నిర్వహణ లేక.. దీపాలు వెలగక
ABN , Publish Date - Nov 20 , 2026 | 12:51 AM
జిల్లా కేంద్రం పార్వతీపురంలో వీధి దీపాలు, సెంటర్ లైటింగ్ నిర్వహణ అధ్వానంగా ఉంది.
పార్వతీపురంలో అలముకుంటున్న చీకట్లు
సెంటర్ లైటింగ్‌పై నిర్లక్ష్యం
వీధుల్లో కూడా వెలగని లైట్లు
పాదచారులు, వాహనచోదకుల ఇబ్బందులు
మున్సిపల్ నూతన పాలకవర్గం చొరవ చూపాలని విన్నపం
పార్వతీపురంటౌన్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పార్వతీపురంలో వీధి దీపాలు, సెంటర్ లైటింగ్ నిర్వహణ అధ్వానంగా ఉంది. చాలా వార్డుల్లో వీధి దీపాలు వెలగడం లేదు. సెంటర్ లైటింగ్‌లో కూడా కొన్ని మాత్రమే వెలుగుతున్నాయి. దీంతో సాయంత్రం ఆరు గంటల తరువాత వీధుల్లో, రోడ్లపై అంధకారం నెలకొంటుంది. ఈ మార్గాల్లో పాదచారులు, వాహనచోదకులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణా లు సాగిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో కొలువు దీరనున్న నూతన మున్సిపల్ పాలకవర్గంపైనే వారు ఆశలు పెట్టుకున్నారు.
ఇదీ పరిస్థితి..
మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో ఉన్న వీధి దీపాలతో పాటు బెలగాం గెడ్డవీధి నుంచి రాయగడ రోడ్డు వరకు ప్రధాన రహదారిపై ఉన్న సెంటర్ లైటింగ్ నిర్వహణ బాధ్యతను 2007లో మునిసిపల్ ఇంజనీరింగ్ అధికారు లు ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. అప్పటి నుంచి 2020 వరకు వీధి దీపాలు, సెంటర్ లైటింగ్ నిర్వహణ సక్రమంగా ఉండేది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత వాటికి గ్రహణం పట్టింది. గత మునిసిపల్ పాలకవర్గ సభ్యులు వైసీపీకి చెందిన వారే కావడంతో వీధి దీపాలు, సెంటర్ లైటింగ్ నిర్వహణపై కనీసం శ్రద్ధ చూపలేదు. అప్పట్లో వీటి పర్యవేక్షణకు గాను మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఏఈ సన్యాసిరావును నియమించారు. 2022 వరకు వీధి దీపాల నిర్వహణ అంతంత మాత్రంగానే ఉండేది. అయితే, సకాలంలో బిల్లులు చెల్లించడం లేదనే కారణంతో ఆ బాధ్యతల నుంచి ప్రైవేట్ ఏజెన్సీ తప్పుకుంది. దీంతో అధికారులు ఆ ఏజెన్సీకి బిల్లులు చెల్లించారు. మళ్లీ 2025 నుంచి వీధిధీపాలు, సెంటర్ లైటింగ్ నిర్వహణపై నిర్లక్ష్యం చోటుచేసుకుంది. దీంతో పట్టణ ప్రజలకు కష్టాలు తప్పడం లేదు.
ప్రతి ఏటా రూ.20లక్షలు ఖర్చు..
ప్రతి ఏడాదీ వీధి దీపాలు, సెంటర్ లైటింగ్ నిర్వహణకు సుమారు రూ.20లక్షలను ఇంజనీరింగ్ అధికారులు ఖర్చు చేస్తున్నారు. అయినప్పటికీ చాలా వీధుల్లో అంధకారం నెలకొంటుంది. పట్టణ విస్తీర్ణం రోజురోజుకూ పెరుగుతోంది. పట్టణ శివారులోని నవిరి, గిజబ, వైకేఎం తదితర కాలనీల్లో వీధులు ఎక్కువవుతున్నాయి. అయితే, శివారు కాలనీల్లో వీధి దీపాలు వెలగడం లేదు. కొన్ని వీధుల్లో స్తంభాలు సైతం ఏర్పాటు చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో చీకటి పడితే ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు నివాసితులు భయపడుతున్నారు.
ఒక్క అధికారితో సాధ్యమా..?
గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ నుంచి డీఈ శ్రీనివాసరాజుతోపాటు ఏఈ అప్పారావు బదిలీపై పార్వతీపురం మునిసిపాలిటీకి వచ్చారు. వీరిద్దరూ అనారోగ్యరీత్యా రెండు నెలల కిందట మెడికల్ లీవ్ పెట్టారు. మరోపక్క ఏఈ సన్యాసిరావు మూడు నెలల కిందట పదవీ విరమణ చేశారు. దీంతో బొబ్బిలి మున్సిపల్ డీఈ కిరణ్‌కుమార్‌కు పార్వతీపురం మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షణ బాధ్యతలను ఉన్నతాధికారులు అప్పగిం చారు. గతంలో ముగ్గురు అధికారులు ఉన్నప్పుడే తాగునీరు, వీధిదీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండేది. ఇప్పుడు ఒక్క డీఈతో వాటి నిర్వహణ సాధ్యమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందే ఇంజనీరింగ్ విభాగానికి దిక్కుగా మారారు. ఈ నేపథ్యంలో నూతన పాలకవర్గంపై పట్టణ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. వీధి దీపాలు, సెంటర్ లైటింగ్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని వేడుకుంటున్నారు.
ప్రత్యేక శ్రద్ధ పెడతాం
వీధి దీపాలు, సెంటర్ లైటింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడతాం. ఇప్పటికే వీధి దీపాల నిర్వహణకు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాం. సెంటర్ లైటింగ్‌కు సంబంధించి ప్రైవేట్ ఏజెన్సీతో మాట్లాడం. ఎలాంటి ఇబ్బందులు, సాంకే తిక లోపాలు లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం.
- కిరణ్‌కుమార్, ఇన్‌చార్జి డీఈ, పార్వతీపురం మునిసిపాలిటీ