Floodwaters Have Receded! వరద తొలగింది!
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:17 AM
Floodwaters Have Receded! నాగావళి ఉగ్రరూపం దాల్చడంతో ముంపునకు గురైన నదీతీర గ్రామాలు శనివారం సాధారణ స్థితికి చేరుకున్నాయి. జలదిగ్బంధంలో చిక్కుకున్న అన్నవరంతో పాటు గోపాలపురం, అంపిలి , పాలకొండలోని కొన్ని ప్రాంతాల్లో వరదనీరు తొలగి పోయింది. దీంతో ఆయా ప్రాంతవాసులు ఊపిరిపీల్చుకున్నారు.
సాధారణ స్థితికి చేరుకున్న నదీతీర గ్రామాలు
పాలకొండ, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): నాగావళి ఉగ్రరూపం దాల్చడంతో ముంపునకు గురైన నదీతీర గ్రామాలు శనివారం సాధారణ స్థితికి చేరుకున్నాయి. జలదిగ్బంధంలో చిక్కుకున్న అన్నవరంతో పాటు గోపాలపురం, అంపిలి , పాలకొండలోని కొన్ని ప్రాంతాల్లో వరదనీరు తొలగి పోయింది. దీంతో ఆయా ప్రాంతవాసులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం నాగావళి, గెడ్డలు, వాగుల్లో నీటి ప్రవాహం నిలకడగా ఉంది. నీటమునిగిన గ్రామాలు, ఇళ్లు సాధారణ స్థితికి చేరుకున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి బ్లీచింగ్ తదితర వాటిని జల్లారు. ఆయా గ్రామాలకు యథావిధిగా రాకపోకలు కొనసాగుతున్నాయి. వరదనీటి ఉధృతి కారణంగా అన్నవరం గ్రామ రహదారి కోతకు గురైంది. గోపాలపురం, మంగళాపురం మధ్య రహదారి గోతులమయంగా మారింది. అన్నవరం గ్రామాన్ని తహసీల్దార్ రాధాకృష్ణ, అగ్నిమాపక శాఖాధికారి సర్వేశ్వరరావు తదితరులు సందర్శించారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. నాగావళి నదీతీరానికి చేరుకొని ప్రవాహాన్ని పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా ఇబ్బందులు తలెత్తితే సమాచారం ఇవ్వాలని సూచించారు.
పంట పొలాల్లో వరద...
పాలకొండ మండలంలోని తంపటాపల్లి, బుక్కూరు, మంగళాపురం, యరకారాయపురం, గోపాలపురం, అన్నవరం, పాలకొండలో వందలాది ఎకరాల్లో పంట పొలాలు ఇంకా వరదనీటిలోనే ఉన్నాయి. నాగావళి, గెడ్డల్లో వరద నీరు మరికొంత తగ్గితే తప్ప పంట పొలాల నుంచి నీరు మళ్లే పరిస్థితి కనిపించడం లేదు దీంతో వరి పంట కుళ్లిపోయే ప్రమాదముందని ఆయా గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తోటపల్లి ప్రాజెక్టులోని గుర్రపు డెక్క వరదనీటితో కలిసి పంట పొలాలకు చేరింది. దీంతో అన్నవరం, గోపాలపురం, కొండాపురం తదితర గ్రామాల పంట పొలాల్లో నీరు కొన్ని చోట్ల వెనక్కి వెళ్లినా అధికంగా గుర్రపు డెక్క పేరుకుపోయింది. కొంతమంది రైతులు దానిని తీస్తుండగా, మరికొంతమంది చేసేది లేక అలాగే విడిచిపెట్టారు.