గిరిజన కళాకారుల కోసమే
ABN , Publish Date - May 21 , 2026 | 10:30 PM
గిరిజన కళాకారుల నైపుణ్యాలను ప్రోత్సహించి వారి సంప్రదాయ కళలకు మార్కెట్ కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న జన జాతీయ గరిమా ఉత్సవ్ 2026ను విజయవంతం చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్.వైశాలి అన్నారు.
జన జాతీయ గరిమా ఉత్సవ్
ఐటీడీఏ పీవో వైశాలి
పార్వతీపురం, మే 21(ఆంధ్రజ్యోతి): గిరిజన కళాకారుల నైపుణ్యాలను ప్రోత్సహించి వారి సంప్రదాయ కళలకు మార్కెట్ కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న జన జాతీయ గరిమా ఉత్సవ్ 2026ను విజయవంతం చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్.వైశాలి అన్నారు. గురువారం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆవరణలోని గిరిమిత్ర సమావేశ మందిరంలో వికసిత భారత్ 12 సంవత్సరాల వేడుకలను ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఆధునిక మార్కెట్ పోటీలో వెనుకబడుతున్న గిరిజన కళాకారులకు ప్రోత్సాహం అందించేందుకు కేంద్రం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. గిరిజన కళాకారుల చేతి పనులకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా కృషి చేయాలన్నారు. గిరిజనుల సాంప్రదాయ ఉత్పత్తులు నాణ్యమైనవని, కానీ మార్కెటింగ్ సదుపాయం లేక గిట్టుబాటు ధర అందడం లేదని అన్నారు. ఈ ఉత్సవాల ద్వారా కళాకారులు నేరుగా వినియోగదారులతో మమేకమై తమ ఉత్పత్తులను విక్రయించే అవకాశం లభిస్తుందన్నారు. యువత గిరిజన కళల పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గత ఏడాది ఢిల్లీలో జరిగిన ఆది మహోత్సవ్ కార్యక్రమంలో జిల్లా నుంచి జీడిపప్పు, పసుపు, చింతపండు తదితర గిరిజనుల ఉత్పత్తులను విక్రయించిన పాచిపెంట మండలం కూనబందవలస శ్రీవెంకటేశ్వర వన్‌ధన్ వికాస కేంద్రం సభ్యులను పీవో అభినందించారు. కార్య క్రమంలో ట్రైఫెడ్ డిప్యూటీ మేనేజర్ శివ బసవన్న, అసిస్టెంట్ మేనేజర్ కె.రాబాబు, జేసీఏ సి.హెచ్.వ వెంకటేశ్వరరావు, వీడీవీకే అసోసియేట్ బి.వెంకటసాయిరామ్, ఐటీడీఏ అదనపు ప్రాజక్టు అధికారి మురళీధర్, జీసీసీ డివిజనల్ మేనేజర్ జె.రామారావు, పార్వతీపురం మేనేజర్ ఎం.సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.