Share News

Folk Music in the Hearts of the People జన హృదయాల్లో జానపదం

ABN , Publish Date - Aug 22 , 2026 | 12:00 AM

Folk Music in the Hearts of the People జానపదాలకు ప్రఖ్యాతిగా విజయనగరం జిల్లా బాసిల్లుతోంది. బుర్రకథలు.. హరికథలు.. సాంఘిక నాటికలు.. నాటకాలు.. రేలారే రేలా... తప్పెటగుళ్లు.. తూర్పుభాగవతం తదితర ప్రదర్శనలతో జిల్లాకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. మరోవైపు సోషల్‌ మీడియా పుణ్యమా అని జిల్లాలో ఎంతోమంది వర్దమాన కళాకారులు విశేష ప్రాచుర్యం పొందుతున్నారు. షేర్‌లు, లైక్‌లు, సబ్‌స్రైబ్‌లతో జనాధరణ సొంతం చేసుకుంటున్నారు. ఎక్కడో మారుమూల ఉన్నా కూడా ప్రతిభతో ప్రజాభిమానం పొందుతున్నారు. ఇదిలాఉండగా కాలం మారుతున్నా కొన్ని జానపదాల వన్నె ఏమాత్రం తగ్గలేదు. ప్రత్యేక రోజులు, పండుగలు, శుభదినాల్లో పల్లె, పట్టణాల్లో విరివిగా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు.

Folk Music in the Hearts of the People జన హృదయాల్లో జానపదం

జన హృదయాల్లో జానపదం

జిల్లాలో ఎంతోమంది కళాకారులు

90వ దశకంలో బుర్రకథలతో ఆకట్టుకున్న గరివిడి లక్ష్మి

బోనెల అసిరయ్యది ప్రత్యేక శైలి

బుల్లితెరపై దూసుకుపోతున్న పల్సర్‌ బైక్‌ రమణ

ప్రజలను ఆకట్టుకంటున్న తప్పెటగుళ్ల కళాకారులు

నేడు అంతర్జాతీయ జానపద దినోత్సవం

జానపదాలకు ప్రఖ్యాతిగా విజయనగరం జిల్లా బాసిల్లుతోంది. బుర్రకథలు.. హరికథలు.. సాంఘిక నాటికలు.. నాటకాలు.. రేలారే రేలా... తప్పెటగుళ్లు.. తూర్పుభాగవతం తదితర ప్రదర్శనలతో జిల్లాకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. మరోవైపు సోషల్‌ మీడియా పుణ్యమా అని జిల్లాలో ఎంతోమంది వర్దమాన కళాకారులు విశేష ప్రాచుర్యం పొందుతున్నారు. షేర్‌లు, లైక్‌లు, సబ్‌స్రైబ్‌లతో జనాధరణ సొంతం చేసుకుంటున్నారు. ఎక్కడో మారుమూల ఉన్నా కూడా ప్రతిభతో ప్రజాభిమానం పొందుతున్నారు. ఇదిలాఉండగా కాలం మారుతున్నా కొన్ని జానపదాల వన్నె ఏమాత్రం తగ్గలేదు. ప్రత్యేక రోజులు, పండుగలు, శుభదినాల్లో పల్లె, పట్టణాల్లో విరివిగా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు.

రాజాం, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి):

గ్రామీణ ప్రాంత ప్రజలకు బుర్రకథ అంటే ఇప్పటికీ అమితాసక్తి. 90వ దశకంలో జిల్లాకు చెందిన గరివిడి లక్ష్మీ బుర్రకథ ఉత్తరాంధ్రను మాత్రమే కాదు. తెలుగు వారున్న ప్రతిచోటా విశేష ఆదరణ పొందింది. గరివిడికి చెందిన ఈ బుర్రకథ దళంలో లక్ష్మీ వచనం, నర్సింగరావు హాస్యంతో ఆకట్టుకునేవారు. ‘కాలిపోతుంది నాదో’.. ‘నలజిలకర్ర మొగ్గ’.. ‘మాలవారి మంగమ్మ’.. లాంటి ఎన్నో పాటలు ఈ బుర్రకథలోనివే. సాధారణంగా ఒక కళాకారుడు ఏడాదికి 100 వరకూ ప్రదర్శనలిస్తే గొప్ప. అటువంటిది గరివిడి లక్ష్మి ఏడాదిలో 365 రోజులూ ప్రదర్శనలిచ్చేవారు.

