Share News

For the Past Three Days..! మూడు రోజులుగా..!

ABN , Publish Date - May 03 , 2026 | 11:44 PM

For the Past Three Days..! ఈదురుగాలులు జిల్లావాసులపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రధానంగా పాలకొండ మండలంలోని చాలా గ్రామాల్లో ఇంకా విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ జరగలేదు. దీంతో మూడు రోజులుగా ప్రజలు నరకం చూస్తున్నారు.

For the Past Three Days..!  మూడు రోజులుగా..!
పాలకొండలో ఆర్‌వో ప్లాంట్‌ వద్ద తాగునీటి కోసం క్యూలో ఉన్న ప్రజలు

  • తాగునీటికి కటకట..

  • తీవ్ర ప్రభావం చూపిన గాలులు

  • అంధకారంలోనే గ్రామాలు

  • ప్రజలకు తప్పని ఇబ్బందులు

పాలకొండ, మే3(ఆంధ్రజ్యోతి): ఈదురుగాలులు జిల్లావాసులపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రధానంగా పాలకొండ మండలంలోని చాలా గ్రామాల్లో ఇంకా విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ జరగలేదు. దీంతో మూడు రోజులుగా ప్రజలు నరకం చూస్తున్నారు. శుక్రవారం కురిసిన గాలివానకు భారీగా విద్యుత్‌ స్తంభాలు నెలకొరిగిన సంగతి తెలిసిందే. సర్వీస్‌ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కూడా దెబ్బతిన్నాయి. దీంతో అనేక గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోగా.. నేటికీ పునరుద్ధరణ జరగకపోవడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. విద్యుత్‌ లైన్లను యంత్రాంగం సరిచేస్తోంది. జిల్లాలోని పలుచోట్ల విద్యుత్‌ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. అయితే పాలకొండ, వీరఘట్టం మండలాల్లో గత మూడు రోజులుగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతూనే ఉంది. పాలకొండ మండలంలోని ఎం.సింగుపురం, పొట్లి, డోలమడ, బర్న సీతంపేటతో పాటు పలు గ్రామాలు ఇంకా అంధకారంలోనే మగ్గుతున్నాయి. ఎం.సింగుపురం నుంచి డోలమడకు విద్యుత్‌ సరఫరా అయ్యే స్తంభాలు నేలకొరగడంతో ఈ సమస్య తలెత్తింది. ఆదివారం రాత్రికి విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకుంటామని ఆ శాఖాధికారులు చెబుతున్నారు.

- పాలకొండలోని సబ్‌స్టేషన్‌లో రెండు పవర్‌ ట్రాన్స్‌పార్మర్లు ఉన్నాయి. అయితే శుక్రవారం వీచిన ఈదురుగాలుకు ఒక ట్రాన్స్‌పార్మర్‌ మరమ్మతులకు గురైంది. దీంతో మరొక ట్రాన్స్‌ఫార్మర్‌పై మొత్తం లోడు పడుతుంది. దీంతో తరచూ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. మరోవైపు జగనన్న కాలనీలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల ద్వారా కొన్ని ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. పాలకొండ పట్టణంలో కూడా శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు పలు సమయాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

తాగునీటికి కటకట...

వరుసగా మూడు రోజుల పాటు విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రమైంది. రక్షిత పథకం ట్యాంక్‌లకు నీటి సరఫరా అయ్యే పరిస్థితి లేకపో వడంతో ప్రజలు బావులు, బోరుబోర్లును ఆశ్రయించి తాగునీటిని అవసరాలు తీర్చుకుంటున్నారు. శుక్ర, శనివారాల్లో పూర్తిస్థాయిలో విద్యుత్‌ సరఫరా లేక పాలకొండలో కుళాయిలు ద్వారా తాగునీరు సరఫరా కావడం లేదు. దీంతో పట్టణవాసులు ఆర్‌వో, మినరల్‌ వాటర్‌ ప్లాంట్ల వద్ద క్యూ కడుతున్నారు. ఆదివారం సాయంత్రానికి ట్యాంకర్ల ద్వారా కొద్దోగొప్పో తాగునీటిని అందించారు.

Updated Date - May 03 , 2026 | 11:44 PM