Share News

Five years will not be completed! ఐదేళ్లయినా పూర్తికాలే!

ABN , Publish Date - Jan 04 , 2026 | 11:59 PM

Five years will not be completed! శృంగవరపుకోట ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి భవన నిర్మాణం పూర్తికాకపోవడంతో రోగులతో పాటు వైద్యులు ఇబ్బందులు పడుతున్నారు. పనులు ప్రారంభించి ఐదేళ్లవుతున్నా ఇంకా నూతన భవనం అందుబాటులోకి రాలేదు. దీంతో పాత ఆస్పత్రి భవనంలోనే రోగులకు సేవలందించాల్సి వస్తోంది. ఇక్కడ సరిపడా గదులు లేక రెండు, మూడు విభాగాలకు చెందిన వైద్యులు ఒకేచోట కూర్చొని రోగులను పరీక్షించాల్సి వస్తోంది. దీంతో ఏ వైద్యుడి వద్దకు వెళ్లాలో తెలియక రోగులు తికమకపడుతున్నారు.

Five years will not be completed! ఐదేళ్లయినా పూర్తికాలే!
నిర్మాణంలో శృంగవరపుకోట ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల భవనం

ఐదేళ్లయినా పూర్తికాలే!

అందుబాటులోకి రాని ఎస్‌.కోట ప్రాంతీయ ఆసుపత్రి నూతన భవనం

ఇంకా కొనసాగుతున్న పనులు

పాత ఆస్పత్రిలో గదులు సరిపడక రోగుల ఇబ్బందులు

ఒకేచోట సేవలందిస్తున్న ముగ్గురేసి వైద్యులు

శృంగవరపుకోట, జనవరి 4(ఆంధ్రజ్యోతి): శృంగవరపుకోట ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి భవన నిర్మాణం పూర్తికాకపోవడంతో రోగులతో పాటు వైద్యులు ఇబ్బందులు పడుతున్నారు. పనులు ప్రారంభించి ఐదేళ్లవుతున్నా ఇంకా నూతన భవనం అందుబాటులోకి రాలేదు. దీంతో పాత ఆస్పత్రి భవనంలోనే రోగులకు సేవలందించాల్సి వస్తోంది. ఇక్కడ సరిపడా గదులు లేక రెండు, మూడు విభాగాలకు చెందిన వైద్యులు ఒకేచోట కూర్చొని రోగులను పరీక్షించాల్సి వస్తోంది. దీంతో ఏ వైద్యుడి వద్దకు వెళ్లాలో తెలియక రోగులు తికమకపడుతున్నారు.

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి శాసన సభ్యురాలు కోళ్ల లలితకుమారి విన్నపం మేరకు నాటి టీడీపీ ప్రభుత్వం 50 పడకలతో ఉన్న ఎస్‌.కోట సామాజిక ఆసుపత్రిని 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిగా స్థాయిని పెంచింది. నూతన భవన నిర్మాణానికి భూమి పూజ జరుగుతుందన్నలోపే ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆసుపత్రి స్థాయిని తామే పెంచామని వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పి నాబార్డు నిధులు 12.60కోట్లు కేటాయించింది. 2020 అక్టోబరు 20న భవన నిర్మాణాలకు శంకుస్థాపన జరిగింది. 2022 జనవరి 25 నాటికి పూర్తి చేస్తామని చెప్పింది. కానీ, ఆ సమయానికి పునాదుల స్థాయి కూడా దాటలేదు. చేసిన పనులకు గాను కాంట్రాక్టర్‌కు సకాలంలో బిల్లులు చెల్లించలేదు. గట్టిగా అడిగితే కాంట్రాక్టర్లను మార్చడమే పనిగా పెట్టుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి గోడల నిర్మాణం కూడా జరగలేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత స్థానిక శాసన సభ్యురాలు కోళ్ల లలితకుమారి ఈ ఆసుపత్రి నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఏపీ వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) అధికారులతో మాట్లాడారు. వారిచ్చిన వివరాలను సీఎం నారా చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఆస్పత్రి పనులు ఊపందుకున్నాయి.

తప్పని అవస్థలు..

ఆస్పతి స్థాయి పెరగడంతో వంద పడకలు వచ్చాయి. జనరల్‌, చిన్నపిల్లలు, గైనిక్‌, చర్మ, నేత్ర, డెంటల్‌, ఆర్థోఫెడిక్‌ వంటి ప్రత్యేక విభాగాలు వచ్చాయి. అన్నిరకాల అనుభవం కలిగిన సిబ్బంది ఉన్నారు. ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, ఎంఎల్‌టీ వంటి కోర్సులు చేసేవారు శిక్షణకు వస్తున్నారు. రోగ నిర్ధారణకు అవసరమగు పరికరాలు కూడా సమకూరాయి. అయితే నూతన భవనాలు మాత్రం అందుబాటులోకి రాకపోవడంతో రోగులు, వైద్యులకు అవస్థలు తప్పడం లేదు. పాత ఆస్పత్రి భవనంలో చికిత్సకు అనుగుణంగా పరికరాలను అమర్చేందుకు గదులు కరువయ్యాయి. ప్రతిరోజూ వివిధ ప్రాంతాల నుంచి 300 నుంచి 400 మంది వరకు రోగులు ఇక్కడకు వస్తుంటారు. వీరిని పరీక్షించేందుకు స్పెషలిస్టు వైద్యులకు సరిపడా గదులులేవు. ఉన్న కొద్దిపాటి గదుల్లో అందరూ కూర్చొని రోగులను పరీక్షించాల్సి వస్తుంది. సరైన రోగ నిర్ధారణ చేసేందుకు కూడా వీలు కావడం లేదు. రెండు, మూడు విభాగాలకు చెందిన వైద్యులు ఒకేచోట కూర్చొని వైద్య పరీక్షలు చేస్తుండడంతో రోగులు కూడా వారడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ అత్యవసర వైద్యం పేరుతో జిల్లా కేంద్ర ఆసుపత్రికి రిఫరల్‌ చేస్తున్నారు. ఇప్పటికైనా ఆస్పత్రి నూతన భవన నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని రోగులు కోరుతున్నారు.

Updated Date - Jan 04 , 2026 | 11:59 PM