- జానపద కళాకారుడిగా బోనెల అసిరయ్య తనదైన గీతాలాపన, జముకు వాయిద్యంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ‘బావొచ్చాడోలప్ప.. బావొచ్చేడు.. ‘పట్టుసీర కట్టమన్నది మాయత్త.. తదితర పాటలను విశాఖ నుంచి పలాస వైపు వెళ్లే ప్యాసింజర్‌ రైలులో అసిరయ్య వినిపించే వాడు. జముకుతో జానపదాలు పాడుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. సంతకవిటి మండలం వాల్తేరు గ్రామానికి చెందిన ఈయన ఎటువంటి చదువు లేకపోయినా వాడుక భాషలో ఉండే పదాలను జతకూర్చుతూ జముకు కళను నేర్చుకున్నాడు. ఆయన గురించి, ఆయన పాట పాడే విధానం గురించి తెలుసుకున్న సంగీత దర్శకుడు రఘు కుంచె ‘పలాస 1978’ సినిమాలో పాడే అవకాశం కల్పించారు. అసిరయ్య పాడుకునే నాదీ నక్లీస్‌ గొలుసు మంచి ప్రేక్షకాదరణ పొందింది. బుల్లితెర కార్యక్రమాల్లో సైతం అసిరయ్య మెరుస్తున్నారు.

- పల్సర్‌ బైక్‌ రమణది మెరకముడిదాం మండలంలోని కొర్లాం. ఎనిమిదో తరగతి చదువుతుండగా రమణ తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు. కుటుంబ ఆర్థిక కారణాల రీత్యా రమణ చదువుకు దూరమయ్యాడు. ఓ కంపెనీలో నెల జీతానికి చేరాడు. కానీ జానపదాలపై మక్కువతో సొంతంగా సాధన చేసేవాడు. యూట్యూబ్‌లో జానపదాలు తరచూ వినేవాడు. ఈ క్రమంలో అప్పటికే జానపదాల్లో రాణిస్తున్న కోరాడ జానకీరావు వద్దకు వెళ్లాడు. అప్పటికే రేలారే రేలాతో పాపులర్‌ అయిన జానకీరావు శిష్యరికంలో స్టేజీ ప్రోగ్రాంలో రమణకు అవకాశం దక్కింది. అటు తరువాత బుల్లితెరపైనా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు.

- రాజాం మండలం ఆగూరు గ్రామానికి చెందిన తప్పెటగుళ్లు కళాకారులదీ ప్రత్యేక ప్రస్థానం. గ్రామాలలో జరిగే పండుగల్లో వీరి ప్రదర్శన తప్పకుండా ఉంటుంది. వారంతా గొర్రెల పెంపకం వృత్తిని వదులుకొని తప్పెటగుళ్లు నేర్చుకున్నారు. గురువు రామారావు ఆధ్వర్యంలో బృందం ఈ ప్రదర్శనకు వెళ్తుంటుంది. అయితే ప్రభుత్వ పరంగా కళాకారులగా గుర్తించి పెన్షన్‌ సదుసాయం కల్పించాలని కళాకారుడు నాగయ్య కోరుతున్నాడు.

