పగలు ఈగలు.. రాత్రి దోమలు
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:00 AM
మండలంలోని గడసింగుపురం పంచాయతీ ఏనుగులగూడ, సీమలవానివలస గ్రామాల్లో ఈగలు, దోమలు విజృంభిస్తున్నాయి.
- గ్రామాల మధ్యే కోళ్లఫారం
- కనీస మౌలిక సదుపాయాలు కరువు
- ఇబ్బందులు పడుతున్న గిరిజనులు
- ఇదీ ఏనుగులగూడ, సీమలవానివలసలో పరిస్థితి
జియ్యమ్మవలస, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గడసింగుపురం పంచాయతీ ఏనుగులగూడ, సీమలవానివలస గ్రామాల్లో ఈగలు, దోమలు విజృంభిస్తున్నాయి. ఈ గ్రామాల ప్రజలు పగలంతా ఈగలతో, రాత్రంతా దోమలతో సహవాసం చేస్తున్నారు. ఏనుగులగూడలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. రెండు దశాబ్దాల కిందట కురుపాం మండలం ఒబ్బంగి పంచాయతీ తోలుంగూడ గ్రామం నుంచి వచ్చిన 13 కుటుంబాలు, పదిహేనేళ్ల కిందట జియమ్మవలస మండలం పీటీ మండ పంచాయతీ నుంచి వచ్చిన 8 కుటుంబాలు కలిపి మొత్తం 21 కుటుంబాలతో ఏనుగులగూడ గ్రామం ఏర్పడింది. వీరందరూ సవర (ఎస్టీ) కులానికి చెందిన వారే. అయితే, గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో వీరు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు. పూరిళ్లలోనే నివాసముంటున్నారు. ఇళ్లు కట్టుకోవాలన్నా వీరు ఉంటున్న స్థలాలకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి నెలకొంది. గ్రామంలో సీసీ రోడ్లు, కాలువలు లేవు. 8వేల లీటర్ల సామర్థ్యం గల నీటి ట్యాంకు ఉన్నా అది శిఽథిలమవడంతో నీరు లీకవుతుంది. దీంతో పూర్తిస్థాయిలో తాగునీరు అందడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల లేకపోవడంతో గ్రామానికి చెందిన ఎనిమిది మంది విద్యార్థినులు సీమలవానివలసలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. ఇక ఈగలు, దోమలతో వారు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. తినే ఆహార పదార్ధాలపై.. తాగే నీటిపై ఇలా ప్రతిదానీపై ఈగలు ముసురుకుంటున్నాయి. ప్రశాంతంగా కూర్చుందామన్నా ఈగల వల్ల కుదరడం లేదని గిరిజనులు వాపోతున్నారు. రాత్రులు మంచంపై పడుకుందామంటే దోమలు స్వైర విహారం చేస్తుండడంతో నిద్ర పట్టడం లేదని చెబుతున్నారు. ఐదేళ్ల కిందట అధికారులు ఇచ్చిన దోమ తెరలు చిరిగిపోయాయని, వాటినే కుట్టుకొని వాడుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమలో చాలామందికి 50 ఏళ్లు దాటినా పింఛన్లు అందడం లేదని అంటున్నారు. ఇక సీమలవానివలస గ్రామస్థులు దోమలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ 33 గిరిజన కుటుంబాలు ఉన్నాయి.
కోళ్ల ఫారమే కారణమా?
తమ గ్రామాల్లో ఈగలు, దోమలు స్వైర విహారం చేయడానికి కోళ్ల ఫారమే కారణమని ఏనుగులగూడ, సీమలవానివలస గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఈ రెండు గ్రామాలకు మధ్యలో ఓ ఫౌలీ్ట్ర ఫారం ఉంది. ఇది ఏనుగులగూడకు 150 మీటర్ల దూరంలోనే ఉండటంతో ఉదయం వేళ ఈగల బెడద ఎక్కువగా ఉందని ఆ గ్రామస్థులు అంటున్నారు. అంతేకాకుండా కోళ్ల వ్యర్థాల కారణంగా భరించలేని దుర్గంధం వెదజల్లుతుందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరతున్నారు.
ఇబ్బందులు పడుతున్నాం
మా గ్రామంలో పగలు ఈగలు విపరీతంగా ఉంటున్నాయి. రాత్రులు దోమలతో ఇబ్బందులు పడుతున్నాం. వీటివల్ల కంటి మీద కునుకు కరువైంది. దోమలు, ఈగల నివారణకు తగు చర్యలు తీసుకోవాలి.
ఆరిక లండన్, గిరిజనుడు, ఏనుగులగూడ

ఏనుగులగూడ గ్రామం
మౌలిక సదుపాయాలు లేవు
మా గ్రామంలో కనీస సదుపాయాలు లేవు. సీసీ రోడ్లు, కాలువలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. నీళ్ల ట్యాంకు శిథిలమవడంతో అందులో నీరు ఉండడం లేదు. ఇళ్లు కట్టుకుందా మంటే పొజిషన్ సర్టిఫికెట్లు లేవు.
మండంగి కళావతి, గిరిజన మహిళ, ఏనుగులగూడ.
పింఛన్ రాలేదు
50 ఏళ్లు దాటిన సవర (ఎస్టీ) కులస్థులకు పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ, మా గ్రామంలో నాతో పాటు బిడ్డిక సురేష్, మరికొందరికి 50 ఏళ్లు దాటినా పింఛన్లు మంజూరు కాలేదు.
పాలక వీరయ్య, గిరిజనుడు, ఏనుగులగూడ
కలెక్టర్‌కు నివేదిస్తా
గ్రామాల సమీపంలో ఫౌలీ్ట్ర ఫారం ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధం. దీనికి పశు సంవర్ధకశాఖ అనుమతి ఎలా ఇచ్చిందో తెలుసుకుని పూర్తి నివేదిక తయారు చేసి కలెక్టర్‌కు అందిస్తా.
- ఎన్.అప్పారావు, తహసీల్దార్, జియ్యమ్మవలస