Floods Bring Fear! వరదొస్తే వణుకే!
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:26 AM
Floods Bring Fear! వంశధారకు వరదొస్తే చాలు.. భామిని మండలంలో నదీ తీర ప్రాంతవాసులు చిగురుటాకుల్లా వణికిపోవాల్సి వస్తోంది. ఎప్పుడు గ్రామాల్లోకి వరద నీరు వస్తుందో తెలియని పరిస్థితి. మరోవైపు నదికి ఆనుకుని ఉన్న పంట పొలాలు కోతకు గురవుతుం డడడంతో ఏటా నానా పాట్లు పడుతున్నారు.
భామిని మండలం వంశధార తీరంలో చేపట్టని పనులు
నదీతీర ప్రాంతాల్లో తీవ్రం కానున్న ముంపు సమస్య
కోతకు గురవనున్న పంట భూములు
ఆందోళనలో రైతులు, గ్రామస్థులు
పనులు పునఃప్రారంభించాం: నీటిపారుదల శాఖ
భామిని, జూలై18(ఆంధ్రజ్యోతి): వంశధారకు వరదొస్తే చాలు.. భామిని మండలంలో నదీ తీర ప్రాంతవాసులు చిగురుటాకుల్లా వణికిపోవాల్సి వస్తోంది. ఎప్పుడు గ్రామాల్లోకి వరద నీరు వస్తుందో తెలియని పరిస్థితి. మరోవైపు నదికి ఆనుకుని ఉన్న పంట పొలాలు కోతకు గురవుతుం డడడంతో ఏటా నానా పాట్లు పడుతున్నారు. ప్రస్తుత వర్షాకాలం నేపథ్యంలో మళ్లీ వారిలో గుబులు రేగుతోంది. ఇప్పటికే ఒడిశా వైపు నదీ తీరంలో రాతి కరకట్టల నిర్మాణం పూర్తవుతోంది. దీంతో ఈ సారి భామిని మండలానికి వరదపోటు అధికంగా ఉండే అవకాశం ఉందని నదీతీర ప్రాంత వాసులు, రైతులు వాపోతున్నారు. ఒడిశాలో లేదా జిల్లాలో వర్షాలు కురిస్తే తమ పరిస్థితేమిటోననని ఆందోళన చెందుతున్నారు.
ఇదీ పరిస్థితి..
- వంశధారకు1980లో భారీ వరదలు వచ్చాయి. అప్పటి నుంచి ఒడిశా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. క్రమేపీ కరకట్టల నిర్మాణం చేపడుతూ వస్తోంది. వరద ముంపు శాశ్వత పరిష్కారంలో భాగంగా వంశధార నదికి తూర్పువైపు ఉన్న ఒడిశా గ్రామాలు పాలసింగి నుంచి కాశీనగర్ వరకు సుమారు 30 కిలోమీటర్లు మేర రాతితో కరకట్టల నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం లివిరి గ్రామం తూర్పున ఒడిశా వైపు కరకట్టల పనులు చేపడుతోంది. దీంతో మన్యం జిల్లా భామిని మండలంలో సింగిడి, కోసలి, కీసర, ఘనసర, పసుకుడి, బిల్లుమడ, లివిరి తదితర గ్రామాలకు వరద ముప్పు సమస్య తీవ్రం కానుంది. మరోవైపు ఏటా పంట భూములు కోతకు గురవడంతో నదీతీర ప్రాంతాల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒడిశాలో మాదిరిగానే భామిని మండలంలోని వంశధార నది తీరంలోనూ కరకట్టలు నిర్మించాలని వారు కోరుతున్నారు.
- 1980 తర్వాత 2007లోని వంశధార భారీ వరదలు వచ్చాయి. దీంతో సింగిడి, కీసర, కోసలి గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దీంతో కరకట్టలు నిర్మించాలని నదీతీర ప్రాంత వాసులు అప్పట్లో ప్రజా ప్రతినిధులు, అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. ఈ నేపఽథ్యంలో బత్తిలి, సింగిడి గ్రామాలకు వరదముంపు లేకుండా రక్షణగోడ నిర్మించారు.
- ఇకపోతే 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం బత్తిలి నుంచి ఆకుల తంపర వరకు 56 కిలోమీటర్ల కరకట్టల నిర్మాణం కోసం రూ.316 కోట్లు మంజూరుచేసింది. 7 శాతం పనులు పూర్తయిన తర్వాత ప్రభుత్వం మారింది. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో కరకట్టల పనులు పూర్తిగా పడకేశాయి. అధికారులు కూడా తొంగిచూడలేదు. దీంతో వంశధారకు వరదలొస్తే ఏటా బిల్లుమడ, సింగిడి, పసుకుడి, దిమ్మిడిజోల, సొలికిరి, ఘనసర, కీసర, కోసలి పంట పొలాలు జలమయమవుతున్నాయి. అయితే నేటికీ కరకట్టల నిర్మాణం ఊసే లేకపోవడంతో ఈ ఏడాదీ కష్టాలు తప్పేలా లేవని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.
నదీతీరంలో ప్రమాదాలు...
కాట్రగడ, లివిరి, బాలేరు గ్రామాల్లో నీటి రేవుల్లో ప్రజలు నదిలో దిగేందుకు మెట్లు ఏర్పాటు చేశారు. ఈ మెట్లు నదీ ప్రవాహానికి కోతకు గురవుతున్నాయి. దీంతో స్నానాలకు వెళ్లిన వారు ప్రమాదశాత్తూ జారిపడి మృతి చెందుతున్నారు. గతేడాది కాట్రగడ్డ, లివిరిలో ఇద్దరు మహిళలు గల్లంతయ్యారు. అధికారులు దీనిపై కూడా దృష్టి సారించాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు.
వచ్చే ఏడాదికి పూర్తిచేస్తాం
కరకట్టల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. గతంలో మంజూరైన రూ.316 కోట్లతో ఉమ్మడి జిల్లా కొత్తూరు వద్ద సోమరాజపురంలో పనులు పునఃప్రారంభించాం. వర్షాకాలం ముగిశాక కరకట్టల పనులు చేపడతాం. వచ్చే ఏడాదికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
- బాబ్జీ, డీఈ , నీటిపారుదల శాఖ