అలరిస్తున్న రేలారే రేలా రఘు

గజపతినగరం, ఆగస్టు21 (ఆంధ్రజ్యోతి): లింగి..లింగి లింగిడి- లింగిడి కింద జంగడి పాటతో యువతను ఉర్రూతలూగించే రేలారే రేలా రఘు అంటే భలే క్రేజ్‌. పాలవలస రఘుది గజపతినగరం మండలం పాతబగ్గాం. గురువు డొంకాడ రామ్మోహనరావు శిష్యరికంలో అన్నయ్య ఈశ్వరరావుతో కలిసి జిల్లాలో పాటు ఉత్తరాంధ్రలో 2002 నుంచి దాదాపు 3వేలవరకు బుర్రకధ ప్రదర్శనలు ఇచ్చారు. 2015లో శ్రీమాతా మ్యూజిక్‌ హౌస్‌ అనే యూట్యూబ్‌ చానల్‌ ప్రోత్సాహంతో సొంతంగా రఘు టీమ్‌ అనే యూట్యూబ్‌ చానల్‌ను ఏర్పాటు చేసుకొని ప్రతి నెలలో రెండునుంచి మూడు కొత్త జానపద పాటలను కూర్చి జనాభిమానం పొందుతున్నారు. హీరో శ్రీకాంత్‌ నటించిన కోటబొమ్మాలి పీఎస్‌ చిత్రంలో లింగి లింగి లింగిడి పాటను తానే పాడి కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. గత ఏడాది ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతులమీదుగా ఉగాది పురస్కారం కూడా అందుకున్నారు.

ఆలోచింపజేసే తూర్పుభాగవతం

13 తరాల నాటి కళకు గ్రామదేవత పండుగల్లో విశేష ఆదరణ

బొబ్బిలి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి):

తూర్పుభాగవతం (భామా కలాపం)... సంప్రదాయ ఉత్తరాంధ్ర జానపద కళ. పామరులను సైతం విశేషంగా కట్టిపడేసే వీధి నాటకం. బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన బొంతలకోటి కుటుంబానికి ఈ కళ ఓ సొత్తు. 13 తరాల నుంచి వారసత్వంగా ఈ కళను పోషిస్తూ వస్తున్నారు. సిలికానాంధ్ర యూనివర్సిటీ వారు ఇటీవల ఈ కళపై అధ్యయనం చేసేందుకు ముందుకు రావడం గమనార్హం. బొబ్బిలి రాజసంస్థానాధీశుడు రావు శ్వేతాచలపతిరంగారావు సౌజన్యంతో మక్కువ మండలం వెంకటభైరిపురం గ్రామానికి చెందిన వంకాయల బలరామ భుక్త నుంచి బొంతలకోటి లచ్చన్న ఈ కళను నేర్చుకున్నారు. అప్పటినుంచి బొంతలకోటి కుటుంబీకులు వారసత్వ సంపదగా ఈ కళా ప్రదర్శనలను కొనసాగిస్తూ వస్తున్నారు. ఉత్తరాంధ్రలోని వందకు పైగా గ్రామాలలో తూర్పుభాగవతం ప్రదర్శన నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారి ఉత్సవాలలో ఈ కళా ప్రదర్శన తప్పనిసరి.

ఫ తూర్పు భాగవతంలో శ్రీకృష్ణుడు-సత్యభామల కలహాన్ని ఇతివృత్తంగా చేసుకొని సత్యభామ, రాధ, శ్రీకృష్ణుని పాత్రల్లో మగవారే నటిస్తారు. ఈ ప్రధాన పాత్రధారులకు వంతలు పాడే వారిని హంగుదారులని కూడా అంటారు. మృదంగం, వాయిద్యం, హార్మోనియం వంటి సంగీత పరికరాలను వినియోగిస్తారు. కళాకారులు చెక్కతో తయారు చేసిన ఆభరణాలను ధరిస్తారు. వేషం కోసం సహజ రంగులనే వినియోగిస్తారు.

------------------

Updated Date - Aug 22 , 2026 | 12:00 AM