Share News

Elephant గజరాజుల కట్టడికి తొలి అడుగు

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:09 AM

First Step to Curb Elephant Menace జిల్లాలో ఏనుగుల సమస్యల పరిష్కారానికి తొలి అడుగు పడింది. కూటమి చొరవతో ఎట్టకేలకు గుచ్చిమి ఫారెస్ట్‌లో ఎలిఫెంట్‌ జోన్‌ శిబిరం ప్రారంభమైంది. దీంతో మన్యం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  Elephant    గజరాజుల కట్టడికి తొలి అడుగు
గుచ్చిమిలో ఏనుగుల ఎలిఫెంట్‌ జోన్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి సంధ్యారాణి

  • వర్చువల్‌గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌

  • హాజరైన మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు, అధికారులు

సీతానగరం, జూలై29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఏనుగుల సమస్యల పరిష్కారానికి తొలి అడుగు పడింది. కూటమి చొరవతో ఎట్టకేలకు గుచ్చిమి ఫారెస్ట్‌లో ఎలిఫెంట్‌ జోన్‌ శిబిరం ప్రారంభమైంది. దీంతో మన్యం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న గజరాజుల బెడద ఇక తప్పనుందని అభిప్రాయపడుతున్నారు. గుచ్చిమిలో ఏర్పాటు చేసిన ఏనుగుల సంక్షరణ కేంద్రాన్ని బుధవారం వర్చువల్‌ పద్ధతిలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజలను కాపాడుతూనే వన్య ప్రాణులను సంరక్షించడం ప్రభుత్వ బాధ్యత. ఎన్నికల సమయంలో మన్యం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఏనుగుల సమస్య పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. కర్ణాటక ప్రభుత్వం సహకారంలో జిల్లాకు పంపించిన రెండు కుంకీల సాయంతో గజరాజులను కట్టడి చేసి ఎలిఫెంట్‌ జోన్‌కు తరలించాలి.’ అని తెలిపారు.

అనంతరం గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఏనుగుల సంరక్షణ కేంద్రం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఏనుగుల సమస్యకు కూటమి ప్రభుత్వం చేతల్లో పరిష్కారం చూపింది. గత వైసీపీ సర్కారు మాటలకే పరిమితమైంది. పంటలు, ప్రజల ప్రాణాలకు నష్టం జరగకుండా కుంకీ ఏనుగులు కీలక పాత్ర పోషిస్తాయి.’ అని తెలిపారు. ఎలిఫెంట్‌ జోన్‌కు వెళ్లే మార్గాన్ని బీటీ రోడ్డుగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ.. కూటమి సర్కారు చొరవతో మన్యం ప్రజలకు ఏనుగుల సమస్య నుంచి గొప్ప ఊరట లభించిందన్నారు. గుచ్చిమి ప్రాంతాన్ని ఎలిఫెంట్‌ శాంక్చువరీ, బయోడైవర్సిటీ పార్కు, ఈకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్య అటవీ సంరక్షణ అధికారి ఐకేవీ రాజు మాట్లాడుతూ.. కొద్ది రోజుల తర్వాత కుంకీ ఏనుగులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి.. అటవీ ఏనుగుల నియంత్రణ కార్యక్రమాల్లో వినియోగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి, డీఎఫ్‌వో ప్రసూన తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2026 | 12:09 AM