నారు. విషయం తెలుసుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే నాగమాధవి, మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు విశాఖ వెళ్లి మత్స్యకారుల కుటుంబ సభ్యులను ఓదార్చారు.
భోగాపురం, జూలై5(ఆంధ్రజ్యోతి):
భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన మత్స్యకారులు కారి సీతోడు, కారి గరగయ్య, అమర అప్పలరాజు, మేడ చిన్న అమ్మోరు, కారి చిన్న, కారి చిన్నయ్యలు విశాఖపట్నంలోని జాలారిపేట పరిధి జబ్బర్‌తోటలో నివాసముంటున్నారు. ఎప్పటిలాగే ఈనెల 1న తెల్లవారుజామున సుమారు 3గంటల సమయంలో అక్కడే నివాసముంటున్న విశాఖ జిల్లా భీమిలి మండలం పెదనాగమయ్యపాలెంకు చెందిన బండయ్యతో కలిసి బోటు(ఐఎన్‌డీ ఏపీ-ఎంఎం-వి5-83)లో సముద్రంలోకి వేటకెళ్లారు. శనివారం నాటికి అల్పపీడనం కారణంగా సముద్రంలో ఒక్కసారిగా వాతావరణం ప్రతికూలంగా మారింది. మత్స్యకారులు తిరిగి విశాఖ హార్బర్‌కు వచ్చేయడానికి నిశ్చయించుకొన్నారు. ఈనెల 4వ తేదీన సుమారు మధ్యాహ్నం 2గంటల సమయంలో తమ కుటుంబీకులకు ఫోన్ చేసి తుఫాన్ వచ్చేలా ఉందని వాతావరణం అనుకూలంగా లేదని, తిరిగి వచ్చేస్తున్నామని మరో గంటలో (సుమారు మధ్యాహ్నం 3 గంటల కల్లా)విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు చేరుకొంటామని సమాచారం ఇచ్చారు. దీంతో జాగ్రత్తగా వచ్చేయండి అంటూ కుటుంబీకులు సూచించారు. ఆ తర్వాత వరుసగా వచ్చిన భారీ అలలకు బోటులో నీళ్లు చేరడం ప్రారంభమై కొన్ని గంటల తర్వాత బోటు పూర్తిగా మునిగిపోయింది. మత్స్యకారులంతా చెల్లాచెదురై ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.
- గంటలో విశాఖ హార్బర్‌కు వచ్చేస్తామని చెప్పిన మత్స్యకారులు రాత్రి అయినా తిరిగి రాకపోవడవతో మత్స్యకార కుటుంబీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఫోన్ చేయగా ఎవరి ఫోన్లూ పనిచేయలేదు. దీంతో వారంతా అక్కడి మత్స్యకార నాయకుడు వాసుపల్లి జానకీరామ్‌కు మొరపెట్టుకొన్నారు. ఆయన అందరికీ ధైర్యం చెప్పి విశాఖ జిల్లా కలెక్టర్, కోస్టుగార్డు అధికారులకు, ఆ జిల్లా మత్స్యశాఖ అధికారులకు, మెరీన్ పోలీసులకు సమాచారం అందించి తక్షణమే గాలింపు చర్యలు చేపట్టాలని కోరారు.
- అధికార యంత్రాంగం ఓ వైపు , మత్స్యకారులు మరోవైపు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆదివారం బోటు డ్రైవర్, ఓనర్ అయిన కారి చిన్న వేరే బోటువారికి అపస్మారక స్థితిలో కంట పడ్డాడు. ఆయన ప్రస్తుతం కోస్టు గార్డు సంరక్షణలో ఉన్నాడు.
- గల్లంతైన వారిలో కారి సీతోడు, కారి చిన్నయ్య తండ్రి కొడుకులు కాగా కారి సీతోడు తమ్ముడు కారిచిన్న. అలాగే మేడ చినఅమ్మోరు అల్లుడు రగుతు బండయ్య కూడా గల్లంతయ్యారు. కారి గరగయ్యకు ఇటీవలే వివాహమైంది.
- గల్లంతైన మత్స్యకారుల కుటుంబీకులు విశాఖ మత్స్యశాఖ జేడీ కార్యాలయం ముందు శనివారం కొద్దిసేపు ఆందోళన చేశారు. తమ కుటుంబీకులను ఎలాగైనా రక్షించి క్షేమంగా తీసుకురావాలని కోరారు.
నాయకుల పరామర్శ
మంత్రి కొండపల్లి శ్రీనివాస్, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకంనాగమాఽధవి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, జిల్లా అధికారులు ఆయా కుటుంబీకులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మత్స్యకారుల ఆచూకీ గుర్తించి వారిని క్షేమంగా ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. మత్స్యకారుల కుటుంబీకులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
పడవ మునిగిపోయింది
కారి చిన్న, గల్లంతై బయటపడిన మత్స్యకారుడు
సముద్ర వాతావరణం బాగోక వల లింకులు తీసేసి తిరిగి వెళ్లిపోదామని నిర్ణయించుకొన్నాం. అక్కడికి విశాఖ హార్బర్ మరో 10 మైళ్ల దూరంలో మాత్రమే ఉంది. అంతలో వరుసగా భారీ కెరటాలు వచ్చాయి. నీళ్లు అధికంగా చేరాక బోటు మునిగిపోయింది. ఆరుగురిమి రాత్రి 9గంటల వరకు బోటుపైనే ఉన్నాం. మరో వ్యక్తి కనిపించలేదు. పడవ పూర్తిగా మునిగిపోతుండడంతో పడవలో ఉన్న సేఫ్టీ జాకెట్ ధరించాం. చీకటి పడ్డాక కొంత వరకు ఈదుకొంటూ వచ్చాం. తెల్లవారుజామున నేను ఓ బోటు లంగరు పట్టుకొని ఉండిపోయాను. ఆ తర్వాత ఏమైందో తెలియదు. నన్ను ఓ షిప్ వారు కాపాడారు. అప్పటికే నాకు పెద్దగా స్పృహ లేదు.
గాలిస్తున్నాం
కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ గోపీనాఽథ్ జట్టీ
భోగాపురం, జూలై5(ఆంధ్రజ్యోతి): మత్స్యకారుల కోసం గాలింపు, సహాయక చర్యలు చేపట్టామని కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ గోపీనాథ్ జట్టీ అన్నారు. విశాఖపట్నం ఇండియన్ కోస్టుగార్డు రీజనల్ ఆపరేషన్స్ సెంటర్(ఆర్‌ఓఎస్)ను ఆయన ఆదివారం సందర్శించారు. మత్స్యకారుల ఆచూకీ కనుగొనేందుకు చేపట్టిన గాలింపు, సహాయక చర్యలను పర్యవేక్షించారు. భారత తీర రక్షణదళానికి చెందిన రెండు నౌకలు, రెండు హెలికాప్టర్లతో గాలిస్తున్నట్లు తెలిపారు.
ఉధృతంగా కెరటాలు
భోగాపురం, జూలై5(ఆంధ్రజ్యోతి): ముక్కాం తీరాన్ని కెరటాలు పెద్ద శబ్ధం చేస్తూ తాకుతున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా గతం కన్నా సుమారు రెండు మీటర్ల ఎత్తులో వస్తున్నాయి. సుమారు 30 మీటర్లు ముందుకొచ్చి తీరాన్ని తాకుతున్నాయి. స్థానిక మత్స్యకారులు బోట్లు, వలలను భద్రపర్చుకుంటుండడం కనిపించింది. ఆరుగురు మత్స్యకారుల గల్లంతు విషయం తెలియక ముక్కాం గ్రామంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది.