Owning a Home… సొంతింటి కల సాకారం కోసం..
ABN , Publish Date - Mar 17 , 2026 | 11:53 PM
For Realizing the Dream of Owning a Home… జిల్లాలో గ్రామీణ గృహ నిర్మాణ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ (పీఎంఏవై-రూరల్) 2.0 పథకం కింద పేదలకు మంజూరు చేసే ఇళ్ల యూనిట్ ధరను రూ.1.20 లక్షల నుంచి రూ.2.39 లక్షలకు పెంచింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది.
యూనిట్ ధర రూ.1.20 లక్షల నుంచి రూ.2.39 లక్షలకు పెంపు
ప్రభుత్వంపై అదనంగా రూ.362 కోట్ల భారం
పార్వతీపురం, మార్చి17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామీణ గృహ నిర్మాణ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ (పీఎంఏవై-రూరల్) 2.0 పథకం కింద పేదలకు మంజూరు చేసే ఇళ్ల యూనిట్ ధరను రూ.1.20 లక్షల నుంచి రూ.2.39 లక్షలకు పెంచింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మేరకే ఒక్కో లబ్ధిదారునికి రూ.1.19 లక్షల మేర అదనపు సాయం అందనుంది. కాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లా అధికారులు అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
పీఎంఏవో గ్రామీణ్ 2.0 పథకం కింద గతంలో మంజూరైన ఇంటి నిర్మాణానికి రూ.1.20 లక్షలు మంజూరు చేసేవారు. ఇందులో కేంద్రం వాటా రూ.72 వేలు (60 శాతం), రాష్ట్ర సర్కారు వాటా రూ.48 వేలు (40 శాతం)గా ఉండేది. అయితే ఈ మొత్తంతో గృహ నిర్మాణం సాధ్యపడని పరి స్థితి. ఈ నేపథ్యంలో యూనిట్ ధర పెంచాలని అన్ని జిల్లాల నుంచి ప్రతిపా దనలు వెళ్లాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సర్కారుతో చర్చించి యూనిట్ ధర పెంపునకు కృషి చేసింది.
తాజా పెంపు ప్రకారం.. పీఎంఏవో గ్రామీణ్ 2.0 పథకం కింద పేదలకు మంజూరు చేసే ఇళ్లకు కేంద్ర వాటా రాయితీ కింద రూ.72 వేలు(60 శాతం), రాష్ట్ర ప్రభుత్వ వాటా రాయితీ రూ.48 వేలు(40 శాతం)... కలిపి మొత్తం రూ.1.20 లక్షలు మంజూరు చేయనున్నారు. అంతేకాకుండా వీబీజీ రామ్ జీ కింద 90 రోజుల పని దినాలకు కన్వర్జెన్స్ రూపంలో రూ.27వేలు, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) కింద మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలు, ఎస్‌హెచ్‌జీ లోన్‌పై వడ్డీ రాయితీ రూ.80 వేలు కలిపి... మొత్తం రూ.2.39 లక్షలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
అర్హుల జాబితా ఇలా..
పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ (పీఎంఏవై-రూరల్) 2.0 పథకం కింద ఇళ్లు మంజూరుకు సంబంధించి జిల్లా అధికారులు ఇటీవల సర్వే నిర్వహించి.. ఓ జాబితా సిద్ధం చేశారు. దాని ప్రకారం.. బలిజిపేటలో 1483, భామిని 1929 , గరుగుబిల్లి 1278, గుమ్మలక్ష్మీపురం 3724, జియ్యమ్మవలస 2655, కొమరాడ 2196, కురుపాం 2268లో మందిని అర్హులుగా గుర్తించారు. మక్కువలో 1872, పాచిపెంట 1380, పాలకొండ 2354, పార్వతీపురం 1753, సాలూరు 1833, సీతంపేట 2060, సీతానగరం 1888, వీరఘట్టంలో 2,652 మంది చొప్పున మొత్తంగా జిల్లాలో 31,325 మంది లబ్ధిదారులతో జాబితా రూపొందించారు. అయితే తాజాగా ఇళ్ల యూనిట్ ధరను రూ.1.20 లక్షల నుంచి రూ.2.39 లక్షలకు పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.362 కోట్ల మేర భారం పడనుంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఇచ్చే రుణానికి సంబంధించి రూ.80 వేలు వడ్డీ రాయితీతో పాటు కన్వర్జెన్స్ రూపంలో రూ.27వేలు, మరుగుదొడ్డి నిర్మాణానికి ఇచ్చే రూ.12 వేలు కలిపి మొత్తం భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి. కాగా ఇళ్ల మంజూరుకు అవసరమైన ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర సర్కారు జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చింది..