Share News

fishermens have arrived వచ్చేశారు

ABN , Publish Date - Feb 03 , 2026 | 12:13 AM

fishermens have arrived బంగ్లాదేశ్‌ చెర నుంచి విముక్తి పొంది ఎట్టకేలకు మత్స్యకారులు కుటుంబ సభ్యుల చెంతకు చేరారు. తమ వారిని చూసి తీవ్ర భావోద్వేగం చెందారు. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తేరిపార మొహాలను చూసి మురిసిపోయారు.

fishermens have arrived వచ్చేశారు
విశాఖ ఓడరేవు వద్దకు చేరుకొన్న బంగ్లాదేశ్‌ బంధీ మత్స్యకారులు

వచ్చేశారు

బంగ్లాదేశ్‌ నుంచి ఇళ్లకు చేరుకున్న మత్స్యకారులు

తమ వారిని చూసి భావోద్వేగం చెందిన కుటుంబీకులు

ప్రభుత్వం, మత్స్యకార నాయకులకు కృతజ్ఞతలు

బంగ్లాదేశ్‌ చెర నుంచి విముక్తి పొంది ఎట్టకేలకు మత్స్యకారులు కుటుంబ సభ్యుల చెంతకు చేరారు. తమ వారిని చూసి తీవ్ర భావోద్వేగం చెందారు. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తేరిపార మొహాలను చూసి మురిసిపోయారు. దుఃఖమంతా తీరాక పలకరించుకున్నారు. ఇన్నాళ్లూ పడిన బాధలను చెప్పుకుని ఇక ఏ కష్టాలూ పడొద్దని మాట్లాడుకున్నారు. కుటుంబాన్ని వీడే పరిస్థితి ఇక రాబోదని మత్స్యకారులు భరోసా ఇచ్చారు. ఈ భావోద్వేగ దృశ్యాలన్నీ విశాఖ ఓడరేవు వద్ద సోమవారం ఆవిష్కృతమయ్యాయి.

భోగాపురం, ఫిబ్రవరి2(ఆంధ్రజ్యోతి): మత్స్యకారులు ఎట్టకేలకు తమ వారి చెంతకు చేరుకున్నారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం సోమవారం ఉదయం విశాఖ ఓటరేవులో దిగారు. ఆ సమయంలో అందరి మొహాలు ఒక్కసారిగా మెరిసిపోయాయి. తమ వారిని చూసిన ఆనందంలో ఉబ్బితబ్బిబ్బు అయ్యారు. భోగాపురం మండలం కొండ్రాజు పాలెంకు చెందిన మరుపల్లి చిన్నఅప్పన్న, మరుపల్లి రమేష్‌, సూరాడ అప్పలకొండ, మరుపల్లి ప్రవీణ్‌, సురపతి రాము, అప్పలకొండ, పూసపాటిరేగ మండలం తిప్పలవసకు చెందిన నక్కా రమణ, వాసపల్లి సీతయ్య, మైలపల్లి అప్పన్న పడవపై గతేడాది అక్టోబరు 13వ తేదీన విశాఖ హార్బర్‌ నుంచి చేపల వేట కోసం సముద్రంపైకి వేటకు వెళ్లడం.. సముద్రంలో వేట సాగిస్తూ అదేనెల 22వ తేదీన వేకువజామున సుమారు 2గంటల సమయంలో సముద్రంలో బంగ్లాదేశ్‌ సరిహద్దు జలాలు దాటేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ కోస్టుగార్డ్సు వారిని అరెస్టు చేశారు. అనంతరం బంగ్లాదేశ్‌లోని బాగర్‌హాట్‌ జైల్లో నిర్భందించారు. అయితే మత్స్యకారుల విడుదల కోసం కొండ్రాజుపాలెంకు చెందిన నాయకుడు సూరాడ చిన్నారావు నాయకులు, అధికారుల చుట్టూ అనేక పర్యాయాలు తిరుగుతూ ప్రయత్రాలు చేశారు. అలాగే ఈస్ట్‌కోస్టు మెకనైజ్డ్‌ ఫిషింగ్‌ బోట్‌ ఓనర్స్‌ అసోషియేషన్‌ తరుపున అధ్యక్షుడు వాసపల్లి జానకీరామ్‌ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రభుత్వం కూడా సహకరించడంతో ఎట్టకేలకు ఇరు దేశాల అంగీకారంతో గతనెల 27న బంగ్లాదేశ్‌లో బందీలయిన భారత మత్స్యకారులను బంగ్లాదేశ్‌ విడుదల చేసింది. భోగాపురం, పూసపాటిరేగ మండలాలకు చెందిన 9 మంది మత్స్యకారులు ఇక్కడనుంచి వేటకెళ్లిన అదే బోటుపై ఇండియా కోస్టు గార్డ్సు ఆధీనంలో తిరిగి విశాఖ చేరుకొన్నారు. కోస్టుగార్డ్సు, నేవీ అధికారుల నిబంధనల ప్రకారం అన్ని ధ్రువీకరణ ప్రక్రియలు పూర్తి చేసి మత్స్యశాఖకు అప్పగించారు. అనంతరం అధికారులు సర్పంచ్‌ ప్రతినిధి సూరాడ చిన్నారావు, జానకీరామ్‌, నాయకులకు మత్స్యకారులను అప్పగించారు. గృహాలు విడిచి వెళ్లి వందరోజులు దాటడంతో ఒకరినొకరు హత్తుకొని కన్నీటి పర్యంతమయ్యారు. కొద్దిసేపయ్యాక యోగక్షేమాలు అడిగి తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.

బిడ్డను మొదటి సారి చూసి..

సూరాడ అప్పలకొండ బంగ్లాదేశ్‌లో బంధీ అయిన నాటికి అతని భార్య అనిత నిండు గర్భిణి. ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఎట్టకేలకు స్వగృహానికి వచ్చిన తండ్రి తన బిడ్డను ఆత్రంగా చూసేందుకు ప్రయత్నించగా మొదటిసారిగా బిడ్డ ముఖం నూనెలో చూడాలని పెద్దలు చెప్పగా బిడ్డ మొహాన్ని అప్పలకొండ నూనెలో చూసి అనంతరం చేతుల్లోకి తీసుకున్నాడు.

ఘన స్వాగతం

బంగ్లాదేశ్‌ చెరనుంచి వచ్చిన మత్స్యకారులకు విశాఖ ఓడరేవులో అధికారులు, మత్స్యకార నాయకులు, కుటంబీకులు పూలు జల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. వారికి దాస్సాలువాలు, పూలదండలు వేసి ఆహ్వానించారు. 9 మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం బియ్యం, నిత్యావసర సరుకులు అందజేసింది.

Updated Date - Feb 03 , 2026 | 12:13 AM