Polling Stations పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలపై దృష్టి
ABN , Publish Date - Jul 15 , 2026 | 11:48 PM
Focus on Facilities at Polling Stations గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) రవీంద్ర సూచించారు. బుధవారం సుంకి ప్రాథమిక పాఠశాలలో సౌకర్యాలను పరిశీలించారు.
గరుగుబిల్లి, జూలై15(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) రవీంద్ర సూచించారు. బుధవారం సుంకి ప్రాథమిక పాఠశాలలో సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముందస్తుగా కేంద్రాల్లోని సౌకర్యాలను పరిశీలించి రాష్ట్రస్థాయి అధికారులు నివేదికలు అందించాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలోని పోలింగ్ కేంద్రాలను మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పరిశీలించాలన్నారు. పార్వతీపురం డివిజన్ పరిధిలో ఎనిమిది మండలాల్లో 224 పంచాయతీలు, 2,102 వార్డులు ఉన్నాయన్నారు. పాలకొండ డివిజన్‌లో ఏడు మండలాల్లో 227 పంచాయతీలు, 2,102 వార్డులు ఉన్నాయన్నారు. 2021లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల ఆధారంగా నివేదికలు పంపించామని వెల్లడించారు. కాగా పోలింగ్ కేంద్రాల పరిధిలో విద్యుత్ సౌకర్యం, భవనాల పరిస్థితి, ప్రహరీలతో పాటు పూర్తి సమాచారాన్ని నివేదిస్తామన్నారు. బ్యాలెట్ బాక్సులు ఎంతమేర అవసరం అన్న దానిపై సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ సమయంలో ప్రకటించినా.. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామన్నారు. కాగా పంచాయతీల పరిధిలో ప్రతి బుధవారం విధిగా స్వచ్ఛ పథం కార్యక్రమం నిర్వహించాలన్నారు. రహదారులు శుభ్రత, పిచ్చి మొక్కలు తొలగింపు వంటి చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కార్యదర్శులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రక్షిత పథకాలను నిర్ణీత సమయానికి శుభ్రపర్చి ప్రజలకు సురక్షిత నీటిని అందించాలని ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పరిశీలనలో డిప్యూటీ ఎంపీడీవో ఎల్.గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.