Fly Kites Safely ప్రమాదానికి దూరంగా.. పతంగులు ఎగరేద్దాం
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:12 AM
Fly Kites Safely, Stay Away from Danger సంక్రాంతి పండుగను చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ సరదగా జరుకుంటారు. ముఖ్యంగా చిన్నారులు, యువత గాలిపటాలను ఎగుర వేస్తుంటారు. పాఠశాలలకు సెలవులు ఇచ్చేయడంతో ఎక్కడి చూసినా.. ప్రస్తుతం పిల్లలు గాలి పటాలతో సందడి చేస్తున్నారు
చైనా మాంజా(దారం)తో పొంచి ఉన్న ప్రమాదం
పాలకొండ, జనవరి 12(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగను చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ సరదగా జరుకుంటారు. ముఖ్యంగా చిన్నారులు, యువత గాలిపటాలను ఎగుర వేస్తుంటారు. పాఠశాలలకు సెలవులు ఇచ్చేయడంతో ఎక్కడి చూసినా.. ప్రస్తుతం పిల్లలు గాలి పటాలతో సందడి చేస్తున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు స్థానికంగా దొరికే కాటన్ దారాలతో గాలిపటాలు ఎగురవేసేవారు. కానీ ఇటీవల కాలంలో మార్కెట్లోకి కొత్తగా చైనా మాంజా (దారం) వచ్చింది. ఇవి సన్నగా బరువు లేకుండా ఉండడంతో దీనిని కొనుగోలుకు చిన్నారులు, యువత అధికంగా ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడే ఇవి అందుబాటులో ఉన్నాయి. అయితే చైనా మాంజాతో ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ, సూరత్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో దానిపై నిషేధం విధించారు. చైనా మాంజా కంటి కనిపించనంత సన్నగా ఉంటుంది. ఈ దారం చాకులా ఉండి.. చర్మాన్ని కోసేస్తుంది. దీంతో పలు రాష్ర్టాల్లో చాలా మంది చిన్నారులు, యువత గాలి పటాలను ఎగురవేసే క్రమంలో చైనా మాంజా కారణంగా గాయాలపాలయ్యారు. దీనివల్ల వాహనదారులతో పాటు పక్షులకు కూడా ముప్పు వాటిల్లనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. చైనా మాంజాను వినియోగించరాదని, అందుబాటులో ఉండే దారాలతోనే గాలిపటాలను ఎగురవేయాలని స్పష్టం చేసింది. మరోవైపు ఏపీ టాస్క్‌ఫర్స్ విభాగం కూడా హెచ్చరికలు జారీ చేసింది. పిల్లలపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని వెల్లడించింది. పెద్దల సమక్షంలో గాలి పడాలను ఎగురవేయాలని, ఈ క్రమంలో జాగ్రత్తలు తీసకోవాలని సూచించింది.
వినియోగించవద్దు
‘జిల్లాలోని పలు చోట్ల చైనా మాంజా(దారం) అందుబాటులో ఉన్నట్టు తెలిసింది. ఈ దారాన్ని ఎవరూ వినియోగించవద్దు. చైనా మాంజాతో ప్రమాదం పొంచి ఉంది. వాటి అమ్మకాలపై ఆరా తీస్తున్నాం. ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ’ అని పాలకొండ సీఐ ప్రసాదరావు తెలిపారు.