ఫాగింగ్ చేయట్లే!
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:39 AM
పారిశుధ్య నిర్వహణలో భాగంగా దోమల్ని అరి కట్టేందుకు గతేడాది విజయనగరం కార్పొరేషన్‌కు ప్రభుత్వం పంపిణీ చేసిన ఫాగింగ్ యంత్రాలు మూలకు చేరాయి.
- మూలకు చేరిన యంత్రాలు
- 50 డివిజన్లకు ఒక్కటే వినియోగం
- నగరంలో పెరిగిన దోమల బెడద
విజయనగరం టౌన్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): పారిశుధ్య నిర్వహణలో భాగంగా దోమల్ని అరి కట్టేందుకు గతేడాది విజయనగరం కార్పొరేషన్‌కు ప్రభుత్వం పంపిణీ చేసిన ఫాగింగ్ యంత్రాలు మూలకు చేరాయి. ఆరు ఫాగింగ్ యంత్రాలను సరఫరా చేస్తే ప్రస్తుతం ఒక్కటే పని చేస్తోంది. మిగతావి మరమ్మతులకు గురయ్యాయి. వాటిని బాగు చేయాలంటే వేల రూపాయలు వెచ్చించాలి. ప్రస్తుతం నగరంలో దోమల బెడదతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. కాలువల్లో చెత్తాచెదారం, ఆవాస ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచిపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫాగింగ్ యంత్రాలతో దోమల మందు పిచికారీ చేయడం లేదని వాపోతున్నారు.
దోమల బెడద..
నగరంలోని ఖాళీ స్థలాల్లో మురుగు నీరు నిల్వ ఉండడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. దోమల నివారణకు చర్యలు చేపడుతున్నామని ప్రజారోగ్యశాఖ అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కానరావడం లేదు. నగరంలోని 50 డివిజన్లలో కొన్ని నెలలుగా ఎక్కడా ఫాగింగ్ చేసినా దాఖలాలు లేవు. ప్రదీప్‌నగర్, తోటపాలెం, పద్మావతి నగర్, కేఎల్‌పురం, కామాక్షినగర్, రింగురోడ్డు, పూల్‌భాగ్, గాజులరేగ వంటి ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలాల్లో మురుగుపేరుకుపోయి దోమలకు అడ్డాగా మారాయి. దోమల నివారణకు ప్రతి ఏటా రూ.లక్షల్లో నిధులు వెచ్చిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ, అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. అవసరమైన ఫాగింగ్ యంత్రాలు, రసాయనాలు కొనుగోలు చేస్తున్నట్లు రికార్డుల్లో రాస్తున్నారే తప్పా అవి ఎవ్వరికీ కనబడటం లేదు. 50 డివిజన్లకు ఒకేఒక్క ఫాగింగ్ యంత్రం వినియోగంలో ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
కానరాని ప్రత్యేక డ్రైవ్
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాల్సి ఉంది. వీటిపై నగరంలోని అన్ని డివిజన్లలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకూ నగరంలో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించిన దాఖలాలు లేవు. స్వచ్ఛ సర్వేక్షణ్ కూడా కేవలం ప్రచారానికే పరిమితమైందనే విమర్శలు ఉన్నాయి. నగరంలో పలుచోట్ల కాలువలను శుభ్రం చేయడం లేదు. ఖాళీస్థలాలు, రహదారికి ఇరువైపులా పేరుకుపోయిన పిచ్చిమొక్కలను తొలగించడం లేదు. దీంతో ఎక్కడిపడితే అక్కడే దోమలు పెరిగిపోయి స్ధానికులు రోగాలపాలవుతున్నారు.
- నగరంలోని ప్రతి ఇంట్లో దోమల నివారణకు సుమారు ఏటా రూ.1500 ఖర్చు అవుతోంది. ఇంట్లోకి దామలు రాకుండా లిక్విడ్లు, అగరవత్తులు, కాయిల్స్, బ్యాట్లు, దోమల తెరలు వంటివి కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నామని నగరవాసులు వాపోతున్నారు.
చర్యలు చేపడతాం
నగరంలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ఫాగింగ్ యంత్రాలు తక్కువ ఉన్నమాట వాస్తవమే. కొత్తవి కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు పెట్టాం. నగరంలో నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి దోమల నివారణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటాం.
-కొండపల్లి సాంబమూర్తి, ప్రజారోగ్యశాఖాధికారి, విజయనగరం కార్పొరేషన్