ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే.. డబుల్ ఇంజిన్ సర్కారుతో జతకట్టా
ABN , Publish Date - Sep 16 , 2026 | 12:41 AM
ఉత్తరాంధ్రను మరింత అభివృద్ధి చేసుకోవడానికే డబుల్ ఇంజన్ సర్కారుతో జత కలిసి పయనించేందుకు నిర్ణయించుకున్నానని జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు.
బొబ్బిలి, సెప్టెం బరు 15 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రను మరింత అభివృద్ధి చేసుకోవడానికే డబుల్ ఇంజన్ సర్కారుతో జత కలిసి పయనించేందుకు నిర్ణయించుకున్నానని జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఇటీవల టీడీపీలో చేరిన ఆయన మంగళవారం బొబ్బిలి కోటకు వచ్చి ఎమ్మెల్యే బేబీనాయన, ఇతర ముఖ్యనాయకులతో ఆత్మీయంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దర్బారు మహల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందన్నారు. దానికి ఆకర్షితుడనై చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ పాలన తీరుకు మద్దతు పలకాలని నిర్ణయించుకున్నాన న్నారు. అందరితో కలిసి పనిచేస్తానన్నారు. చంద్రబాబు, లోకేశ్ నాయకత్వంలో పనిచేసి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామన్నారు. ఎమ్మెల్యే బేబీనాయన మాట్లాడుతూ శ్రీనివాసరావు పార్టీలోనికి రావడం చాలా సంతోషంగా ఉంది. కొంతమంది అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆయన రాకతో పార్టీ మరింత బలపడుతుంద నడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. తొలుత శ్రీనివాసరావును ఎమ్మెల్యే సాదర స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, గ్రంథాలయ సంస్ధ డైరెక్టరు రౌతు రామ్మూర్తి, ఏఎంసీ చైర్మన్ నర్సుపల్లి వెంకటనాయుడు, సీనియర్ నేతలు అల్లాడ భాస్కరరావు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు మడక తిరుపతిరావు, కళింగవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ సుంకరి సాయిరమేష్, మున్సిపల్, ఏఎంసీ మాజీ చైర్మన్‌లు రాంబార్కి శరత్‌బాబు, పువ్వల శ్రీనివాసరావు, పట్ణణ, మండల పార్టీ అధ్యక్షులు గెంబలి శ్రీనివాసరావు, వాసిరెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.